బుధవారం 01 ఏప్రిల్ 2020
Jayashankar - Jan 31, 2020 , 04:18:46

నర్సింగ్‌స్కూల్‌పై ఏసీబీ దాడులు

నర్సింగ్‌స్కూల్‌పై ఏసీబీ దాడులు
  • రూ.40 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన
  • ప్రిన్సిపాల్‌ సతీశ్‌కుమారి, ఇద్దరు ట్యూటర్లు

వరంగల్‌ చౌరస్తా, జనవరి 30: జీఎన్‌ఎం నర్సింగ్‌ కోర్సు పూర్తి చేసుకున్న యువతికి రిలీవింగ్‌, సర్టిఫికెట్స్‌ అందించేందుకు వరంగల్‌ ఎంజీఎం నర్సింగ్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ సతీశ్‌కుమారితో పాటు ఇద్దరు ట్యూటర్లు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు, బాధితురాలి కథనం ప్రకారం.. ములుగు జిల్లా వెంకటాపురం హెల్త్‌ సెంటర్‌లో ఏఎన్‌ఎంగా విధులు నిర్వహిస్తున్న వట్గూరి జ్యోతి 2016లో వరంగల్‌ ఎంజీఎం ఆవరణలోని నర్సింగ్‌ స్కూల్లో జీఎన్‌ఎం కోర్సులో చేరింది. గత నెలలో కోర్సు పూర్తి చేసుకున్న జ్యోతికి రిలీవింగ్‌, సర్టిఫికెట్లు అందించేందుకు నర్సింగ్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ సతీశ్‌కుమారి, ట్యూటర్లు శారద, శోభ డిమాండ్‌ చేసి, బాధితురాలితో రూ.40 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. 


తనకు సర్టిఫికెట్స్‌ అందించడానికి లంచం అడిగిన వారిని పట్టించేందుకు జ్యోతి ఈ నెల 23న ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. అధికారులు గురువారం పక్కా ప్రణాళిక ప్రకారం లంచం డబ్బులతో నర్సింగ్‌ స్కూల్‌ ఆవరణకు చేరుకున్నారు. ఒప్పందం ప్రకారం ఆ నగదును జ్యోతి ప్రిన్సిపాల్‌కు అందించేందుకు ప్రయత్నించగా ట్యూటర్‌ శారద, శోభకు అందించమని ప్రిన్సిపాల్‌ తెలిపింది. దాంతో నగదును ట్యూటర్లకు అందించి వెనుదిరిగిన వెంటనే అధికారులు దాడులు నిర్వహించి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నగదు తన చేతులగుండా తీసుకున్న శోభకు ఫినాఫ్థలిన్‌ పరీక్షలు నిర్వహించినట్లు ఏసీబీ డీఎస్పీ మధుసదన్‌ తెలిపారు. అనంతరం నగదును ప్రిన్సిపాల్‌ ఆధ్వర్యంలోవున్న బీరువా నుంచి రికవరీ చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. ఈ దాడుల్లో సీఐలు వెంకట్‌, క్రాంతికుమార్‌, రవీందర్‌రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.logo
>>>>>>