శనివారం 04 ఏప్రిల్ 2020
Jayashankar - Feb 09, 2020 , 02:06:25

జనం నుంచి వనంలోకి

జనం నుంచి వనంలోకి

ఆదివాసీ ఆరాధ్య దైవాలు వనానికి పయనమయ్యారు. నాలుగు రోజులుగా భక్తులకు దీవెనలందించిన తల్లులు శనివారం వనప్రవేశం చేశారు. గిరిజన సంప్రదాయం ప్రకారం పూజారులు సమ్మక్క గద్దె వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి చిలుకలగుట్టకు సాగనంపారు. అదేవిధంగా సారలమ్మను కన్నెపల్లికి, పగిడిద్దరాజును పూనుగొండ్లకు, గోవిందరాజును కొండాయికి తీసుకెళ్లారు. చివరి రోజు వర్షంలోనూ గతంలో ఎన్నడు లేని విధంగా భారీ సంఖ్యలో భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు. శనివారం కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అర్జున్‌ ముండా, శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు తదితర ప్రముఖలు తల్లులకు మొక్కులు చెల్లించుకున్నారు. కోటిన్నర మంది భక్తులు వన దేవతల సన్నిధికి వచ్చినట్లు దేవాదాయ శాఖ అధికారులు అంచనా వేశారు. జాతర ముగియడంతో భక్తులు తిరుగు ప్రయాణమవుతున్నారు.  

మేడారం బృందం: అశేష జనవాహిని మొక్కులు అందుకున్న వనదేవతలు శనివారం రాత్రి వన ప్రవేశం చేశారు. కోటి మంది భక్తులకు దీవెనలు అందించిన తల్లులు వరుణుడి పలుకరింపుల మధ్య..చల్లటి వాతావరణంలో వనం చేరారు. మేడారంలోని సమ్మక్క-సారలమ్మ జాతర ఘట్టం మండమెలిగె కార్యక్రమంతో మొదలై..వన దేవతల ప్రవేశంతో ముగిసింది. బుధవారం రాత్రి కన్నెపల్లి నుంచి సారలమ్మ, కొండాయి నుంచి గోవిందరాజులు, గంగారం మండలం పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజులు గద్దెలపై కొలువు దీరారు. గురువారం రాత్రి చిలుకలగుట్ట నుంచి సమ్మక్క గద్దెపైకి చేరిన విషయం తెలిసిందే. నిండు సభలో తల్లుల దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరారు. గురువారం రాత్రి నుంచి శనివారం సాయంత్రం వరకూ భారీగా మొక్కులు చెల్లించుకున్నారు. కాగా శనివారం రాత్రి వన ప్రవేశ కార్యక్రమాన్ని పూజారులు చేపట్టారు. వన ప్రవేశం కోసం సాయంత్రం ఐదున్నర నుంచి పోలీసులు దర్శనం నిలిపివేశారు. సమ్మక్క గుడిలో ప్రత్యేక పూజలు చేపట్టిన పూజారులు డోలు వాయిద్యాల నడుమ.. సంస్కృతి సంప్రదాయలు.., ఆచారాలను పాటిస్తూ రాత్రి గెద్దల వద్దకు చేరుకున్నారు. పూజారులు గద్దెల వద్దకు చేరుకునే సమయానికి ప్రాంగణంలో భక్తులతో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు బయటకు పంపించారు. గద్దెలపై ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం హర్షధ్వనుల మధ్య సమ్మక్క తల్లిని పూజారి కొక్కెర కృష్ణయ్య 7.04గంటలకు వనానికి  తీసుకెళ్లారు. అనంతరం 7.08 గంటలకు గోవిందరాజులును కొండాయికి పూజారి దబ్బగట్ల గోవర్ధన్‌, గంగారం మండలం పూనుగొండ్లకు పూజారి మురళీ తీసుకెళ్లారు. అనంతరం సారలమ్మను పూజారి కాకా సారయ్య గ్రామస్తులతో కలిసి కన్నెపల్లిలో గుడికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా తల్లులు గద్దెల నుంచి వన ప్రవేశం చేస్తున్న క్రమంలో వేలాది మంది భక్తులు ఎదురుపడి మొక్కుకున్నారు. వనం ప్రవేశం సందర్భంగా గద్దెల ఆవరణలో భారీ ఎత్తున పోలీసు పహారా ఏర్పాటు చేశారు. వనప్రవేశ  కార్యక్రమంలో పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ములుగు ఎమ్మెల్యే సీతక్క, జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌, కొత్త కలెక్టర్‌ కృష్ణ చైతన్య, జిల్లా ఎస్పీ  సంగ్రామ్‌ సింగ్‌, డీఎస్పీ దక్షిణామూర్తి, మేడారం ట్రస్టుబోర్డు చైర్మన్‌ ఆలం రామ్మూర్తి, ఐటీడీఏ పీవో ఛక్రధర్‌రావు, దేవాదాయశాఖ అధికారులు పాల్గొన్నారు. 


logo