శనివారం 04 ఏప్రిల్ 2020
Jayashankar - Feb 27, 2020 , 03:10:21

మోడల్‌ సిటీగా భూపాలపల్లి

మోడల్‌ సిటీగా భూపాలపల్లి

జయశంకర్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ/కృష్ణకాలనీ, ఫిబ్రవరి 26 : పారిశ్రామికంగా దినదినాభివృద్ధి చెందుతూ శరవేగంగా విస్తరిస్తున్న భూపాలపల్లి పట్టణాన్ని ప్రజల భాగస్వామ్యంతో మోడల్‌ సిటీగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు. భూపాలపల్లిలోని పలు కాలనీల్లో స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, కలెక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ అజీమ్‌తో కలిసి బుధవారం పర్యటించారు. 6వ వార్డు కృష్ణకాలనీలో పచ్చదనం, పరిశుభ్రతను చూశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, వార్డు కమిటీ సభ్యులు, కాలనీ ప్రజలతో మమేకమై కాలనీలో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అంబేద్కర్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పట్టణ ప్రగతి వార్డు కమిటీ సభ్యులనుద్దేశించి ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వం ప్రజల భాగస్వామ్యంతో పలు కా ర్యక్రమాలను అమలు చేసి సత్ఫలితాలను సాధిస్తుందని చెప్పా రు. దశాబ్దాల కాలంగా పేరుకుపోయిన సమస్యలను పల్లె ప్రగతితో పరిష్కరించి ప్రగతి పథంలో నడిపిస్తున్నామని, పట్టణ ప్రగతిని అమలు చేసి పట్టణాలను అద్దంలా మెరిపించేలా, శరవేగంగా అభివృద్ధి జరిగేలా చూస్తున్నామన్నారు. రాష్ట్రంలోని పట్టణాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రతినెలా రూ.70 కోట్లను విడుదల చేస్తుందని, ఈ నిధులు మున్సిపాలిటీలకు అందుతున్నాయన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీకి ప్రతినెలా రూ.57 లక్షల నిధులు వస్తాయని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా వాటిని వార్డులకు కేటాయించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్రతి కౌన్సిలర్‌ తన పరిధిలోని వార్డుల్లో పారిశుధ్యం, హరితహారం పనులను విజయవంతంగా చేపట్టి రాష్ట్ర స్థాయిలో భూపాలపల్లిని మోడల్‌ సిటీగా అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని, దీనికి తమవంతు సహకారం ఉంటుందని మంత్రి చెప్పారు. పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రాధాన్యత అంశంగా తీసుకొని కలెక్టర్‌ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్‌ సూచన మేరకు సమర్ధవంతంగా పని చేయాలని, ప్రజల భాగస్వామ్యంతో ప్రగతిని సాధించాలన్నారు. పట్టణ అవసరాలకు దాతలను వెతికి భాగస్వాములను చేయాలని కమిటీ సభ్యులకు, కౌన్సిలర్లకు, అధికారులకు మంత్రి సూచించారు.  శ్మశాన వాటికలు, సమీకృత మార్కెట్‌, సామూహిక సులభ్‌ కాంప్లెక్స్‌లు నిర్మించుకోవాలన్నారు. లూజ్‌ లైన్లు, ఇనుప స్తంభాలు లాంటి విద్యుత్‌ రంగ సమస్యలు పరిష్కరించుకోవాలని, పట్టణాన్ని విద్యుత్‌ కాంతులతో కళకళలాడించాలన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని ఖాళీ స్థలాలు, ఇండ్ల పరిసరాలు, ప్రభుత్వ స్థలాల్లో శుభ్రత పాటించేలా చూడాలన్నారు. ఖాళీ స్థలాల యజమానులకు నోటీసులు ఇవ్వాలని, వారు స్పందించకుంటే శుభ్రం చేసి ఆ బిల్లులను స్థలాల యజమానుల వద్ద వసూలు చేయాలన్నారు. భూపాలపల్లిలో పందుల సమస్య తీవ్రంగా ఉందని, ప్రత్యామ్నాయంగా వారికి ఉపాధి చూపెట్టి వాటిని దూరంగా పంపాలన్నారు. 

త్వరలోనే భూపాలపల్లికి మంత్రి కేటీఆర్‌

భూపాలపల్లి పట్టణంలో పట్టణ ప్రగతిని సమర్ధవంతంగా అమలు చేస్తే త్వరలోనే మంత్రి కేటీఆర్‌ను భూపాలపల్లికి తీసుకువస్తానని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రకటించారు. ఉద యం తాను ఫోన్‌లో మాట్లాడినప్పుడు ఈ విషయాన్ని ప్రాథమికంగా కేటీఆర్‌కు చెప్పినట్లు తెలిపారు. ఉద్యమ రూపకర్తలో ఒకరైన ప్రొఫెసర్‌ జయశంకర్‌ పేరుతో ఏర్పాటైన భూపాలపల్లి జిల్లాకు వచ్చేందుకు మంత్రి సుముఖంగా ఉన్నారని చెప్పారు. 

