బుధవారం 08 ఏప్రిల్ 2020
Jayashankar - Feb 01, 2020 , 02:38:14

రహదారి భద్రత అందరి బాధ్యత

రహదారి భద్రత అందరి బాధ్యత

గణపురం, జనవరి 31 : రహదారి భద్రతా ప్రమాణాలు పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నివారించడం సమష్టి బాధ్యతని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. 31వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా డీటీవో వేణుకుమార్‌ ఆధ్వర్యంలో శుక్రవారం చెల్పూర్‌లోని ఆర్టీఏ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే, కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు, ట్రైనీ ఎస్పీ బాలస్వామి, భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రక్తదానం ప్రాణదానంతో సమానమన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రక్తదానం చేసి పలువురికి ఆదర్శంగా నిలువాలని కోరారు. ప్రతి వ్యక్తి నిత్యం రోడ్డు భద్రతను పాటించాలన్నారు. రోడ్డు భద్రతా నియమాలను పాటించకపోవడంతో ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలు మానవ తప్పిదాల వల్లే జరుగుతాయని, మితిమీరిన వేగంతో ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారన్నారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారిని సకాలంలో దవఖానలకు తరలించి వారి ప్రాణాలు కాపాడాలని సూచించారు. 


పాదచారులు సైతం రోడ్డపై నడుస్తున్నప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన సూచించారు. డీటీవో వేణుకుమార్‌ మాట్లాడుతూ.. డ్రైవింగ్‌లో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌, ఫోర్‌ వీలర్‌ వాహనదారులు సీటు బెల్ట్‌ను తప్పనిసరిగా ధరించాలన్నారు. మద్యం సేవించి వాహనాలను నడుపడంతోనే అధికంగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, అలా జరగకుండా ఉండడం కోసమే పోలీసులు వాహనాలను తనిఖీలు చేపడుతున్నారన్నారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉంటేనే వాహనాలను నడపాలని, మైనర్లకు వాహనాలను ఇవ్వరాదని ఆయన సూచించారు. అదే విధంగా ‘సెల్‌ఫోన్‌'లో మాట్లాడుతూ వాహనాలను నడపొద్దన్నారు. వాహన స్థాయికి మించి ప్రయాణికులను ఎక్కించకోరాదన్నారు. ట్రాఫిక్‌ నియమ నిబంధనలు తప్పకుండా పాటిస్తే ప్రమాదాలను చాలా వరకు నివారించవచ్చునన్నారు. వారం రోజులుగా జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో ప్రజలకు, వాహనదారులకు అవగాహన కార్యక్రమలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం రెడ్‌ క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో డాక్టర్లు  60 మంది రక్తదాతల నుంచి రక్త సేకరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంవీఐ రాజశేఖర్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ సుభాషిని, జూనియర్‌ అసిస్టెంట్‌ వేణు, రామకృష్ణ, భాస్కర్‌, సంతోశ్‌, రెడ్‌క్రాస్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.logo