గురువారం 02 ఏప్రిల్ 2020
Jayashankar - Feb 27, 2020 , 03:07:45

పల్లె, పట్టణ ప్రగతిని పకడ్బందీగా నిర్వహించాలి

పల్లె, పట్టణ ప్రగతిని పకడ్బందీగా నిర్వహించాలి

కలెక్టరేట్‌, ఫిబ్రవరి 26: పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ రాష్ట్ర ప్రిన్సిపల్‌ సెక్రటరీ సందీప్‌కుమార్‌ సుల్తానియా అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్‌, పురపాలక శాఖ అధికారులతో కలిసి బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జిల్లాలో జరుగుతున్న పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై కలెక్టర్లతో సమీక్షించారు. పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా పల్లెలు, పట్టణాలు అన్ని సుందరంగా తయారు కావాలని, గ్రామాలు, మున్సిపాలిటీల్లో పారిశుధ్య పనులు చేపట్టాలన్నారు. నర్సరీల ఏర్పాటు పూర్తి చేయాలని, హరితహారం కార్యక్రమానికి మొక్కలు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. నాటిన మొక్కలను సంరక్షించే పనులు తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని, ప్రజామరుగుదొడ్లు, వైకుంఠధామాలు, డంపింగ్‌యార్డుల ఏర్పాటుకు కృషి చేయాలని, విద్యుత్‌ సమస్యలు పరిష్కరించాలని సూచించారు. వర్షాకాలం నాటికి నర్సరీల్లో మొక్కలు అందుబాటులో ఉండాలని, ఆ మేరకు బ్యాగుల్లో మట్టినింపే పనులు పూర్తి చేయాలని కోరారు. ప్రతి శుక్రవారం వాటర్‌ డే నిర్వహించి మొక్కలకు నీరు పట్టాలని, అన్ని జీపీలకు ట్రాక్టర్లు కొనుగోలు చేయాలన్నారు. పన్నుల వసూలును తప్పనిసరిగా నిర్వహించాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ అజీమ్‌ మాట్లాడుతూ జిల్లాలో పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రజాప్రతినిధులు, అధికారులు అంకితభావంతో పని చేస్తున్నారని, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారని తెలిపారు. నర్సరీల ఏర్పాటులో బ్యాగ్‌ల ఫిల్లింగ్‌ 90 శాతం పూర్తయ్యిందని చెప్పారు. సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్‌ రాజా విక్రంరెడ్డి, డీఆర్డీవో సుమతి, జెడ్పీసీఈవో శిరీష, డీపీవో చంద్రమౌళి, ఇతర అధికారులు పాల్గొన్నారు.


logo
>>>>>>