బుధవారం 08 ఏప్రిల్ 2020
Jayashankar - Feb 11, 2020 , 02:31:22

నేటి నుంచి అన్నవరంలో యాగం

నేటి నుంచి అన్నవరంలో యాగం

వరంగల్‌ రూరల్‌ జిల్లా ప్రతినిధి-నమస్తే తెలంగాణ : ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా అన్నవరం శ్రీ వీరవేంకట సత్యనారాయణస్వామివారి ఆలయ సన్నిధిలో మంగళవారం నుంచి చదుర్వేద హవన సహిత పంచాయతనపూర్వక త్రిపాద్విభూతి మహా వైకుంఠ నారాయణ యాగం ప్రారంభం కానుంది. శ్రీ స్వామివారి రామాలయం వద్ద తొమ్మిది రోజుల పాటు ఈ యాగం నిర్వహించేందుకు సకల సన్నాహాలు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి(ఈవో) వేండ్ర త్రినాథరావు వెల్లడించారు. పాల్గుణ బహుళ విదియను పురస్కరించుకుని మొదలయ్యే మహా వైకుంఠ నారాయణ యాగం గోడ పత్రికను ఆయన సోమవారం ఆవిష్కరించారు. 11వ తేదీన ఉదయం 10 గంటలకు మహా వైకుంఠ నారాయణ యాగం ప్రారంభం కానుందని, 19వ తేదీన ఉదయం 11 గంటలకు జరిగే పూర్ణాహుతితో యాగం సంపూర్ణమవుతుందని త్రినాథరావు ప్రకటించారు. లోక కల్యాణార్థం 11 నుంచి 19వ తేదీ వరకు ప్రతిరోజు వంద మంది సుప్రసిద్ధవేద పండితులు, రుత్వికులు యాగం నిర్వహిస్తారని తెలిపారు. ఆసక్తి గల భక్తులు రూ.5,116 గాని, రూ.1,116 గాని చెల్లించి ఒకరోజు యాగంలో స్వయంగా పాల్గొనవచ్చని ఈవో చెప్పారు. రూ.5,116 చెల్లించిన వారికి శ్రీస్వామివారి ప్రసాదం, పంచ, కండువా, చీర, జాకెట్‌, రూ.1,116 చెల్లించిన వారికి ప్రసాదం, కండువా, జాకెట్‌ అందజేయనున్నట్లు ఆయన వెల్లడించారు. మహా యాగంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీ వీరవేంకట సత్యనారాయణస్వామివారి భక్తులు పెద్ద సంఖ్యలో స్వయంగా పాల్గొంటారని, ఇందుకోసం యాగం జరిగే స్వామివారి సన్నిధిలో వసతులు కల్పించినట్లు ఈవో త్రినాథరావు తెలిపారు.


logo