గురువారం 02 ఏప్రిల్ 2020
Jayashankar - Feb 16, 2020 , 03:33:00

ప్రభంజనం

ప్రభంజనం

భూపాలపల్లి టౌన్‌, ఫిబ్రవరి 15 : జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో టీఆర్‌ఎస్‌ ప్రభంజనం కొనసాగింది. శనివారం సహకార ఎన్నికల్లో రైతులు గులాబీ పార్టీకి జై కొట్టారు. ఊహించని మెజార్టీనిచ్చారు. జిల్లాలోని 11 మండలాల్లో 10 పీఏసీఎస్‌లు ఉండగా 130 వార్డులు (ప్రాదేశిక నియోజకవర్గాలు) ఉన్నా యి. 31,069 మంది ఓటర్లు ఉన్నారు. కాగా, ఇటీవల నామినేషన్ల విత్‌ డ్రా అనంతరం 60 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 70 స్థానాలకు పోటీ పెరుగగా ఇందులోనూ టీఆర్‌ఎస్‌ హవా కొనసాగింది. జిల్లాలో మొత్తం 130 వార్డులకు గాను 101 స్థానాలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. అలాగే 16 కాంగ్రెస్‌, 2 బీజేపీ, 9 ఏఐఎఫ్‌బీ, 1 స్వతంత్ర స్థానాలను గెలుచుకున్నాయి. గడిచిన నామినేషన్ల విత్‌ డ్రాలో మంథని నియోజకవర్గంలోని నాలుగు పీఏసీఎస్‌లు తీవ్ర పోటీని ఇచ్చినప్పటికీ శనివారం జరిగిన ఎన్నికల్లో రైతులు టీఆర్‌ఎస్‌ వెంట నడిచారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌ పార్టీకి మెజార్టీని ఇచ్చినప్పటికీ సహకార ఎన్నికల్లో రైతులు అందుకు భిన్నంగా తీర్పునిచ్చారు. 


ప్రశాంతంగా పోలింగ్‌

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో సహకార ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో 130 వార్డులుండగా 60 వార్డులు ఏకగ్రీవం కాగా 70 వార్డులకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 8 పీఏసీఎస్‌లకు ఎన్నికలు జరిగాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్‌ జరిగింది. 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించిన అధికారులు.. ఫలితాలు వెల్లడించారు. జిల్లాలో 13,539 మంది ఓటర్లుండగా 10,525 మంది (79.06శాతం) ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. రేగొండలో 1215 మంది ఓటర్లకు గాను 1009 మంది (83.05శాతం) ఓటర్లు, చిట్యాలలో 1412 మంది ఓటర్లకు గాను 1153 మంది (81.66 శాతం), మొగుళ్లపల్లిలో 3102 మంది ఓటర్లకు గాను 2377 మంది (69.87 శాతం), జంగేడులో 933 మంది ఓటర్లకు గాను 535 మంది (57.34 శాతం), గారెపల్లిలో 2913 మంది ఓటర్లకు గాను 2113 మంది (72.54 శాతం), మహదేవపూర్‌లో 1094 మంది ఓటర్లకు గాను 944 మంది (86.29 శాతం), మహాముత్తారంలో 1153 మంది ఓటర్లకు గాను 1071 మంది (92.89 శాతం), తాడిచర్లలో 1417 మంది ఓటర్లకు గాను 1323 మంది (93.37 శాతం) ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభం కాగా 9 గంటల వరకు 18.06 శాతం పోలింగ్‌ జరిగింది. 11 గంటల వరకు 60.01 శాతం, మధ్యాహ్నం 12 వరకు 73 శాతం, ఒంటిగంట వరకు 79.06 శాతం పోలింగ్‌ జరిగింది. 


పోలీసుల బందోబస్తు

సహకార సంఘాల ఎన్నికల సందర్భంగా జిల్లాలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. జిల్లాలోని 70 స్థానాలకు ఎన్నిక జరుగగా అడిషనల్‌ ఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు, కాటారం డీఎస్పీ బోనాల కిషన్‌ ఆధ్వర్యంలో పోలీసులు సిబ్బందితో పహారా కాశారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా చర్యలు తీసుకున్నారు. ఆర్డీవో గణేశ్‌, జిల్లా సహకార అధికారి రాంమోహన్‌లు పోలింగ్‌ కేంద్రాలను పరిశీలిస్తూ ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించారు.


logo
>>>>>>