శనివారం 04 ఏప్రిల్ 2020
Jayashankar - Jan 29, 2020 , 02:27:39

ఒక్కరోజే లక్షా 20 వేల మంది పూజలు

ఒక్కరోజే లక్షా 20 వేల మంది పూజలు

వరంగల్‌ ప్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ: మేడారం మహాజాతరకు వారమే గడువు. నట్టనడివి అడవిలో దట్టమైన జనారణ్యంగా రూపాంతరం చెందే అద్భుత సన్నివేశం ఆవిష్కృతం కా బోతున్నది. ఆదిమ గిరిజన సంస్కృతి నుంచి ఆ ధునిక సాంకేతికల మేళవింపుదాకా అనేకానేక అజరామర ఘట్టాలను మేడారం తన అమ్ముల పొదిలో దాచుకుంటూ కోటానుకోట్ల భక్తులకు కొంగుబంగారంగా విరాజిల్లుతున్న మహాజాతర. మేడారం టర్న్స్‌ ఫ్రం బుల్లక్‌ కార్ట్‌ టు సైబర్‌ మా ర్ట్‌. ఎడ్లబడ్ల మీద నుంచి హెలిక్యాప్టర్‌ సేవల్ని తమ గద్దెల వద్దకు రప్పించుకునే అపురూప ఘట్టానికి సరిగ్గా వారం రోజులే ఉన్నది. బుధవారం మండమెలిగె పండుగతో జాతరకు అంకుర్పాణ జరుగుతున్నది. దేశ విదేశాల నుంచి భక్తులు మేడారం సమ్మక్క-సారమ్మలని దర్శించుకునేందుకు తరలివస్తున్నారు. ఈ వచ్చే భక్తులకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లను ప్రతిష్టాత్మకంగా చేపట్టింది.  తెలంగాణ ధిక్కార సంస్కృతికి ఆలవాలమైన సమ్మక్క-సారమ్మల ఆత్మగౌరవ ప్రతీకలకు నిలువెత్తు సంతకం గా ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాడు ఉద్యమ సమ యం నుంచి రాష్ట్ర ఆవిర్భావం దాకా, రాష్ట్ర ఆవిర్భావం నుంచి అభివృద్ధి పథాన రాష్ర్టాన్ని పరుగులు పెట్టించే క్రమంలో ఇక్కడి సంస్కృతీసంప్రదాయాలను దిగంతాలకు చాటేందుకు అనేక ఏర్పాట్లు చేస్తున్నారు. తల్లీబిడ్డలిద్దరూ గద్దెల మీద కొలువుదీరి భక్తులకు దీవెనలిచ్చే రోజు (వచ్చేనెల 7న, శుక్రవారం) ముఖ్యమంత్రి కేసీఆర్‌ మేడారం రాబోతున్నారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నది. అదేవిధంగా జాతరకు వచ్చే ప్రతి భక్తుడు సురక్షితంగా తల్లులను దర్శించుకొని తిరిగి తమతమ గమ్యస్థానాలకు చేరేందుకు అన్ని పకడ్బందీ ఏర్పా ట్లు చేస్తుంది. జాతర జాతరకు మధ్య జరుగుతున్న అనేక మార్పులు. సౌకర్యాల్లో కానీ, ఏర్పాట్లలో కానీ మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మేడారానికి మెరుగైన వసతులు విశిష్టంగా సాగుతున్నాయి. మేడారం జాతర నిర్వహణను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో ఉన్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందరికీ అందుబాటులో ఉంచుతున్నది. ప్రత్యక్షంగా జాతరకు వచ్చే భక్తులకు సంప్రదాయ ఏర్పాట్లతోపాటు దేశ, విదేశాల నుం చి వచ్చే భక్తుల కోసం సాంకేతికతను మేళవించి ఈసారి అందుబాటులో ఉంచింది. ఇప్పటికే అనే క ప్రచార, ప్రసార మాధ్యమాల ద్వారా జాతర విశిష్టతను తెలియజెప్పడమే కాకుండా జాతర ప్రాంగణంలో ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలు, చేసిన ఏర్పాట్లను అరచేతిలో ఉంచేందుకు ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. మేడారానికి మొబైల్‌ విప్లవం భక్తులకు వారధి కడుతున్నది. అందులో భాగంగా ఈసారి మేడారం జాతర భక్తులకు ము లుగు జిల్లా యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ప్రత్యేక అధికారిక యాప్‌ను రూపొందించింది.  మారిన సాంకేతిక పరిజ్ఞానం, స్మార్ట్‌ ఫోన్‌ రివల్యూషన్‌ మనిషి మనిషిని ప్రభావితం చేసింది. ఈ నేపథ్యంలో ములుగు జిల్లా యంత్రాంగం మేడారం మహాజాతరకు వచ్చే భక్తులకు ఎవరి సహాయం లేకుండానే ఎవరికి వారు స్వీయ మార్గదర్శనం చేసుకునే విధంగా ప్రత్యేక అధికారిక యాప్‌ను రూపొందించింది. 

