శనివారం 04 ఏప్రిల్ 2020
Jayashankar - Feb 27, 2020 , 03:04:06

జోరుగా పల్లెప్రగతి పనులు

జోరుగా పల్లెప్రగతి పనులు

భూపాలపల్లి, నమస్తే తెలంగాణ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూడో విడత పల్లె ప్రగతి కార్యక్రమం జిల్లాలో పరుగులు పెడుతున్నది. మొదటి, రెండో విడతల్లో చేపట్టిన పల్లె ప్రగతిలో మెజార్టీ గ్రామాల్లో సమస్యలు పరిష్కారమయ్యాయి. ఆ రెండు విడతల్లో చేపట్టి పలు గ్రామాల్లో మిగిలి ఉన్న పనులు త్వరగా కొనసాగిస్తున్నారు. శ్మశాన వాటికల నిర్మాణం, డంపింగ్‌ యార్డుల ఏర్పాటును వేగవంతం చేశారు. చెత్తా చెదారాన్ని తొలగించే ప్రక్రియను ప్రజాప్రతినిధులు, అధికారులు కొనసాగిస్తున్నారు. గ్రామాల్లో పారిశుధ్యం లోపించకుండా గ్రామస్తులను చైతన్య పరుస్తున్నారు. మహదేవపూర్‌ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చేపట్టిన నర్సరీని జెడ్పీ చైర్‌పర్సన్‌ జక్కు శ్రీహర్షిణి రాకేశ్‌ బుధవారం సందర్శించారు. స్వయంగా సంచుల్లో విత్తనాలను నింపారు. టేకుమట్ల మండలం బూర్నపల్లిలో డీఎల్‌పీవో సుధీర్‌ పారిశుధ్య పనులను పరిశీలించారు. గ్రామాల్లో మిగిలి ఉన్న పాత బావులను పూడ్చివేస్తున్నారు. విద్యుత్‌ స్తంభాలు దెబ్బతిన్న చోట కొత్తవి వేస్తున్నారు. గణపురం మండలం అప్పయ్యపల్లిలో కొత్త విద్యుత్‌ స్తంభాలను వేశారు. గ్రామాల్లో అవసరమైన పనులను ఆయా శాఖల అధికారులు సత్వరమే చేస్తున్నారు. వచ్చే జూన్‌ నాటికి హరితహారం పథకాన్ని విజయవంతం చేయడానికి ఇప్పటి నుండే గ్రామ పంచాయతీల్లోని నర్సరీల్లో మొక్కలు సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతున్నది. పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రత్యేకాధికారులు పకడ్బందీగా పర్యవేక్షిస్తున్నారు. పలు గ్రామాల్లో మొక్కలు విరివిగా పెట్టి రక్షించారు. మెజార్టీ గ్రామాలు హరిత శోభను సంతరించుకున్నాయి. 


logo