గురువారం 02 ఏప్రిల్ 2020
Jayashankar - Feb 01, 2020 , 02:47:34

మహాజాతరలో ఎక్సైజ్‌ నిఘా

మహాజాతరలో ఎక్సైజ్‌ నిఘా

భూపాలపల్లి టౌన్‌, జనవరి 31 : మేడారం మహాజాతరలో ఎప్పటిలాగే ఎక్సైజ్‌ శాఖ తమ సేవలందించబోతుంది. ఫిబ్రవరి 5 నుంచి 7 వరకు  జరిగే మేడారం మహాజాతరపై ఎక్సైజ్‌ శాఖ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. జాతరకు వచ్చే బెల్లంతోపాటు గుడుంబా విక్రయాలపై నజర్‌ పెట్టింది. జాతర, పరిసరాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఎక్సైజ్‌శాఖ మేడారం పరిసరాల్లో దాడులు నిర్వహిస్తూ కేసులు నమోదు చేస్తున్నది. పోలీసుల చెక్‌పోస్టుల వద్ద ఎక్సైజ్‌ శాఖ సిబ్బంది పర్యవేక్షణ జరపనున్నారు. మేడారంలో ఏర్పాటు చేసే మెయిన్‌ కంట్రోల్‌ రూంలో ఐదుగురు అధికారులతోపాటు 200మంది, నార్లాపూర్‌ వద్ద ఏర్పాటు చేసే సబ్‌ కంట్రోల్‌ రూంలో ఇద్దరు అధికారులతోపాటు 105 మంది సిబ్బంది, రెవెన్యూ, పోలీసు, ఆరోగ్య శాఖతో కలిసి పని చేస్తారు. తాడ్వాయి ఎంపీడీవో కార్యాలయంలో లిక్కర్‌ సబ్‌ డిపో ఏర్పాటు చేస్తున్నామని, ఫిబ్రవరి 2 నుంచి 8 వరకు జాతరలో మద్యం షాపులు కొనసాగుతాయని భూపాలపల్లి, ములుగు జిల్లాల ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ సీవీ శశిధర్‌రెడ్డి ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు.

 

518 మందికి విధులు.. 

మేడారం సమ్మక్కసారలమ్మ జాతరలో ఎక్సైజ్‌ శాఖ నుంచి విధులు నిర్వహించడానికి 518 మంది సిబ్బందిని కేటాయిస్తూ ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ వరంగల్‌ డివిజన్‌ డిప్యూటీ కమిషనర్‌ ఆర్‌ సురేశ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి జిల్లాతోపాటు రాష్ట్రంలోని ఆయా జిల్లాల నుంచి ఎక్సైజ్‌ అధికారులు, సిబ్బందిని జాతరలో సేవలకు నియమించారని శశిధర్‌రెడ్డి తెలిపారు. ఇందులో అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూరింటెండెంట్లు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు, హెడ్‌ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు జాతరలో విధులు నిర్వహించనున్నారు. అలాగే జాతరలో ఏడుగురితో ఒక ఇంటలిజెన్స్‌ టీంను ఏర్పాటు చేయనున్నారు. 11 చెక్‌పోస్టులు, 8 మొబైల్‌ టీంలు, మెడికల్‌ టీం, రిసెప్షన్‌ టీం, మెస్‌ టీం, జాగరీ ఎస్కార్ట్‌ టీం, వసతి టీంలు పని చేస్తాయి. టీంలు ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ శశిధర్‌రెడ్డి కంట్రోల్‌లో పని చేస్తాయి.


11 చెక్‌పోస్టులు..

జాతరలో గుడుంబా, బెల్లంపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడానికి ఎక్సైజ్‌ శాఖ 11చెక్‌ పోస్టులను ఏర్పాటు చేసింది. పస్రా, ప్రాజెక్టు నగర్‌, తాడ్వాయి, బయ్యక్కపేట, ఊరట్టం, కాటాపూర్‌ ఎక్స్‌ రోడ్డు, ఏటూరునాగారం, బ్రాహ్మణపల్లి, కాల్వపల్లి ఎక్స్‌ రోడ్డు, ఎలుబాక, ముల్లకట్టలలో 11 చెక్‌పోస్టులను పోలీసు చెక్‌పోస్టుల పక్కన ఏర్పాటు చేశారు. ఒక్కొక్క చెక్‌పోస్టు వద్ద ఏడుగురు ఎక్సైజ్‌ సిబ్బంది 24గంటలు షిఫ్ట్‌ల వారీగా పని చేయనున్నారు. ఒక్కో చెక్‌పోస్టు టీంలో ఒక టీం ఇన్‌చార్జి, ఒక గైడ్‌ ఉంటారు. అలాగే 8 మొబైల్‌ పార్టీలు జాతర పరిసరాల్లో 24గంటలు చక్కర్లు కొట్టనున్నాయి. 


రెండు కంట్రోల్‌ రూంలు.. 

మేడారం సమ్మక్కసారలమ్మ జాతరలో ఎక్సైజ్‌ శాఖ రెండు కంట్రోల్‌ రూంలను ఏర్పాటు చేసింది. మేడారంలో ఏర్పాటు చేసిన ప్రధాన కంట్రోల్‌ రూంలో ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ శశిధర్‌రెడ్డి పర్యవేక్షణ జరుపుతారు. ఆయనతోపాటు మరో ఐదుగురు అధికారులు, 200 మంది సిబ్బంది పని చేస్తారు. ఇందులో 19 మంది సీఐలు, 24 మంది ఎస్సైలు, 35 మంది హెడ్‌ కానిస్టేబుళ్లు, 96 మంది కానిస్టేబుళ్లు, మరో 26 మంది రిజర్వ్‌లో ఉంటారు. అలాగే నార్లాపూర్‌ వద్ద ఏర్పాటు చేసిన సబ్‌ కంట్రోల్‌ రూంలో అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరిటెండెంట్‌ వరంగల్‌ వీ శ్రీనివాస్‌ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తారు. 12 మంది సీఐలు, 10 మంది ఎస్సైలు, 12 మంది హెడ్‌కానిస్టేబుళ్లు, 58 మంది కానిస్టేబుళ్లు పనిచేయగా 13 మంది రిజర్వ్‌గా ఉంటారు. ఈ టీంలు భక్తుల నుంచి వచ్చే ఫిర్యాదులను తీసుకోవడం, ఎవరైనా మద్యం తాగి పడిపోతే సమీపంలో ఉన్న వైద్య శిబిరాలకు తరలించడం తదితర పనులు పోలీసులతో కలిసి చేస్తుంటారు. జాతరలో ఎక్సైజ్‌ శాఖ, రెవెన్యూ, పోలీసు, వైద్య, ఆరోగ్య శాఖలు కలిసి పని చేస్తాయి. 


logo