సోమవారం 06 ఏప్రిల్ 2020
Jayashankar - Feb 12, 2020 , 02:09:05

నేడు మేడారంలో తిరుగువారం పండగ

నేడు మేడారంలో తిరుగువారం పండగ

తాడ్వాయి, ఫిబ్రవరి11: నేడు మేడారంలో సమ్మక్క-సారలమ్మ పూజారులు తిరుగువారం పండుగను నిర్వహించనున్నారు. గత బుధవారం మహాజాతరను నిర్వహించిన పూజారులు నేడు తిరుగువారం పండుగను ముగించనున్నారు. మహాజాతర సందర్భంగా భద్రపరిచిన అమ్మవార్ల పూజాసామాగ్రిని బయటకు తీసి 14రోజుల పాటు పూజలు నిర్వహించారు. తిరుగువారం పండు గ సందర్బంగా మేడారంలోని సమ్మక్క, కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. పూజారుల కుటుంబాలు, బంధుమిత్రులు పెద్ద ఎత్తున హాజరై తిరుగువారం పండుగను అంగరంగవైభవంగా నిర్వహించనున్నారు. బయటకు తీసిన పూజాసామాగ్రిని తిరిగి శుద్ధి చేసి అమ్మవార్ల పూజామందిరాల్లో భద్రపరచనున్నారు. దీంతో అమ్మవార్ల మహాజాతర ముగిసినట్లుగా పూజారులు ప్రకటిస్తారు. నేడు దేవతలకు దూపదీప నైవేద్యాలు సమర్పించి ప్రత్యే క పూజలు నిర్వహించిన అనంతరం ఆలయాలకు తాళాలు వేయనున్నారు. తిరిగి వచ్చే ఫిబ్రవరి లో జరిగే అమ్మవార్ల మినీ జాతరకు తిరిగి తాళాలు తీసి పూజాకార్యక్రమాలు నిర్వహిస్తారు. 

వనదేవతలకు మొక్కులు భారీగా తరలివస్తున్న భక్తజనం 

వనదేవతలు మేడారం సమ్మక్క-సారలమ్మకు భక్తుల మొక్కులు కొనసాగుతున్నాయి. అమ్మవార్ల ను దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు అధికసంఖ్యలో తరలివస్తున్నారు. భక్తుల మొక్కులతో గద్దెల ప్రాంగణంలో రద్దీగా మారుతోంది. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవార్ల గద్దెల వద్దకు చేరుకుంటున్నారు. సమ్మక్క-సారలమ్మ, గోవిందరాజు, పగిడి ద్దరాజుల గద్దెలపై పసుపు, కుంకుమ, ఎత్తుబెల్లం, నూనత వస్ర్తాలు, పూలు, పండ్లు సమర్పించి గిరిజన సంప్రదాయ పద్ధతుల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తుల రద్దీ తక్కువగా ఉండడంతో భక్తులకు దగ్గరి దర్శరం కలిగించారు. గద్దెల చుట్టూ ఉన్న గ్రిల్స్‌ తాళాలు తీసి నేరుగా తల్లుల గద్దెలను తాకి మొక్కులు చెల్లించుకునే అవకాశం కల్పించడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నేడు మేడారంలో అమ్మవార్ల పూజారులు తిరుగువారం పండగను నిర్వహించనుండడంతో అమ్మవార్ల దర్శనానికి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది.


logo