శనివారం 30 మే 2020
Jayashankar - Feb 15, 2020 , 02:32:30

సహకార ఎన్నికలకు సర్వం సిద్ధం

సహకార ఎన్నికలకు సర్వం సిద్ధం

భూపాలపల్లి టౌన్‌, ఫిబ్రవరి 14 : జిల్లాలో శనివారం జరుగబోయే సహకార ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో 11 మండలాలకుగాను 10 పీఏసీఎస్‌లు ఉన్నాయి. వాటిలో 130 వార్డులున్నాయి. కాగా, 130 వార్డులలో 60 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 70వార్డులలో 172 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 13,600 మంది రైతులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 70 వార్డులకు శనివారం పోలింగ్‌ జ రుగనుంది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 70 పోలింగ్‌ కేంద్రాల్లో 70 మంది పోలింగ్‌ సిబ్బందిని నియమించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ స్టేడియంలో డిస్ట్రిబ్యూషన్‌ పాయింట్‌లో పోలింగ్‌ సామగ్రిని ఎన్నికల అధికారులకు అప్పగించారు. ఎన్నికల అధికారులు శుక్రవారం సాయంత్రం పోలింగ్‌ సామగ్రితో పోలింగ్‌ కేంద్రాలకు చేరారు. శనివారం ఉదయం 7గంటలకు పోలింగ్‌ ప్రారంభమై మ ధ్యాహ్నం ఒంటిగంటకు ముగుస్తుంది. అనంతరం ఓట్ల లెక్కింపు కార్యక్రమం ప్రారంభించి ఫలితాలు వెల్లడిస్తారు. రేగొండ, జంగేడు, చిట్యాల, మొగుళ్లపల్లి, మహదేవపూర్‌, తాడిచర్ల, గారెపల్లి, మహాముత్తారం పీఏసీఎస్‌లలో 70 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 


70 స్థానాలకు ఎన్నికలు..

జిల్లాలోని 11 మండలాల పరిధిలో గల 10 పీఏసీఎస్‌లకుగాను ఇప్పటికే రెండు పీఏసీఎస్‌లు పూర్తిగా ఏకగ్రీవమయ్యాయి. చెల్పూర్‌, గణపురం పీఏసీఎస్‌లు ఏకగ్రీవం కాగా మిగిలిన 8 పీఏసీఎస్‌లకు ఎన్నికలు జరుగనున్నాయి. 8 పీఏసీఎస్‌ల పరిధిలో 70 స్థానాలకు అధికారులు ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. రేగొండలో 3, జంగేడులో 3, చిట్యాలలో 4, మొగుళ్లపల్లిలో 9, మహదేవపూర్‌లో 12, తాడిచర్లలో 13, గారెపల్లిలో 13, మహాముత్తారంలో 13 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇందుకోసం 70 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్‌ కేంద్రానికి ఒక ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌, ఒక అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌, సిబ్బందిని నియమించారు. 


ఎన్నికల సామగ్రి పంపిణీ..

జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ స్టేడియంలో గల మినీ ఫంక్షన్‌ హాల్‌లో సహకార ఎన్నికల డిస్ట్రిబ్యూషన్‌ పాయింట్‌ను ఏర్పాటు చేశారు. శుక్రవారం డిస్ట్రిబ్యూషన్‌ పాయింట్‌ నుంచి ఎన్నికల అధికారులకు పోలింగ్‌ సామగ్రి పంపిణీ చేశారు. ఆర్డీవో వైవీ గణేశ్‌ అధ్యక్షతన ఎన్నికల సామగ్రి పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి రామ్మోహన్‌, సీఐ వాసుదేవరావు, జం గేడు ఎన్నికల అధికారి, భూపాలపల్లి ఎంఈవో బుచ్చయ్యలు ఎన్నికల అధికారులకు సూచనలు, సలహాలు అందించారు. ఎన్నికల సందర్భంగా నియమ నిబంధనలు వివరించారు. పోలింగ్‌ సామగ్రితో పోలింగ్‌ అధికారులను ప్రత్యేక వాహనాల ద్వారా పోలింగ్‌ కేంద్రాలకు పంపించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ.. శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమవుతుందని, మధ్యాహ్నం  ఒంటిగంటకు ముగుస్తుందన్నారు. 


అనంతరం ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని, సాయంత్రానికల్లా ఫలితాలు వెల్లడిస్తామన్నారు. 16, 17 తేదీల్లో పీఏసీఎస్‌లలో అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు జరుగుతాయన్నారు. సీఐ వాసుదేవరావు మాట్లాడుతూ.. ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీల నాయకులు నిబంధనలు పాటించాలని, పోలింగ్‌ కేంద్రాలకు వంద మీటర్ల దూరంలో ఉండాలని కోరారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.


logo