ఆదివారం 29 మార్చి 2020
Jayashankar - Feb 12, 2020 , 02:12:49

సహకార ఎన్నికలకు ఏర్పాట్లు..

సహకార ఎన్నికలకు ఏర్పాట్లు..

భూపాలపల్లి టౌన్‌, ఫిబ్రవరి 11 : జిల్లాలో సహకార ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సహకార ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన, విత్‌డ్రా ఘట్టం ముగిసింది. ఈ నెల 15న ఎన్నికలు నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో 130 వార్డులకుగాను 60 వార్డులు ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. 70 వార్డులలో ఎన్నికలు జరుగనుండగా 172 మంది అభ్యర్థి బరిలో ఉన్నారు. ఎన్నికల రోజు రేగొండ, జంగేడు, చిట్యాల, మొగుళ్లపల్లి, మహదేవపూర్‌, తాడిచర్ల, గారెపల్లి, మహాముత్తారం పీఏసీఎస్‌లలో 70 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే పోలింగ్‌ బాక్సులను జిల్లా సహకార కార్యాలయానికి తరలించి పంపిణీకి సిద్ధం చేశారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ స్టేడియం మినీ ఫంక్షన్‌ హాల్‌లో డిస్ట్రిబ్యూషన్‌ పాయింట్‌ను ఏర్పాటు చేశారు. ఈ నెల 14న ఈ డిస్ట్రిబ్యూషన్‌ పాయింట్‌ నుంచి పోలింగ్‌ అధికారులకు పోలింగ్‌ బాక్సులను, మెటీరియల్‌ను అందజేస్తారు. ఈ విషయమై మంగళవారం ఇల్లందు గెస్ట్‌హౌజ్‌లో పోలింగ్‌ అధికారులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. 

70 స్థానాలకు ఎన్నికలు

జిల్లాలోని 11 మండలాల పరిధిలో 10 పీఏసీఎస్‌లకు గాను ఇప్పటికే రెండు పీఏసీఎస్‌లు పూర్తిగా ఏకగ్రీవమయ్యాయి. చెల్పూర్‌, గణపురం పీఏసీఎస్‌లు ఏకగ్రీవం కాగా, మిగిలిన 8 పీఏసీఎస్‌లకు ఎన్నికలు జరుగనున్నాయి. 8 పీఏసీఎస్‌ల పరిధిలో 70 స్థానాలకు అధికారులు ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రేగొండలో 3, జంగేడులో 3, చిట్యాలలో 4, మొగుళ్లపల్లిలో 9, మహదేవపూర్‌లో 12, తాడిచర్లలో 13, గారెపల్లిలో 13, మహాముత్తారంలో 13 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. దీనికి 70 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్‌ కేంద్రానికీ ఒక ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌, ఒక అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌, సిబ్బందిని నియమించనున్నారు. 

పోలింగ్‌ అధికారులు, సిబ్బందికి శిక్షణ

జిల్లాలో సహకార ఎన్నికల పోలింగ్‌ అధికారులకు, సిబ్బందికి జిల్లా కేంద్రంలోని ఇల్లందు గెస్ట్‌హౌజ్‌లో శిక్షణ ఇచ్చారు. మాస్టర్‌ ట్రైనర్‌ డిప్యూటీ రిజిస్ట్రార్‌ డీ శైలజ పోలింగ్‌ అంశాల వివరించారు. ఎన్నికల సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలను, వ్యవహరించాల్సిన తీరును జిల్లా సహకార అధికారి బీ రామ్మోహన్‌ తెలిపారు. ఎన్నికల అధికారులు, ప్రిసైడింగ్‌ అధికారులు, పోలింగ్‌ సిబ్బంది, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ శ్రీనివాసరావు, సహకార శాఖ సిబ్బంది శిక్షణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జి ల్లా సహకార అధికారి రామ్మోహన్‌ మాట్లాడుతూ.. 70 నియోజకవర్గాలకు సంబంధించి డిస్ట్రిబ్యూషన్‌ పాయింట్‌ను అంబేద్కర్‌ స్టేడియంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలింగ్‌ సి బ్బంది ఈ నెల 14న ఉదయం 10 గంటలకు రిపోర్టింగ్‌ చేయాలన్నారు. 15న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్‌ జరుగుతుందని, ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు వెల్లడిస్తామన్నారు. గెలిచిన అభ్యర్థులు 16, 17 తేదీల్లో అధ్యక్షులు, ఉపాధ్యక్షులను ఎన్నుకుంటారని చెప్పారు.


logo