బుధవారం 08 ఏప్రిల్ 2020
Jayashankar - Feb 26, 2020 , 02:16:26

ప్రభుత్వ దవాఖానల్లో నాణ్యమైన వైద్య సేవలందించాలి

ప్రభుత్వ దవాఖానల్లో నాణ్యమైన వైద్య సేవలందించాలి

కలెక్టరేట్‌, ఫిబ్రవరి 25 : ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలందించాలని జిల్లా కలెక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ అజీమ్‌ వైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్‌ కార్యాలయంలో వైద్య ఆరోగ్యశాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖాధికారులతో సమావేశం నిర్వహించి వైద్య ఆరోగ్య శాఖ సేవలు, పౌష్టికాహార కల్పనపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని నిరుపేదలందరికీ నాణ్యమైన వైద్య సేవలందించేలా వైద్య ఆరోగ్యశాఖ పని చేయాలని అన్నారు. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రులకు పెయింట్స్‌ వేసి ఆసుపత్రుల పరిసరాలను శుభ్రం చేయాలన్నారు. అవసరమైన పరికరాలను సమకూర్చుకోవాలని, ఖాళీగా ఉన్న వైద్య సిబ్బందిని నియమించేందుకు ప్రతిపాదనలు పంపాలని తెలిపారు. టీబీ క్యాంపులు నిర్వహించి హెల్త్‌ సూపర్‌వైజర్లు, ఆశాలు, టీబీ పేషెంట్లను గుర్తించి వైద్య సేవలందించడంలో సహకరించాలని అన్నారు. వ్యాధి నిరోధక టీకాలను అవసరమైన వారికి ఇవ్వాలని, అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు జరిగేలా వైద్య ఆరోగ్యశాఖ చూడాలని అన్నారు. అన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు పెయింట్‌ వేసి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, విద్యుద్దీపాలను ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. మెనూ ప్రకారం చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందించాలని, అంగన్‌వాడీ కేంద్రాల్లో నమోదైన పిల్లలందరూ హాజరుకావాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ గోపాల్‌రావు, డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ వాసుదేవ రెడ్డి, జిల్లా టీబీ అధికారి డాక్టర్‌ మమత, వైద్యాధికారులు, జిల్లా సంక్షేమశాఖ అధికారి శ్రీదేవి, సీడీపీవోలు అవంతి, రాధిక, అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు తదితరులు పాల్గొన్నారు.


logo