శనివారం 04 ఏప్రిల్ 2020
Jayashankar - Feb 21, 2020 , 03:00:39

పల్లెలు, పట్టణాలు మెరవాలి

పల్లెలు, పట్టణాలు మెరవాలి

పల్లె, పట్టణ ప్రగతి ద్వారా గ్రామాలు, పట్టణాలు మెరవాలని, అద్దంలా తయారు కావాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు.

 • అద్భుత ప్రగతి సాధించాలి
 • 23 నుంచి పల్లె ప్రగతి.. 24 నుంచి పట్టణ ప్రగతి
 • విజయవంతానికి కృషి చేయాలి
 • రోడ్లపై చెత్త వేస్తే జరిమానా విధించాలి
 • సర్పంచ్‌ స్పందించకుంటే చర్యలు
 • అనుమతి లేనిదే చెట్లను నరకరాదు
 • శాశ్వతంగా నిలిచిపోయే పనులు చేపట్టాలి
 • శ్మశాన వాటికలు, డంపింగ్‌యార్డుల స్థలాలకు అటవీశాఖ సహకరించాలి
 • భూపాలపల్లిలో పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ శాఖ సమ్మేళనంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
 • 22న ప్రజాప్రతినిధులకు అవగాహన
 • సదస్సు : కలెక్టర్‌ అబ్దుల్‌ అజీమ్‌

భూపాలపల్లి టౌన్‌, ఫిబ్రవరి 20 : పల్లె, పట్టణ ప్రగతి ద్వారా గ్రామాలు, పట్టణాలు మెరవాలని, అద్దంలా తయారు కావాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఈ నెల 23 నుంచి పల్లె ప్రగతి, 24 నుంచి పట్టణ ప్రగతి కార్యక్రమాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో గురువారం జిల్లా కేంద్రంలోని ఏఎస్సార్‌ గార్డెన్‌లో నిర్వహించిన పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ సమ్మేళనం కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ముఖ్యఅతిథిగా హాజరై పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా చేపట్టాల్సిన కార్యక్రమంపై ప్రజాప్రతినిధులు, అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భం గా మంత్రి మాట్లాడుతూ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా అద్భుతంగా ప్రగతి సాధించాలన్నారు. ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేస్తూ దాతల సహకారం తీసుకొని అన్ని గ్రామా లు, పట్టణాలలో మౌలిక వసతులను కల్పించడంతో పాటు అక్షరాస్యత పెంపొందించే కార్యక్రమాలను చేపట్టాలన్నా రు. 


ఉత్తమ గ్రామాలు, వార్డులకు ప్రత్యేకంగా నిధులు ఇ చ్చి అభివృద్ధి చేస్తామన్నారు. జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ తో రహదారుల అభివృద్ధికి ఆర్‌అండ్‌బీ శాఖ ద్వారా రూ.46కోట్లు, చెక్‌ డ్యాంల నిర్మాణం కోసం రూ.42కోట్లు, సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.18కోట్లు, భూపాలపల్లి నియోజకవర్గ అభివృద్ధికి రూ.26కోట్లు ఇస్తామని, మార్చి 31 వరకు రూ.26 కోట్ల నిధులతో చేపట్టిన పనులను పూర్తి చేయించాలన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రతి నెలా రాష్ట్ర వ్యాప్తంగా రూ.330 కోట్లు విడుదల చేస్తున్నామన్నారు. గతంలో నిధుల లేమి తో గ్రామాలు అభివృద్ధి చెందలేదని, కానీ రాష్ట్రం ఏర్పడ్డాక అధిక సంఖ్యలో నిధులు ఇవ్వడం, మొదటి రెండు విడతల పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలు అభివృద్ధి బాట పట్టాయని, ఎవరైనా రోడ్డుపై చెత్త వేస్తే వారికి ఫైన్‌ వేయాలని, లేనిచో ఆ గ్రామ సర్పంచ్‌కు ఫైన్‌ వేస్తామన్నారు. అన్ని గ్రామాల్లో వైకుంఠధామాలు, చెత్త డంపింగ్‌యార్డుల ఏర్పాటుకు అటవీశాఖ అవసరమైన చోట భూమి ఇవ్వాలన్నారు. పది రోజుల్లో అన్ని గ్రామాల్లో డంపింగ్‌యార్డు, వైకుంఠధామాల నిర్మా ణం ప్రారంభించాలన్నారు. జిల్లాకు అవసరమైన మొక్కలను నర్సరీల ద్వారా సిద్ధం చేయాలని, పెరడులో పెంచుకునే చెట్లను కూడా అనుమతి లేకుండా నరికితే చర్యలు తీసుకోవాలని డీఎఫ్‌వోను ఆదేశించారు. ప్రతి గ్రామంలో ట్రాక్టర్లను కొనుగోలు చేయాలన్నారు. గ్రామాల అభివృద్ధికి  జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నిధులను ఉపయోగించుకోవాలని, పూర్వ విద్యార్థుల సహకారం తీసుకోవాలన్నారు. అభివృద్ధి చేసుకునే గ్రామాలకు ప్రత్యేక నిధులు ఇస్తానని, ప్రతి మండలం నుంచి అభివృద్ధిని సాధించిన మూడు గ్రామాలను ఎంపిక చేస్తూ రూ.10లక్షలతో సీసీ రోడ్లను వేయించుకోవాలన్నారు. 


