గురువారం 09 ఏప్రిల్ 2020
Jayashankar - Feb 05, 2020 , 03:32:41

హన్మకొండ టు మేడారం

హన్మకొండ టు మేడారం
  • హెలికాప్టర్‌కు భలే గిరాకీ
  • ఒక్కొక్కరికి రూ.16,999

గోవిందరావుపేట, ఫిబ్రవరి 04 : ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు తెలంగాణ టూరిజం శాఖ, తుంబీ ఏవియేషన్‌ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెలికాప్టర్‌ సేవలకు భక్తుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. మొదట హైదరాబాద్‌ నుంచి మేడారం ప్యాకేజీకి అనుకూలంగా హన్మకొండ-మేడారం ప్యాకేజీలో భాగంగా భక్తులు హెలికాప్టర్‌ ప్రయాణానికి ఆసక్తి చూపుతున్నారు. హన్మకొండ నుంచి మేడారం వరకు ఒక్కొక్కరికి జీఎస్టీ పన్నులు కలుపుకొని రూ.16,999లను తీసుకుంటున్నారు. హెలికాప్టర్‌లో ప్రయాణించిన భక్తులకు ఆయా సంస్థలు హెలిప్యాడ్‌ నుంచి సమ్మక్క-సారలమ్మ గద్దెల వరకు ప్రత్యేక వాహనంలో తీసుకెళ్లి వీఐపీ దర్శనం చేయించి తిరిగి హన్మకొండ ఆర్ట్స్‌ కాలేజీలోని హెలిప్యాడ్‌ వద్ద దించుతున్నారు.


హైదరాబాద్‌ నుంచి మేడారం ప్యాకేజీలో భాగంగా ఒక్కొక్కక్కరికి రూ.30వేలు కాగా ఆరుగురిని కలుపుకొని రూ.లక్షా 20వేలుగా చార్జీలను వసూలు చేస్తున్నారు. వారికి కూడా అన్ని ప్రత్యేక వసతులు కల్పిస్తూ భక్తులు హెలికాప్టర్‌ ప్రయాణానికి చేరువయ్యే విధంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. తెలంగాణ టూరిజం శాఖ, తుంబీ ఏవియేషన్‌  ప్రైవేటు సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న హెలిక్యాప్టర్‌ ప్రయాణానికి భక్తులు మొగ్గు చూపుతున్నారు. అంతేకాకుండా మేడారంలో 7నిమిషాల పాటు ఆకాశ మార్గంలో మేడారం పరిసర ప్రాంతాలను విహాగం వీక్షణం చేయిస్తూ ఒక్కొక్కరికి రూ.2999లు తీసుకుంటుండగా అక్కడ కూడా భక్తులు పోటీ పడుతూ హెలికాప్టర్‌ ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నారు.


logo