సోమవారం 06 ఏప్రిల్ 2020
Jayashankar - Feb 14, 2020 , 04:15:33

నిట్‌లో రూ.172 కోట్లతో ఇండస్ట్రీ 4.0

నిట్‌లో రూ.172 కోట్లతో ఇండస్ట్రీ 4.0

నిట్‌క్యాంపస్‌, ఫిబ్రవరి13 : దేశంలో అత్యున్నత సాంకేతిక విద్యాసంస్థగా పేరున్న నిట్‌ వరంగల్‌ మరో ప్రతిష్టాత్మక పరిశోధన ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది. సీమన్స్‌ ఇండస్ట్రీ సాఫ్ట్‌వేర్‌ ఇండియా కంపెనీతో కలిసి భాగస్వామిగా ఏర్పాటై రూ.172 కోట్ల భారీ పరిశోధన ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయనుంది. ఎంటీఏబీ టెక్నాలజీ సెంటర్‌ సహకారంతో నిట్‌లో ఇండస్ట్రీ 4.0 సాంకేతిక పరిశోధన ల్యాబ్‌ను ఏర్పాటు చేయనుంది. ఇందుకు సంబంధించిన ఒప్పంద పత్రాలపై నిట్‌ డైరెక్టర్‌ ఎన్వీ రమణారావు సంతకాలు చేశారు. గురువారం నిట్‌ డైరెక్టర్‌ కార్యాలయంలో సీమన్స్‌ ఇండస్ట్రీ సాఫ్ట్‌వేర్‌ ఇండియా సేల్స్‌ లీడర్‌ మాథ్యూ థామస్‌, పార్ట్‌నర్‌ డైరెక్టర్‌ అనంత్‌ సంపత్‌, రీజనల్‌ డైరెక్టర్‌ గోపాల్‌నాయుడు సమక్షంలో వారు ప్రాజెక్ట్‌పై సంతకాలు చేశారు. సీమన్స్‌ భాగస్వామి అయిన ఎంటీసీ(టెక్నాలజీ సెంటర్‌) సుమారు రూ.151.5కోట్లు పెట్టుబడి పెట్టనుండగా, నిట్‌ వరంగల్‌ రూ 20.23 కోట్లు కేటాయించనుంది. మొత్తంగా రూ.172కోట్లతో నిట్‌లో అతిపెద్ద సాంకేతిక పరిశోధన ప్రాజెక్ట్‌ ఏర్పాటుకానుంది. ఇప్పటి వరకు నిట్‌ చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్ట్‌ ఇదే కావడం విశేషం. డిజైన్‌, డిజిటలైజేషన్‌, ఆధునిక సాంకేతికతకు గుర్తుగా ఇండస్ట్రీ 4.0ను ప్రవేశపెట్టి నేటి పరిశ్రమలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దనున్నారు. ఇంజినీరింగ్‌, సైన్స్‌, మేనేజ్‌మెంట్‌ విభాగాల్లో మల్టీ డిసిప్లినరి శిక్షణ అందిస్తామని ఈ సందర్భంగా ఒప్పంద పత్రాలు రాసుకున్నారు. సమావేశంలో రిజిస్ట్రార్‌ గోవర్ధన్‌రావు, అకాడమిక్‌ డీన్‌ ప్రొఫెసర్‌ వేణుగోపాల్‌, ప్రొఫెసర్‌ సీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

నిట్‌కు ప్రతిష్టాత్మకం : డైరెక్టర్‌ ఎన్వీ రమణారావు

నిట్‌ వరంగల్‌ చేపడుతున్న ప్రాజెక్ట్‌ల్లో సీమన్స్‌ ఇండస్ట్రీ ప్రాజెక్ట్‌ ప్రతిష్టాత్మకమైనది. కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ(ఎంహెచ్‌ఆర్‌డీ) సహకారంతో సీమన్స్‌, ఎంటీసీతో కలిసి రూ.172 కోట్లతో ప్రాజెక్ట్‌ చేపడుతున్నాం. ఇందుకోసం నిట్‌లో 25వేల చదరపు గజాల స్థ్ధలంలో ఆర్ట్‌ ల్యాబ్‌ను నిర్మించనున్నాం. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఈ ల్యాబ్‌ను డిజైన్‌ చేస్తాం. ప్రాజెక్ట్‌ ద్వారా విద్యార్థ్ధులు, పరిశోధకులు, అధ్యాపకులకు ఇండస్ట్రీ 4.0సాంకేతిక పరిజ్ఞానం, డిజిటల్‌ తయారీ రంగాలపై ప్రధానంగా దృష్టి సారించనున్నాం.  


logo