గురువారం 09 ఏప్రిల్ 2020
Jayashankar - Jan 28, 2020 , 05:16:36

పురపీఠంపై గులాబీ జెండా..

పురపీఠంపై గులాబీ జెండా..
  • శ్రేణుల్లో వెల్లివిరుస్తున్న ఆనందం
  • ప్రజల ఏకపక్ష తీర్పు
  • బిత్తరపోతున్న ప్రతిపక్షాలు

జయశంకర్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : మున్సిపల్‌ ఎన్నికలు తెలంగాణ రాష్ట్ర సమితిలో కొత్త ఊపును తెచ్చాయి. ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలు వేస్తున్నది. ఎన్నికల ముందు కేసీఆర్‌, కేటీఆర్‌ ఇచ్చిన పిలుపు, చేసిన దిశాదశ నిర్ధేశం, ఎమ్మెల్యేతో పాటు ముఖ్య నాయకుల నేతృత్వంలో అమలు చేయడంతో అత్యుత్తమ ఫలితాలు సాధించారు. ఈ మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రజలు దాదాపు ఏకపక్ష తీర్పునిచ్చారు. ప్రభుత్వ పథకాలను, ప్రభు త్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను, కొత్త మున్సిపల్‌ చట్టాన్ని, తేనున్న సంస్కరణలు, అమలవుతున్న స్కీంలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో టీఆర్‌ఎస్‌ శ్రేణులు సఫ లమయ్యాయి. దీంతో అత్యుత్తమ ఫలితాలు వచ్చాయి. ప్రజలు భూపాలపల్లిలో తెలంగాణ రాష్ట్ర సమితికి బ్రహ్మరథం పట్టారు. 30 వార్డులకుగాను ఒక వార్డు ఏకగ్రీవం కాగా 22 వార్డులను ప్రత్యక్ష ఎన్నికల్లో మొత్తం 23 కౌన్సిలర్‌ స్థానాలను తెలంగాణ రాష్ట్ర సమితి మంచి మెజార్టీతో గెలుచుకుంది. సోమవారం జరిగిన చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్‌ ఎలాంటి సమస్యలు లేకుండా సునాయాసంగా ఏకగ్రీవం చేసుకోవడం జరిగింది. వరుస విజయాలతో తమ విజయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి మున్సిపల్‌ ఎన్నికల్లో కూడా విజయ దుందుభి మోగించింది. ఎన్నిక ఏదైనా అభివృద్ధి సం క్షేమాలకు జోడెడ్ల బండిలా ముందుకు తీసుకెళ్తున్న టీఆర్‌ఎస్‌దే కావడంతో ఆ పార్టీ శ్రేణులు సర్వత్రా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి. స్థానిక శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి, పరిశీలకులు వరంగల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ గుండా ప్రకాష్‌రావు, గోవింద్‌నాయక్‌లు ప్రత్యేక వ్యూహ రచన చేసి ఎక్కడ కూడా రెబల్స్‌, అసమ్మతి అంటూ లేకుండా ముందుకు నడిపారు. సోమవారం చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక పూర్తయ్యాక తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాలు, వివిధ శ్రేణులు గెలుపొందిన కౌన్సిలర్లు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. 


ఈ విజ యోత్సవ ర్యాలీలో భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి సతీమణి వరంగల్‌ రూరల్‌ జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ గండ్రజ్యోతి పాల్గొన్నారు. ఈ సం దర్భంగా మహిళా కౌన్సిలర్లతో కలిసి నృత్యాలు చేస్తూ తెలంగాణ పాటలకు స్టెప్పులు వేస్తూ ఆనందాన్ని పంచుకున్నారు. ఆచార్య జయశంకర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్‌ సెంటర్‌ ఆయన విగ్రహానికి పూలమాల వేశారు. ఆ తర్వాత దారి వెంట నృత్యాలతో హోరెత్తించారు. మహిళా కౌన్సిలర్లు, జెడ్పీ చైర్‌పర్సన్‌ తెలంగాణ పాటలకు స్టెప్పులు వేయడంతో చూసేందుకు పోటీపడ్డారు. గత శాసనసభ ఎన్నికల వరకు ప్రతిపక్షాలు పోటీనిచ్చేందుకు నానా తంటాలు పడేవి. కానీ ఈ మున్సిపల్‌ ఎన్నికల్లో కూడా అధికార పక్షం దరిదాపుల్లోకి కూడా రాలేకపోయాయి. జాతీయ పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్‌, తెలుగుదేశం భూపాలపల్లి మున్సిపల్‌ ఎన్నికల్లో పూర్తిస్థాయిలో కౌన్సిలర్‌ స్థానాలకు అభ్యర్థులను కూడా నిలుపుకోలేని పరిస్థితిలో కనిపించాయి. దీంతో భూపాలపల్లి ప్రజలు తెలంగాణ రాష్ట్ర సమితి పక్షాన నిలిచారు. పార్టీ చేస్తున్న కార్యకర్తలను గుర్తించి ఏకపక్షం తీర్పునిచ్చారు. భూపాలపల్లి మున్సిపాలిటీపై టీఆర్‌ఎస్‌ గులాబీ జెండా ఎగురవేసింది.  


logo