శనివారం 28 మార్చి 2020
Jayashankar - Feb 27, 2020 , 03:06:30

మారుతున్న ముఖచిత్రం

మారుతున్న ముఖచిత్రం

భూపాలపల్లి టౌన్‌, ఫిబ్రవరి 26: పట్టణ ప్రగతి కార్యక్రమంతో భూపాలపల్లి ముఖచిత్రం మారుతున్నది. ఈ మున్సిపాలిటీకి ప్రభుత్వం రూ.57 లక్షలు విడుదల చేసింది. 10 రోజులకు గానూ వార్డుల అభివృద్ధికి ఈ నిధులు ఖర్చు చేయాల్సి ఉంది. ప్రతి నెలా రూ.57 లక్షలు పట్టణాభివృద్ధికి ప్రభుత్వం మంజూరు చేయనుంది. పట్టణ ప్రగతి సందర్భంగా వార్డుల్లో కౌన్సిలర్‌లు సమస్యలను గుర్తిస్తూ రికార్డు చేస్తున్నారు. పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు. సైడ్‌ డ్రైనేజీలు క్లీన్‌ చేయడం, చెత్తా చెదారం, పిచ్చి మొక్కలు, చెట్ల పొదలు తొలిగించడం తదితర కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. బుధవారం నాటికి పట్టణ ప్రగతి మూడో రోజుకు చేరింది. మూడు రోజులుగా జరుగుతున్న కార్యక్రమంతో వార్డుల్లో మార్పు కనిపిస్తున్నది. ఖాళీ స్థలాలపై మున్సిపల్‌ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. పట్టణంలో విచ్చలవిడిగా ఖాళీ స్థలాలున్నాయి. స్థలాల యజమానులు ఇండ్లు నిర్మించుకోకుండా, పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. దీంతో ఆ స్థలాల్లో పిచ్చి మొక్కలు మొలిచాయి. చుట్టుపక్కల ఇళ్ల ప్రజలు, స్థానికులు ఆ ప్లాట్లలో చెత్త పోస్తుండడంతో అవి అధ్వానంగా మారి దోమలు వ్యాప్తి చెందుతున్నాయి. జనం అనారోగ్యాలబారిన పడుతున్న విషయాన్ని గమనించిన అధికారులు ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలకు ఉపక్రమించారు. ఖాళీ స్థలాల్లో చెత్తా చెదారం ఉంటే స్థల యజమానికి నోటీసులు ఇస్తున్నారు. అప్పటికీ స్పందించకపోతే రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు జరిమానా విధించేందుకు నిర్ణయించారు. పట్టణంలోని కృష్ణకాలనీ, టీ-2 క్వార్టర్స్‌లో బుధవారం జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, కలెక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ అజీం పాల్గొన్నారు. 

వార్డుల్లో పండుగలా..

పట్టణంలోని అన్ని వార్డుల్లో పట్టణ ప్రగతి కార్యక్రమం పండుగలా కొనసాగుతున్నది. పట్టణంలోని 30 వార్డుల్లో వార్డు కౌన్సిలర్‌లు, ప్రత్యేక అధికారుల సమక్షంలో పట్టణ ప్రగతి ముందుకు సాగుతున్నది. డ్రైనేజీలు శుభ్రమవుతున్నాయి. చెత్తా చెదారం, పిచ్చిమొక్కల తొలిగింపు కార్యక్రమం యుద్ధప్రాతిపదికన జరుగుతున్నది. పట్టణ ప్రగతిలో అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేసే చర్యలకు ప్రాధాన్యమిస్తున్నారు. యువకులు, వృద్ధులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులను భాగస్వాములు చేస్తున్నారు. మన్సిపాలిటీ పరిధిలో మొత్తం 30 వార్డుల్లో ఏర్పాటు చేసిన వార్డు కమిటీ సభ్యులు 1800 మంది పట్టణ ప్రగతిలో కలిసి పని చేస్తున్నారు. రోడ్డుపై ఉన్న చిరువ్యాపారస్తులను ఇబ్బంది పెట్టకుండా ప్రత్యేకంగా వారికి స్థలాలు చూపిస్తూ అవకాశం కల్పిస్తున్నారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సెగ్గం వెంకటరాణి గడ్డిగానిపల్లి, సెగ్గంపల్లి గ్రామాల్లో, వైస్‌ చైర్మన్‌ కొత్త హరిబాబు ఖాసీంపల్లిలో పట్టణ ప్రగతిని కొనసాగిస్తూ అన్ని వార్డుల్లో ప్రగతిని సమీక్షిస్తున్నారు. కమిషనర్‌ సమ్మయ్య, వార్డుల ప్రత్యేక అధికారులు రోజువారీ పట్టణ ప్రగతి కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ కార్యక్రమాలను ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌ చేస్తున్నారు. 

ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి

జిల్లాలో ఒకే ఒక్క మున్సిపాలిటీ భూపాలపల్లి హెడ్‌క్వార్టర్‌లో ఉండడంతో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రత్యేక దృష్టిసారించారు. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కేసీఆర్‌, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌లు నిత్యం పట్టణ ప్రగతిని హైదరాబాద్‌ నుంచి సమీక్షిస్తున్నారు. రోజువారీ మున్సిపాలిటీల నుంచి ఆన్‌లైన్‌లో వచ్చే కార్యక్రమాలను పరిశీలిస్తూ సలహాలు, సూచనలిస్తున్నారు. పనితీరు సక్రమంగా లేని అధికారులను మందలిస్తున్నారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టి పట్టణ ప్రగతిలో ముందు వరుసలో ఉంటున్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును పిలిపిస్తూ పర్యవేక్షించేలా చూస్తున్నారు. ఇప్పటికే ప్రగతి దిశగా కాలనీలు అడుగులు వేస్తున్నాయి. పదిరోజులు గడిచే సరికి పట్టణ రూపురేఖలు మార్చేందుకు ఎమ్మెల్యే ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నారు.


logo