విద్యుత్‌ శాఖ అధికారులకు మెమో ఇవ్వండి

పట్టణ ప్రగతి కార్యక్రమానికి గైర్హాజరైన విద్యుత్‌ శాఖ అధికారులకు వెంటనే మెమోలు జారీ చేయాలని కలెక్టర్‌ అజీమ్‌ను మంత్రి దయాకర్‌రావు ఆదేశించారు. పట్టణంలో ఉదయం 8 గంటల నుంచి తాము పర్యటించి, సమావేశంలో పాల్గొన్నప్పటికీ స్థానిక విద్యుత్‌ అధికారులు హాజరు కాకపోవడాన్ని మంత్రి తప్పుబట్టారు. హాజరు కాని కౌన్సిలర్లు, అధికారులకు నోటీసు లు జారీ చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. కౌన్సిలర్లు, అధికారులు వార్డులను వదిలి సొంత పనులు చేసుకుంటే పదవులు పోతాయని హెచ్చరించారు. కాగా, కృష్ణకాలనీలో ప్రధాన రహదారిపై ఓ కారు తుప్పు పట్టి ఉండడంతో దానిని రోడ్డు మీది నుంచి తీసేయాలని సూచించారు.

రాజకీయాలకతీతంగా అభివృద్ధి

రాజకీయాలకు అతీతంగా పట్టణాన్ని అభివృద్ధి చేసుకుందామని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పిలుపునిచ్చారు. ఎవరికి వారు పట్టణాన్ని తమదిగా భావించాలని, పరిశుభ్రగా ఉం చాలన్నారు. కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజ లు పట్టణ ప్రగతిలో పాల్గొని, వార్డులను సందర్శించి సమస్యలు పరిష్కరించాలన్నారు. పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దాల ని, పచ్చదనం, పరిశుభ్రతలో ముందుంచాలని కోరారు. భూపాలపల్లి చిట్టడవిని తలపించేలా, ఆక్సిజన్‌ అందించే మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సెగ్గం వెంకటరాణి సిద్ధు మాట్లాడుతూ.. భూపాలపల్లిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే క్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు తమవంతు సహకారాన్ని అందిస్తున్నారని చెప్పారు. వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. భూపాలపల్లి కలెక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ అజీం మాట్లాడుతూ..  పట్టణంలో పారిశుధ్య పనులు, విద్యుత్‌ సౌకర్యాల పెంపు, ప్రజా మరుగుదొడ్ల ఏర్పాటు, పట్టణ సుందరీకరణ, సమీకృత మార్కెట్‌ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మానవ మలాన్ని ఎరువుగా తయారు చేయడానికి ఫీకల్‌ స్లెడ్జ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేశామని, కృష్ణకాలనీ స్థల పరిశీలన పూర్తయిందన్నారు. అందరి సహకారంతో పట్టణాన్ని సుందరంగా మార్చుతామని కలెక్టర్‌ వివరించారు. ఆయా కార్యక్రమాల్లో జెడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ కల్లెపు శోభా రఘుపతిరావు, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ కొత్త హరిబాబు, జిల్లా అదనపు ఎస్పీ శ్రీనివాసులు, ఆర్డీవో వైవీ గణేశ్‌, డీఎస్పీ సంపత్‌రావు, తహసీల్దార్‌ అశోక్‌కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ సమ్మయ్య, కౌన్సిలర్లు ఎడ్ల మౌనికా శ్రీనివాస్‌, పానుగంటి హారికా శ్రీనివాస్‌, కొక్కుల స్వరూపారాణి తిరుపతి, ఉడుత సరోజన, శిరుప అనిల్‌, మేకల రజితా మల్లేశ్‌, నూనె రాజు, గండ్ర హరీశ్‌రెడ్డి, ముంజంపల్లి మురళీధర్‌, మంగళపల్లి తిరుపతి, పిల్లలమర్రి శారదా నారాయణ, ముంజాల రవీందర్‌, జక్కం రవికుమార్‌, దార పూలమ్మ పోషయ్య, అజ్మీరా రజితా జుమ్మూలాల్‌, నాగవెల్లి సరళ రాజలింగమూర్తి, పీఏసీఎస్‌ చైర్మన్‌ మేకల సంపత్‌కుమార్‌ యాదవ్‌, రాంపూర్‌ సర్పంచ్‌ తాటి వెంకటేశ్వర్లు, టీఆర్‌ఎస్‌ అర్బన్‌ అధ్యక్షుడు క్యాతరాజు సాంబమూర్తి, తాటి అశోక్‌, కరీం, బెడ్డల పోషయ్య, రాజిరెడ్డి, తిరుపతి, నరసింహచారి, రమేష్‌, సురేందర్‌రెడ్డి, మేనం తిరుపతి, వేములవాడ రమేశ్‌, బడితల సమ్మయ్య, గోనె భాస్కర్‌, టీఆర్‌ఎస్‌ అర్బన్‌ యూత్‌ అధ్యక్షుడు చిరంజీవి, శ్రీకాంత్‌, పోలవేన మహేందర్‌యాదవ్‌, రవితేజ, హరీశ్‌, టీజేఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు మాడ హరీశ్‌రెడ్డి, నాయకులు చీకటి గణేశ్‌, వంశీ, గోవర్ధన్‌, సింగనవేని విజేత, కమల, తిరుపతమ్మ, భాగ్య, శ్రీల త, 6, 7, 26వ ప్రత్యేకాధికారులు వేములవాడ రాజేశ్వరి, శ్యాంబాబు, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 


logo