బుధవారం 08 ఏప్రిల్ 2020
Jayashankar - Feb 11, 2020 , 02:36:19

గులాబీ హవా..!

గులాబీ హవా..!

జయశంకర్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో సహకార సంఘం ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ హవా కొనసాగుతున్నది. గతంలో జరిగిన అన్ని ఎన్నికల మాదిరిగానే సహకార ఎన్నికలో సైతం టీఆర్‌ఎస్‌కు జనం జై కొడుతున్నారు. జిల్లాలో 11 మండలాల్లో 10 పీఏసీఎస్‌లు ఉండగా 130 వార్డులు (ప్రాదేశిక నియోజకవర్గాలు) ఉన్నాయి. 31,069 మంది ఓటర్లున్నారు. సహకార ఎన్నికలకు నోటిఫికేషన్‌ వెలువడగా ఈ నెల 8వ తేదీ వరకు 10 పీఏసీఎస్‌ల పరిధిలో ఎన్నికల అధికారులు నామినేషన్లు స్వీకరించారు. మొత్తం 646 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆదివారం 55 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 591 నామినేషన్లు ఉండగా సోమవారం 389 నామినేషన్లు విత్‌డ్రా అయ్యాయి. మొత్తం 130 వార్డుల్లో 60 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో 51 డైరెక్టర్‌ స్థానాలు టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. మిగిలిన 70 స్థానాల్లో పోటీ నెలకొనసాగనుంది. ఇందులో 202 మంది పోటీలో ఉండనున్నారు. జిల్లాలోని 10 పీఏసీఎస్‌లలో ఏకగ్రీవాల పర్వం కొనసాగగా గారెపల్లి, మహాముత్తారం, తాడిచర్ల పీఏసీఎస్‌లలో ఒక్క ఏకగ్రీవం కూడా కాలేదు. అన్ని వార్డుల్లోనూ పోటీ నెలకొంది. 

60 వార్డులు ఏకగ్రీవం

జిల్లాలో 10 పీఏసీఎస్‌ల పరిధిలో 130 వార్డులకు గాను 60 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 70 వార్డుల్లో పోటీ నెలకొంది. మహదేవపూర్‌లో 1, మొగుళ్లపల్లిలో 4, చిట్యాలలో 9, జంగేడులో 10, చెల్పూర్‌లో 13, గణపురంలో 13, రేగొండలో 10 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో చెల్పూర్‌లో 3, గణపురంలో 6 వార్డులు మినహా మిగిలిన 51 వార్డులను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. మిగిలిన 70 స్థానాలకు ఈ నెల 15న ఎన్నికలు జరుగనున్నాయి. 70 వార్డులకు గాను 202 మంది పోటీలో ఉన్నారు. పోలింగ్‌ రోజే ఫలితాలు వెలువడుతాయి. 16, 17 తేదీల్లో అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి.

389 నామినేషన్ల ఉపసంహరణ

సహకార ఎన్నికల్లో జిల్లాలో 646 నామినేషన్లు దాఖలు కాగా ఆదివారం 55 నామినేషన్లు పరిశీలనలో తొలగించబడ్డాయి. మిగిలిన 591 నామినేషన్లలో సోమవారం 389 నామినేషన్లు విత్‌డ్రా అయ్యాయి. 202 మంది బరిలో ఉన్నారు. జంగేడు పీఏసీఎస్‌ పరిధిలో 69, చిట్యాల పరిధిలో 47, రేగొండ పరిధిలో 76, మొగుళ్లపల్లి పరిధిలో 48, చెల్పూర్‌ పరిధిలో 25, గణపురం పరిధిలో 47, గారెపల్లి పరిధిలో 29, తాడిచర్ల పరిధిలో 14, మహదేవపూర్‌ పరిధిలో 16, మహాముత్తారం పరిధిలో 18 నామినేషన్లు విత్‌డ్రా అయ్యాయి. 

టీఆర్‌ఎస్‌దే విజయం

ఎన్నికలేవైనా టీఆర్‌ఎస్‌ ప్రభంజనం కొనసాగుతున్నది. గడిచిన అసెంబ్లీ ఎన్నికల నుంచి మొదలుకొని ఇప్పటివరకు ఎన్నికలేవి వచ్చినా ప్రజలు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకే పట్టం కడుతున్నారు. జెడ్పీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌కు జై కొట్టారు. ఊహించని మెజార్టీనిచ్చి టీఆర్‌ఎస్‌కు అండగా నిలిచారు. ప్రస్తుతం జరుగుతున్న సహకార ఎన్నికల్లో సైతం రైతులు టీఆర్‌ఎస్‌ పక్షాన నిలిచారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతులకు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను గుర్తించిన రైతులు సహకార ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే జయశంకర్‌ జిల్లాలో 130 వార్డులకు గాను 60 వార్డులు ఏకగ్రీవం కాగా, 70 వార్డుల్లో పోటీ జరగనున్నది. 60 వార్డుల్లో 51 వార్డులను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. మిగిలిన 70 వార్డుల్లోనూ మెజార్టీ వార్డులను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంటుందని పార్టీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో పీఏసీఎస్‌ చైర్మన్‌ స్థానాలతో పాటు జిల్లా చైర్మన్‌ స్థానాన్ని సైతం టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 


logo