బుధవారం 01 ఏప్రిల్ 2020
Jayashankar - Feb 25, 2020 , 03:07:27

పండుగలా పట్టణ ప్రగతి

పండుగలా పట్టణ ప్రగతి

భూపాలపల్లి టౌన్‌, పిబ్రవరి 24 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమానికి భూపాలపల్లిలో అధికారులు సోమవారం శ్రీకారం చుట్టారు. మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డుల్లో ఉదయం పట్టణ ప్రగతి కార్యక్రమం పండుగలా ప్రారంభమైంది. వార్డుల వారీగా కేటాయించిన ప్రత్యేకాధికారి, కౌన్సిలర్‌ ఆధ్వర్యంలో పట్టణ ప్రగతి కార్యక్రమ పనులు ప్రారంభించారు. వార్డుల్లో ప్రత్యేకాధికారులు, కౌన్సిలర్లు సమస్యలను గుర్తించి ఇంకా చేయాల్సిన పనుల జాబితాను తయారు చేశారు. వార్డుల్లో పేరుకుపోయిన సమస్యలపై పరిష్కారానికి నడుం బిగించారు. ముఖ్యంగా చెత్తా చెదారాన్ని తొలగించడం, పిచ్చి మొక్కలు, పొదలను తీసివేయడం, డ్రైనేజీలను శుభ్రం చేసే పనులను చేపట్టారు. ప్రారంభం రోజు అన్ని వార్డుల్లో సందడి వాతావరణం కనిపించింది. భూపాలపల్లిలోని 3, 4, 23వ వార్డుల్లో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, కలెక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ అజీమ్‌, అదనపు కలెక్టర్‌ రాజా విక్రంరెడ్డిలు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. మొదటి రోజు అన్ని వార్డుల్లో చేసిన పనులను ప్రత్యేకాధికారులు ఫొటోలు తీసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయడం ప్రారంభించారు. 


ప్రత్యేక నజర్‌..

ప్రభుత్వం పల్లె ప్రగతి స్ఫూర్తితో చేపట్టిన పట్టణ ప్రగతిని అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఏరోజుకారోజు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై పర్యవేక్షణ జరుపుతూ ఆరా తీస్తుండడంతో అధికార వర్గాల్లో అలజడి మొదలైంది. అందులోనూ చేసిన పనులు ఏ రోజుకారోజు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తుండడంతో పనులు చిత్తశుద్ధితో కొనసాగుతున్నాయి. జిల్లాలో ఏకైక మున్సిపాలిటీ భూపాలపల్లి కావడంతో కలెక్టర్‌, ఎమ్మెల్యే పట్టణంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్‌ అజీమ్‌ పట్టణ ప్రగతిని ఛాలెంజ్‌గా తీసుకొని పనులు చేయిస్తున్నారు. పట్టణ ప్రగతి కొనసాగే పది రోజుల్లో ఒకరోజు వందశాతం శ్రమదానం చేయాలని సూచించారు. అలాగే వార్డుల వారీగా ఒక రోజు ప్రజా దర్బార్‌ పెట్టుకొని సమస్యల జాబితా సిద్ధం చేయాలని, పది రోజుల్లో ఏదో ఒక రోజు ప్రజావాణిని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తామని, ఆ రోజు వార్డుల్లో సమస్యల జాబితాను తీసుకురావాలని కలెక్టర్‌ వార్డు సభ్యులకు సూచించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మున్సిపాలిటీ పరిధిలో సమస్యల పరిష్కారానికి పట్టణ ప్రగతి ఒక మంచి వేదిక అన్నారు. పట్టణంలో పెండింగ్‌లో ఉన్న పనులను కాంట్రాక్టర్లతో వెంటనే పూర్తి చేయించాలని కమిషనర్‌ను ఆదేశించారు. పట్టణ ప్రగతితో వార్డులు నీట్‌గా మారాలని, కౌన్సిలర్ల మార్క్‌ కనిపించాలన్నారు. మున్సిపాలిటీకి పట్టణ ప్రగతిలో భాగంగా రూ.57 లక్షలు మంజూరయ్యాయని, చిత్తశుద్ధితో పని చేయించుకోవాలన్నారు. శ్మశాన వాటిక ఏడాదిన్నరలో పూర్తి కావాలన్నారు. పబ్లిక్‌ టాయిలెట్స్‌కు అధిక ప్రాధాన్యమివ్వాలని, ప్రభుత్వ భూముల ఆక్రమణను నియంత్రించాలన్నారు. సింగరేణి అధికారులు సైతం పట్టణ ప్రగతిలో భాగస్వాములు కావాలన్నారు. పబ్లిక్‌ టాయిలెట్స్‌, ప్రభుత్వ భూముల ఆక్రమణను నియంత్రించడం, పట్టణ ప్రగతిపై చిత్తశుద్ధి కనబర్చడం, శ్మశాన వాటిక నిర్మాణాన్ని 45 రోజుల్లో పూర్తి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. 


వివరాలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌..

మున్సిపాలిటీ పరిధిలో గల 30 వార్డుల్లో చేసిన పనులను ప్రత్యేకాధికారులు ఏ రోజుకారోజు వారికి కేటాయించిన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. సోమవారం పట్టణంలోని 30 వార్డుల్లో పట్టణ ప్రగతి కార్యక్రమం కొనసాగింది. వార్డు కౌన్సిలర్‌తోపాటు ప్రత్యేకాధికారి, ఆ వార్డుకు చెందిన 60 మంది వార్డు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో పనులు కొనసాగాయి. ముఖ్యంగా డ్రైనేజీలను శుభ్రం చేయడం, పిచ్చి మొక్కలు, పొదలు, చెత్తా చెదారం తొలగించడం తదితర పనులను కొనసాగించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వార్డుల్లో నిర్విరామంగా పనులు కొనసాగించడంతో చెత్తా చెదారం, డ్రైనేజీ సమస్యలు కొంతమేరకు పరిష్కారమయ్యాయి. ప్రత్యేకాధికారులు వారు చేసే ప్రతి పనిని ఫొటోలు తీసుకొని సాయంత్రం ఆఫీసుల నుంచి ప్రభుత్వం వారికి కేటాయించిన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేశారు. పట్టణ ప్రగతి కార్యక్రమంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగాలని కోరుతున్నారు. 


logo
>>>>>>