గురువారం 02 ఏప్రిల్ 2020
Jayashankar - Feb 02, 2020 , 02:04:33

హంపి థియేటర్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు

హంపి థియేటర్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు

ఏటూరునాగారం/తాడ్వాయి, ఫిబ్రవరి 1: మేడారం జాతరకు తరలివచ్చే భక్తులకు సమ్మక్క-సారక్క జీవిత చరిత్ర తెలిపేలా హంపి థియేటర్‌లో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు సాయంత్రం వరకు మొక్కులు చెల్లించుకుని సేదదీరుతుంటారు. ఈ క్రమంలో భక్తులకు ఆహ్లాదకరంగా ఉండేందుకు మేడారంలో హంపి థియేటర్‌ను ఏర్పాటు చేశారు. ఈ వేదికపై ఆదివాసీల సంస్కృతీ సంప్రదాయాలు, సమ్మక్క-సారక్క జీవిత చరిత్రతో పాటు పలు హాస్య నాటికలు, కనువిందుచేసే ప్రదర్శనలు నిర్వహించనున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌కు చెందిన వినాయక నాట్య మండలి సురభి వారితో సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతున్నారు. సమ్మక్క-సారక్కల జీవిత చరిత్ర, వారి పుట్టుక, విశిష్టత లాంటి అంశాలతో భక్తులను ఆకట్టుకునేలా ప్రదర్శనలు ఇస్తున్నట్లు నాట్య మండలి ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌ తెలిపారు. సమ్మక్క-సారక్క జీవిత చరిత్రతో పాటు చెంచులక్ష్మి, మాయాబజార్‌, పాతళ భైరవి నాటకాలు ప్రదర్శించనున్నట్లు ఆయన వివరించారు.


logo