శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Jayashankar - Jan 28, 2020 , 02:21:32

టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల మొదటి జాబితా విడుదల

టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల మొదటి జాబితా విడుదల


భూపాలపల్లి టౌన్‌, జనవరి 12 : మున్సిపాలిటీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల మొదటి జాబితా ఆదివారం ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రకటించారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో 30 వార్డులుండగా 30వార్డులకుగాను 138మంది టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి నామినేషన్లు దాఖలు చేశారు. ఈ క్రమంలో వార్డుల వారీగా అభ్యర్థులపై సర్వేలు నిర్వహించిన ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గెలుపు గుర్రాలను ఎంపిక చేసే ప్రక్రియ ప్రారంభించారు. మొదటి విడతగా తొమ్మిది మంది అభ్యర్థులను ప్రకటించారు. సోమవారం మరికొంత మందికి, మంగళవారం మిగిలిన వారందరికీ బీ ఫారాలు అందజేస్తామని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఎంపిక చేసిన తొమ్మిది మంది అభ్యర్థులకు ఎమ్మెల్యే గండ్ర కండువాలు కప్పి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారితో ప్రత్యేకంగా సమావేశమై గెలుపే లక్ష్యంగా పని చేయాలని కోరారు. టికెట్‌ రానివారందరినీ కలుపుకుపోవాలని సూచించారు. భూపాలపల్లిలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి సంక్షేమ ఫలాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఓట్లు అభ్యర్థించాలని కోరారు. ఇప్పటి నుంచి ప్రతి ఓటరును కలుస్తూ ఓట్లు అభ్యర్థించాలని, పార్టీ నాయకులు, కార్యకర్తలు అండగా ఉంటారని వెల్లడించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ పార్టీ అర్బన్‌ అధ్యక్షుడు క్యాతరాజు సాంబమూర్తి, సీనియర్‌ నాయకులు బుర్ర రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.


logo