ఆదివారం 24 మే 2020
Jayashankar - Jan 28, 2020 , 05:11:17

మేడారం భక్తుల స్నానాలకు నేడు లక్నవరం నీటి విడుదల

మేడారం భక్తుల స్నానాలకు నేడు లక్నవరం నీటి విడుదల

గోవిందరావుపేట, జనవరి 27: మేడారం జాతరలో భాగంగా భక్తులు స్నానాలు చేసేందుకు నేడు లక్నవరం సరస్సు నుంచి నీటిని విడుదల చేయనున్నారు. జాతర సమయానికి 3 రోజుల ముందే లక్నవరం నీటిని విడుదల చేసే వారు. కానీ, ఈ సారి గోవిందరావుపేటలోని దయ్యాల వాగు బ్రిడ్జి పక్కన మరో బ్రిడ్జి నూతనంగా ఏర్పాటు చేస్తుండడంతో పక్కనే మరో అప్రోచ్‌ రోడ్డు వేస్తున్నారు. గతంలో ఒక్క సారిగా నీటిని విడుదల చేసేవారు. వాగు నీటి ప్రవాహం ఉధృతంగా ఉండేది. ఈ సారి దయ్యాల వాగు బ్రిడ్జి పిల్లర్లు ఉండడంతో అప్రోచ్‌ రోడ్డుకు వేసిన పైప్‌ల ద్వారా నీరు వెళ్లనున్నాయి. ఈ మేరకు ఒక్కసారి నీటిని విడుదల చేస్తే ఇబ్బందులు ఎదురయ్యే సమస్య ఉన్నందున క్రమక్రమంగా నీటిని విడుదల చేయనున్నారు. నేడు విడుదల చేసిన నీరు ఫిబ్రవరి 1, 2వ తేదీల్లో మేడారం జంపన్నవాగులోకి చేరనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. గత జాతర కంటే ఈ సారి ముందే జంపన్నవాగు నీటితో కలకలలాడుతూ భక్తుల పుణ్య స్నానాలకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ఉండే వీలు ఉంది. 


logo