ఆదివారం 24 మే 2020
Jayashankar - Feb 10, 2020 , 02:45:19

గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి

గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి
  • రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శశాంక్‌ గోయల్‌
  • చిట్యాల మండలంలో పల్లె ప్రగతి పనుల పరిశీలన

చిట్యాల, ఫిబ్రవరి 09 : గ్రామ సమస్యల పరిష్కారానికి సమిష్టిగా అడుగేస్తూ సమగ్ర గ్రామీణ అభివృద్ధికి పాటుపడాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శశాంక్‌గోయల్‌ అన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కావాల్సిన నిధులు మంజూరు చేస్తుందని, గ్రామాలను ప్రగతిపథంలో నడిపించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30 రోజుల ప్రణాళికలో భాగంగా రెండో విడతలో చేపట్టిన 10రోజుల ప్రణాళికలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఆదివారం ఆయన పరిశీలించారు. మండలంలోని గుంటూరుపల్లి, నవాబుపేట, చిట్యాల గ్రామపంచాయతీలను ఆయన సందర్శించారు. గ్రామాల్లోని వీధివిధినా పర్యటించి, జరుగుతున్న అభివృద్ధి పనులను పలువురిని అడిగి తెలుసుకుని ఆరా తీశారు. అధికారులకు పలు సూచనలు అందజేశారు. గుంటూరుపల్లిలో డంపింగ్‌యార్డ్‌, సాలీడ్‌వేస్ట్‌ నిర్మాణపనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఇంటింటా చేపడుతున్న ఇంకుడుగుంతల నిర్మాణ పనులను, నర్సరీ ప్రారంభ పనులను పరిశీలించారు.  


గ్రామంలోని రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవాబుపేటలో సాలీడ్‌షెడ్‌ నిర్మాణపనులను, ఇంకుడుగుంతలు, మరుగుదొడ్లను పరిశీలించారు. ఇంటింటికీ తడిచెత్త, పొడి చెత్త బుట్టలను అందజేయాలని సూచించారు. గ్రామంలో మూడు కిలోమీటర్ల దూరంలో నాటిన హరితమారం మొక్కలను, వాటి రక్షణను పరిశీలించారు. గ్రామ శివారులోని నర్సరీ ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. చిట్యాలలో నర్సరీ పనులను, మొక్కల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం శ్మశానవాటికను సందర్శించారు. ఈ సందర్భంగా శశాంక్‌ గోయాల్‌ మాట్లాడుతూ మూడు గ్రామాల్లోని అభివృద్ధి పనుల పురోగతి నివేదికను రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖకు చేరవేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో నాగలక్ష్మి, పంచాయతీరాజ్‌ ఏఈ రవికుమార్‌, ఎస్సై వీరభద్రరావు, కోఆప్షన్‌ మెంబర్‌ రాజమహ్మద్‌, ఏపీవో అలీంపాషా, సర్పంచులు పువ్వాటిరాణి, కసిరెడ్డి సాయిసుధరత్నాకర్‌రెడ్డి, మాసు రాజయ్య, పంచాయతీ కార్యదర్శులు సుచరిత, తిరుమల, ఈసీ రంజిత్‌, ఈజీఎస్‌ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.logo