గురువారం 02 ఏప్రిల్ 2020
Jayashankar - Feb 27, 2020 , 03:06:30

వన్యప్రాణుల గుర్తింపుపై అధికారులకు శిక్షణ

వన్యప్రాణుల గుర్తింపుపై అధికారులకు శిక్షణ

ములుగు, నమస్తే తెలంగాణ: ములుగు జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఉండే వన్య ప్రాణులను గుర్తించేందుకు త్వరలో సర్వే నిర్వహించనుండగా, ఈ మేరకు అవగాహన కల్పించేందుకు ‘హైటీ కాస్‌' సంస్థ ఆధ్వర్యంలో అటవీ శాఖ అధికారులకు బుధవారం వర్క్‌షాప్‌ నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకుడు ఇమ్రాన్‌ సిద్ధిఖీ పాల్గొన్నారు. పులి, చిరుత, హైన, అడవి కుక్కలు, శాఖహార జంతులైన మెకం, కనుజు, చుక్కల దుప్పి, కొండగొర్రె, అడవి దున్న తదితర వన్య ప్రాణుల ఉనికిని తెలుసుకునేందుకు సిబ్బందికి అవగాహన కల్పించారు. అటవీ శాఖ హైదరాబాద్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ సొసైటీ(హైటీ కాస్‌) సంయుక్తంగా ఈ సర్వే నిర్వహిస్తున్నది. ఏటూరునాగారం అభయారణ్యంతో పాటు జిల్లాలోని ఇతర అటవీ ప్రాంతాల్లో సర్వే కొనసాగనున్నది. వన్య ప్రాణుల సంఖ్యను లెక్కించేందుకు, నేలపై, చెట్లపై జంతువుల గుర్తులు, పాదముద్రలతో పాటు వాటి వెంట్రుకలు, మలాన్ని ఆధారం చేసుకొని వన్య ప్రాణుల ఉనికిని నిర్దారించనున్నారు. శిక్షణా కార్యక్రమంలో డీఎఫ్‌వోలు ప్రదీప్‌కుమార్‌శెట్టి, రామలింగం, అర్చన, ఎఫ్‌డీవోలు, అటవీ శాఖ సిబ్బం ది పాల్గొన్నారు.


logo
>>>>>>