శనివారం 28 మార్చి 2020
Jayashankar - Feb 13, 2020 , 04:05:27

ఘనంగా తిరుగువారం పండుగ

ఘనంగా తిరుగువారం పండుగ
  • మేడారంలో ప్రత్యేక పూజలు
  • భారీగా తరలివచ్చిన భక్తులు
  • పూజా మందిరాలు, సామగ్రి శుద్ధి
  • మొక్కులు అప్పగించిన పూజారులు

తాడ్వాయి, ఫిబ్రవరి 12: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో సమ్మక్క-సారలమ్మ పూజారులు బుధవారం తిరుగువారం పండుగను ఘనంగా నిర్వహించారు. మహాజాతరలో భాగంగా గత నెల 22న గుడిమెలిగే పండుగ చేపట్టారు. అమ్మవార్ల పూజా సామగ్రిని బయటకు తీసి శుద్ధిచేశారు. పూజలు ప్రారంభించారు. అనంతరం వచ్చే బుధవారం మండెమెలిగే పండుగ జరిపారు. ఆ తర్వాత వచ్చిన బుధవారం మహాజాతర ప్రారంభించి, పూజలు నిర్వహించారు. తిరుగువారం వరకు మేడారంలోని సమ్మక్క పూజామందిరం, కన్నెపల్లిలోని సారక్క దేవాలయంలో రోజూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవార్ల మహాజాతర పూర్తయిన తర్వాత వస్ర్తాలు, పూజా సామగ్రిని తిరిగి శుద్ధి చేశారు. పూజారులు కుటుంబాలతో డోలివాయిద్యాల మధ్య పూజా మందిరాలకు చేరుకుని తల్లుల గద్దెలపై అలుకు పూత నిర్వహించారు. రంగులతో అలంకరించారు. ముగ్గులు వేశారు. పసుపు, కుంకుమ చల్లారు. పూజారుల కుటుంబ సభ్యులు తలనీలాలు ఇచ్చారు. తల్లులకు దూపదీప నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవార్ల గద్దెల వద్దకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించి, చెలపెయ్యను సమర్పించారు. కోడెను కట్టే స్థలం వద్ద కట్టేసి మొక్కులు చెల్లించుకున్నారు. రాత్రి అమ్మవార్ల పూజా మందిరాల వద్ద పూజలు చేసి, జాగారాలు ఉండి మందిరాలకు తాళాలు వేస్తారు.


logo