ఈ కార్యక్రమానికి కొంతమంది సర్పంచులు గైర్హాజరు కావడంతో వారిపై అసహననం వ్యక్తం చేశారు. అలాగే 24 నుంచి 10రోజులపాటు పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించి భూపాలపల్లి పట్టణంలో 5యేళ్ల అభివృద్ధికి ప్రణాళిక వేసి పార్టీలకు అతీతంగా వార్డులను అభివృద్ధి చేసుకోవాలన్నారు. అభివృద్ధిని చూపించే వార్డులకు ప్రత్యేకంగా నిధులను ఇస్తామన్నారు. జిల్లా కలెక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ అజీం మాట్లాడుతూ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామం, పట్టణంలో సమస్యలను గుర్తించి అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. పట్టణాలను గజ్వేల్‌ తరహాలో వెజ్‌, నాన్‌ వెజ్‌ ఒకే చోట లభ్యమయ్యేలా ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ను ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో ప్రస్తుతం 35లక్షల మొ క్కల నర్సరీలను పెంచేందుకు చర్యలు చేపట్టామని, పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమం చేపట్టిన తర్వాత వాటి సంఖ్య మరింత పెరుగుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏరియల్‌ వ్యూ ద్వారా పచ్చదనం ఏర్పాట్లను పరిశీలించనున్నారని తెలిపారు. మొక్కలు నాటడంతోపాటు వాటిని బతికించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పల్లె ప్రగతిపై ఈ నెల 22న అన్ని మండలాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులకు ఒకరోజు అవగాహన కల్పిస్తామని, అందుకు తప్పక హాజరు కావాలన్నారు. 


కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ రాజా విక్రంరెడ్డి, జెడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ కల్లెపు శోభ, ఆర్డీవో వైవీ గణేశ్‌, డీపీవో చంద్రమౌళి, డీఎఫ్‌వో పురుషోత్తం, మున్సిపల్‌ కమిషనర్‌ సమ్మయ్య, జెడ్పీ సీఈవో శిరీష, డీఆర్డీవో సుమతి, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, పీఏసీఎస్‌ చైర్మన్లు పాల్గొన్నారు.

 
సేవ చేయడం అదృష్టం..మంథని జెడ్పీ చైర్‌పర్సన్‌ పుట్ట మధు

ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం అదృష్టం. ఆ అవకాశాన్ని కాపాడుకోవాలి. ఎమ్మెల్యేగా పని చేసిన నాకు అంతగా నాకు పేరు, గౌరవం రాలేదు. నేను ఎంపీపీగా ఉన్నప్పుడు మంచి పేరు వచ్చింది. మీరు ఎంత పని చేస్తే అంత మంచి పేరు వస్తుంది. పదవి వచ్చిందని నేల విడిచి సాము చేయవద్దు. వచ్చిన ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నతంగా ఎదగాలి. పని చేయని సర్పంచులను తొలగించే అధికారం కొత్త పంచాయతీరాజ్‌ చట్టంలో సీఎం కల్పించారు. గతంలో ఉన్న ప్రభుత్వాలు, పాలకులు  గ్రామాల అభివృద్ధిని పట్టించుకోలేదు. అందుకే సీఎం కేసీఆర్‌ ఇలాంటి కఠినమైన చట్టాలు తీసుకొచ్చి అమలు చేస్తున్నారు. పల్లె ప్రగతిని సీఎం సీరియస్‌గా తీసుకొని హైదరాబాద్‌ నుంచి స్వయంగా సమీక్ష జరుపుతున్నారు. అడవుల అభివృద్ధిపై ప్రతిఒక్కరూ చిత్తశుద్ధితో వ్యవహరించాలి. లేదంటే భవిష్యత్‌లో ఆక్సిజన్‌ క్లబ్బులు వస్తాయి. 


పల్లెల రూపురేఖలు మారాయి..భూపాలపల్లి జెడ్పీ చైర్‌పర్సన్‌ జక్కు శ్రీహర్షిణి

సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల రేపురేఖలు మారాయి. పల్లె ప్రగతి ఫలాలు చివరి గ్రామం దాకా చేరుకున్నాయి. జిల్లాలోని మారుమూల ప్రాంతమైన పలిమెల గ్రామంలో సైతం పల్లె ప్రగతి అమ లు జరుగడంతో గ్రామం పరిశుభ్రంగా మారింది. సెప్టెంబర్‌ 2న సీఎం కేసీఆర్‌ పల్లె ప్రగతిని ప్రారంభించిన రెండు విడతల్లో పూర్తి చేశారు. దీంతో పల్లెలు అద్దంలా మారాయి. మూడో విడత పల్లె ప్రగతి కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. ఈ అవకాశాన్ని గ్రామ సర్పంచులు, గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలి.


