బుధవారం 08 ఏప్రిల్ 2020
Jayashankar - Feb 11, 2020 , 02:30:38

స్వచ్ఛ ఎంజీఎంపై అధికారుల కసరత్తు

స్వచ్ఛ ఎంజీఎంపై అధికారుల కసరత్తు

వరంగల్‌ చౌరస్తా, ఫిబ్రవరి 10: వరంగల్‌ ఎంజీఎం సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శానిటేషన్‌ వ్యవస్థను మెరుగుపరచడానికి చర్యలు ప్రారంభించారు. అందుకుగాను సానిటేషన్‌ సిబ్బందితో సోమవారం సూపరింటెండెంట్‌ చాంబర్‌లో అంతర్గత సమావేశాన్ని నిర్వహించారు. జనవరి 31,ఫిబ్రవరి 6న ఎంజీఎంను సందర్శించిన నాటి జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌ ఆసుపత్రి పరిశుభ్ర పై దృషి నిలపాలని అధికారులను ఆదేశించారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాలను అమలు చేయడానికి ఆసుపత్రి సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తూ తగు విధంగా సూచనలు చేసినట్లు ఆయన తెలిపారు. సానిటేషన్‌ సిబ్బంది, సార్జంట్‌లు పరస్పర సహకారం, పనిపై అవగాహన కలిగి ఉండాలని ఆయన వారికి తెలిపారు. ఆసుపత్రి ఆవరణలో పడివున్న పనికిరాని వస్తువులను ఒక్క చోటికి చేర్చి వాటి అమ్మకానానికి ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు ఇచ్చిన ఆదేశాల అమలుకు చర్యలు చేపట్టాలని సూచించారు. దానికి తోడు ఆసుపత్రి ఆవరణలో ఖాళీ స్థలం వున్న ప్రాంతంలో మొక్కలు నాటి వాటిని పరిరక్షించడానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. విభాగాల వారిగా పరిశీలకులను ఏర్పాటు చేయడానికి తగిన చర్యలు తీసుకోనున్నటు ఆయన పేర్కొన్నారు. ఇక పై విభాగాల వారిగా పారిశుధ్య చర్యలపై తనిఖీలు నిర్వహించి పనితీరు సరిగాలేని వారి పై కఠినచర్యలు తీసుకుంటామని ఆయన సిబ్బందిని హెచ్చరించారు.


విధుల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదు 

వివిధ విభాగాల్లో పని చేస్తున్న సిబ్బంది తమ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లుయితే సహించేది లేదని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రీనివాసరావు సిబ్బందిని హెచ్చరించారు. మద్యం సేవించి విధులు నిర్వహించడం, అక్రమ వసూళ్లకు పాల్పడడం, విధుల్లో నిర్లక్ష్యం వహించడం లాంటి ఆరోపణలు వినవస్తున్న నేపథ్యంలో ఆయన కిందిస్థాయి సిబ్బంది, ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందిపై ప్రత్యేక దృష్టి నిలపాలని సూపర్‌వైజర్లను ఆదేశించారు. గత కొన్ని రోజులుగా వివిధ విభాగాల్లో కిందిస్థాయి, ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది విధుల్లో గొడవ పడడం, పరస్పర దాడులకు దిగడంపై ఆయన తీవ్రంగా మండిపడినట్లు సమాచారం. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతమైనట్లయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ సమావేశంలో ఆసుపత్రి సివిల్‌ సర్జన్‌ ఆర్‌ఎంవో డాక్టర్‌ హరీష్‌రాజ్‌, ఆర్‌ఎంఓ-2 డాక్టర్‌ వెంకటరమణ, పలు విభాగాలకు చెందిన అధిపతులు పాల్గొన్నారు.


logo