మంగళవారం 31 మార్చి 2020
Jayashankar - Feb 25, 2020 , 03:05:27

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్‌ రుణాలు అందించండి

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్‌ రుణాలు అందించండి

కలెక్టరేట్‌, ఫిబ్రవరి24: రైతులకు నేరుగా మేలుకలిగేలా వ్యవసాయ ఆధారిత పరిశ్రమల స్థాపనకు బ్యాంకర్లు చేయూతనివ్వాలని జిల్లా కలెక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ అజీమ్‌ బ్యాంకర్లను ఆదేశించారు. సోమవారం కలెక్టర్‌ కార్యాలయంలో లీడ్‌బ్యాంక్‌ అధ్వర్యంలో జిల్లాస్థాయి  బ్యాంకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ బ్యాంకర్ల వారీగా వ్యవసాయ పంట రుణాలు, స్వయం సహాయక సంఘాల రుణాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా నిరుద్యోగ యువతకు అందించే స్వయం ఉపాధి రుణాలు, జిల్లా పరిశ్రమలశాఖ, ఖాదీ విలేజ్‌బోర్డు ద్వారా పరిశ్రమల స్థాపనకు అందించే రుణాల ప్రగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. ఈ జిల్లా వ్యవసాయ ఆధారిత జిల్లా అని రైతులు పండించిన ఉత్పత్తులను నేరుగా కాకుండా ప్రాసెస్‌ చేసి అమ్మితే రైతులు అధికంగా లబ్ధి పొందుతారని చెప్పారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమల స్థాపనకు బ్యాంకర్లు చేయూతనివ్వాలని అన్నారు. 


అలాగే ఉద్యాన పంటలను ప్రోత్సహించేందుకు అవసరమైన పరికరాల కొనుగోలుకు రుణాలు అందించాలని సూచించారు. సూక్ష్మ సేద్యం, బిందు సేద్యం, పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రోత్సహించాలని పేర్కొన్నారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా బ్రాండ్‌ పేరుతో ఏదేని వ్యవసాయ ఉత్పత్తుల వస్తువు రూపొందించాలని, చిరు వ్యాపారం కోసం నిర్ధేశిత లక్ష్యం మేరకు ముద్రా ఋణాలు అందించాలని అన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంత స్వయంసహాయక సంఘాల మహిళల కోసం నిర్ధేశించిన మేరకు లింకేజి రుణాలను అందించాలని వివరించారు. డిజిటల్‌ బ్యాంకింగ్‌ ప్రొత్సహించాలని చెప్పారు. అలాగే, ప్లాస్టిక్‌ రహిత సమాజం కోసం పేపర్‌, క్లాత్‌ ఆధారిత వస్తువుల తయారీకి ముందుకు వచ్చే ఔత్సాహికులకు రుణాలు అందించాలని తెలిపారు. జిల్లా పరిశ్రమలశాఖ వారు స్వయం ఉపాధి రుణాలపై నిరుద్యోగ యువతకు అవగాహన కలిగేలా క్లస్టర్‌ వారీగా అవగాహన క్యాంపులను నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎల్డీఎం శ్రీనివాస్‌, బ్యాంకర్లు, డీబీసీడీవో శైలజ, డీఎండబ్ల్యూవో వెంకటేశ్వర్లు, పశుసంవర్ధకశాఖ అధికారి డాక్టర్‌ బాలకృష్ణ, హార్టికల్చర్‌ అధికారి అక్బర్‌ తదితరులు పాల్గొన్నారు.


logo
>>>>>>