వార్డుల రూపురేఖలు మారుద్దాం..

మున్సిపాలిటీల్లో ఈ నెల 24 నుంచి ప్రారంభం కా బోయే పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా వార్డుల రూపు రేఖలు మార్చుకుందాం. భూపా లపల్లిలో శ్మశాన వాటిక నిర్మాణంలో ఉంది. డంపింగ్‌యార్డు, నర్సరీలు, మార్కె ట్ల ఏర్పాటు, తదితర సమస్యలకు ప్రాధాన్యతనిచ్చి పరిష్కరిం చుకుం దాం. ఇప్పటికే వార్డుల వారీగా కమిటీలు వేయడం జరుగుతుంది. చేయా ల్సిన పనులపై ప్రతిపాదనలు తయారు చేసుకొని ముందుకు సా గుదాం. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సహకారంతో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం.

- వెంకటరాణి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ 


గ్రామాలు బాగుపడ్డాయి..

ఇప్పటికే రెండు విడతలుగా జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమాలతో గ్రామాలు బాగుపడ్డాయి. పల్లె ప్రగతి కార్యక్రమాల్లో గ్రామస్తులు చురుకుగా పాలొన్నారు. గ్రామంలోని చెత్తా చెదారం తొలగింపు, డ్రైనేజీలను శుభ్రం చేయడం, శిథిలావస్థలో ఉన్న గృహాలను తొలగించడం, ఎండిపోయిన, పాడుబడిన బోర్‌ బావులను మూసివేయడం, మరుగుదొడ్ల నిర్మాణానికి, శ్మశాన వాటిక, డంపింగ్‌యార్డులకు స్థలాలను గుర్తించడం, తదితర కార్యక్రమాలు నిర్వహించాం. దీంతో గ్రామాలు అద్దంలా మారాయి. మూడో విడత కార్యక్రమాన్ని సైతం విజయవంతం చేస్తాం.

- శ్వేత, గుర్రంపేట సర్పంచ్‌


బాధ్యతలు పెరిగాయి..

ఇప్పటికే రెండు విడతలుగా పల్లె ప్రగతి కార్యక్రమా న్ని చెల్పూర్‌ గ్రామ పంచాయతీ పరిధిలో విజయవంతంగా పూర్తి చేశాం. నాకు ఉత్తమ సర్పంచ్‌గా అవార్డు వచ్చింది. దీంతో బాధ్యత మరింత పెరిగింది. పల్లె ప్రగ తి కార్యాక్రమంతో గ్రామాల్లో మార్పు కనిపిస్తుంది. మూడో విడత పల్లె ప్రగతిలో రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తాం. చెల్పూర్‌లో సైడ్‌ డ్రైనేజీల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలి. అలాగే బస్టాండ్‌ను నిర్మించాలి. 

- మధుసూదన్‌రావు, చెల్పూర్‌ సర్పంచ్‌


పల్లె ప్రగతి మంచి కార్యక్రమం..

సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి ఒక మంచి కార్యక్రమం. మా గ్రామంలో రెండు విడతలు విజయవంతంగా పూర్తి చేసి గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామాలను అందంగా తీర్చిదిద్దాం. మూడో విడత కార్యక్రమంతో గ్రామాలను మరింత అందంగా తీర్చిదిద్దుకుంటాం. డ్రైనేజీలు శుభ్రం చేయించి గ్రామంలో హరితహారం కింద మొక్కలు నాటాం. డంపింగ్‌యార్డులు, శ్మశాన వాటిక పనులను ప్రారంభించాం. వీధి దీపాలు ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం.

- సాయిసుధారెడ్డి, నవాబుపేట సర్పంచ్‌


పట్టణాన్ని ఆదర్శంగా మార్చుతాం..

భూపాలపల్లి పట్టణాన్ని పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా ఆదర్శంగా మార్చుతాం. సీఎం కేసీఆర్‌ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రవేశపెట్టడం హర్షణీయం. ఈ నెల 24న భూపాలపల్లి పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రారంభం కానుంది. ఇప్పటికే వార్డులలో వార్డు కమిటీల ఎన్నిక జరుగుతుంది. శ్మశాన వాటిక పనులు నిర్మాణంలో ఉన్నాయి. డంపింగ్‌యార్డులు, నర్సరీల ఏర్పాటు, అదనంగా శ్మశాన వాటికల ఏర్పాటుకు స్థలాల గుర్తింపు జరుగుతుంది. భూపాలపల్లిలో 50శాతం ప్రభుత్వ భూములున్నాయి. ప్రభుత్వ భూమిలో నిర్మించుకున్న ఇళ్లకు పట్టాలివ్వాలి. భూపాలపల్లి మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఉత్తమ మున్సిపాలిటీగా మార్చేందుకు కృషి చేస్తాం. 

- శిరుప అనీల్‌, వార్డు కౌన్సిలర్‌


logo