 మేడారం జాతర యాప్‌

మేడారం జాతర 2020 పేరుతో ములుగు జిల్లా యంత్రాంగం అఫీషియల్‌ యాప్‌ను రూ పొందించింది. ఇన్‌చార్జి కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఈ యాప్‌ రూపుదిద్దుకున్నది. స్మార్ట్‌ ఫోన్‌ ఆపరేట్‌ తెలిసి ఉంటే చాలు ఎవరి ప్రమేయం లేకుండా మేడారం వెళ్లి  తల్లుల్ని దర్శించుకొని సురక్షితంగా తిరిగి రావడమే కాదు మేడారం మహాజాతర ప్రాంగణంలో ప్రభుత్వం చేసిన సౌకర్యాలు, రూట్‌ మ్యాప్‌ వంటి అనేక విషయాలు ఆ యాప్‌లో ఇమిడి ఉన్నాయి. మడికొండ ఐటీ పార్క్‌లోని కాకతీయ ఐటీ సొల్యూషన్స్‌ ఆ యాప్‌ను రూపొందించింది. రాష్ట్ర నలుమూలల నుంచి జాతరకు వివిధ మార్గాల ద్వారా వచ్చేందుకు ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు, జాతర నిర్వహణ వంటి అన్ని అంశాలు ఈ యాప్‌లో ఉన్నాయి.  జాతర నిర్వహణలో విభాగాలు, సెక్టోరియల్‌ అధికారులు ఇలా ఒక్కటేమిటీ అన్ని అరచేతిలో ఉన్నట్టే. మెడికల్‌ క్యాంప్‌లు, ఆర్టీసీ బస్‌ పాయింట్లు,  జంపన్నవాగు స్నాన ఘట్టాలు, పోలీ సు యంత్రాంగం సూచనలు ఉన్నాయి. 

యాప్‌లో మిస్సింగ్‌ హైలెట్స్‌ 

ఈ యాప్‌లో ప్రత్యేక ఆకర్షణ మిస్సింగ్‌ ఆప్షన్‌. తప్పిపోయిన వారు ఎక్కడ తప్పిపోయారు? వారి స్వస్థలం ఎక్కడ, వారిది కానీ లేదా వారి ఫోన్‌ నంబర్లు మాత్రమే కాకుండా ఫొటోతో సహా ఎప్పటికప్పుడు యాప్‌లో అప్‌లోడ్‌ చేసే వెసులుబాటు కల్పించారు.

మెడికల్‌ క్యాంప్‌ 

మేడారంలో మెయిన్‌ మెడికల్‌ క్యాంప్‌తోపా టు 16 వైద్య శిబిరాలు, అక్కడి నుంచి మెయిన్‌ క్యాంప్‌కు దూరం తదితర విశేషాలను యాప్‌లో రూపొందించారు. ఊరట్టం కాజ్‌వే, చింతల్‌ క్రాస్‌రోడ్‌, నార్లాపూర్‌, పగిడాపూర్‌, ఎల్బాక, కొ త్తూరు, కన్నెపల్లి క్రాస్‌, కన్నెపల్లి, ఎల్బాక చెరువు దగ్గర, జంపన్నవాగు దగ్గర, కాల్వపల్లి క్రాస్‌ వద్ద, రెడ్డిగూడెం, రెడ్డిగూడెం క్రాస్‌ దగ్గర, కొత్తూర్‌ క్రా స్‌, చిలుకలగుట్ట ఇలా మెడికల్‌ క్యాంప్‌లు ఏర్పా టు చేశారు. ఈ ఏర్పాట్లను భక్తులకు తెలియజెప్పేలా యాప్‌లో పొందుపరిచారు. 

 పోలీసు విభాగం 

సురక్షితంగా మేడారం చేరుకోవడం, తిరిగి వెళ్లడం, పార్కింగ్‌ ప్రదేశాలు, రిపోర్ట్‌ ఇన్సిడెంట్స్‌, తప్పిపోయిన వారి కోసం ఏర్పాటు చేసిన ప్రకటన కేంద్రాలు ఇలా భక్తులకు ఉపయోగపడేలాసూచనలు, ట్రాఫిక్‌ వివరాలు పొందుపరిచారు. 


logo