బుధవారం 08 ఏప్రిల్ 2020
Jayashankar - Feb 18, 2020 , 03:30:15

పల్లెప్రగతికి అధికారులు సిద్ధం కావాలి

పల్లెప్రగతికి అధికారులు సిద్ధం కావాలి

జయశంకర్‌ భూపాలపల్లి కలెక్టరేట్‌/ ములుగు కలెక్టరేట్‌, ఫిబ్రవరి 17: పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహణకు అధికారులు సిద్ధం కావాలని రాష్ట్ర పంచాయతీ రాజ్‌ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా అధికారులను ఆదేశించారు. ఆయా జిల్లాల్లో పెండింగ్‌ పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ నెల 23వ తేదీ నుంచి పల్లెప్రగతి కార్యక్రమం ప్రారంభం కానున్న నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో పంచాయతీరాజ్‌ కమిషనర్‌ రఘునందన్‌రావుతో కలిసి సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి, సమీక్షించారు. నూతన పంచాయతీ రాజ్‌ చట్టం రూపొం దించడంతో పాటు గ్రామాల అభివృద్ధికి సంబంధించి అధికారులకు, ప్ర జాప్రతినిధులకు ప్రభుత్వం నిధులు, విధులు కేటాయించిందని తెలిపారు. గ్రామాలు, పట్టణాలను ఆదర్శంగా తిర్చిదిద్దాలనే ప్రధాన ఉద్దేశంతో ప్రతిష్టాత్మకంగా పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టిందని, ఈ కార్యక్రమం ద్వారా గ్రామాలు,  పట్టణాలు అభివృద్ధి చెందేలా కలెక్టర్లు చొరవ చూపాల ని సూచించారు. ట్రాక్టర్ల కొనుగోలు పూర్తి చేయాలని, వైకుంఠ ధామాలు తప్పనిసరిగా నిర్మించాలని ఆదేశించారు. వర్షాకాలం నాటికి హరితహారం మొక్కలు సిద్ధం కావాలన్నారు. మంత్రుల నేతృత్వంలో పంచాయతీరాజ్‌ సమ్మేళనాన్ని నిర్వహించి జెడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, జిల్లాస్థాయి అధికారులను ఆహ్వానించి, కార్యక్రమం ముఖ్య ఉద్దేశం తెలపాలన్నారు.  జయశంకర్‌ కలెక్టర్‌ అబ్దుల్‌ అజీమ్‌ మాట్లాడుతూ 20న మంత్రి దయాకర్‌రావు నేతృత్వంలో సమ్మేళానాన్ని నిర్వహిస్తామని చెప్పారు. 241 పంచాయతీలకు గాను 167 ట్రాక్టర్లను పంపిణీ చేశామని, మంగళవారం లోగా మరో 50 ట్రాక్టర్లను, ఈ నెల 22లోగా మిగతావి పంపిణీ చేస్తామన్నారు. ఇప్పటికే డ్రైవర్లను సిద్ధం చేసినట్లు చెప్పారు. 147 గ్రామాల్లో వైకుంఠ ధామాల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. 94 పంచాయతీలకు భూమి సమస్య ఉందని, వాటిని త్వరలో చేపడతామన్నారు. హరితహారానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లా అదనపు కలెక్టర్‌ రాజా విక్రం రెడ్డి, డీపీవో చంద్రమౌళి, డీఆర్‌డీవో సుమతి, జెడ్పీ సీఈవో శిరీష, జిల్లా అటవీశాఖ అధికారి పురుషోత్తం, ఆర్‌డీవో గణేశ్‌, ఎంపీడీవోలు పాల్గొన్నారు. సమావేశంలో ములుగు కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య మాట్లాడుతూ పూర్తి స్థాయిలో పనులపై దృష్టి సారిస్తున్నట్లు వివరించారు. డీపీవో వెంకయ్య, జెడ్పీసీఈవో పారిజాతం పాల్గొన్నారు. 


logo