శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Jayashankar - Jan 28, 2020 , 05:09:48

విద్యుత్‌ ఉత్పత్తికి ఆటంకం రానివ్వొద్దు

విద్యుత్‌ ఉత్పత్తికి ఆటంకం రానివ్వొద్దు
  • జెన్కో సీఎండీ దేవుళ్లపెల్లి ప్రభాకర్‌రావు
  • కేటీపీపీలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

గణపురం, జనవరి27: రానున్న వేసవి కాలంలో రాష్ట్రంలో ఏర్పడే విద్యుత్‌ డిమాండ్‌ను తట్టుకునేలా నిరంతర విద్యుత్‌ ఉత్పత్తిని చేపట్టాలని, ఎట్టి పరిస్థితుల్లో విద్యుత్‌ ఉత్పత్తిలో కొరత రానివ్వొద్దని కేటీపీపీ అధికారులను జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు ఆదేశించారు. కేటీపీపీలో రూ.120కోట్లతో నిర్మించనున్న గృహసముదాయాల నిర్మాణ భూమిపూజ కార్యక్రమంలో సీఎండీ ప్రభాకర్‌రావు దంపతులు సోమవారం పాల్గొన్నారు. అలాగే కేటీపీపీ కార్యాలయంలో లిఫ్ట్‌ సిస్టమ్‌ను ప్రారంభించారు. అనంతరం కర్మాగారాన్ని సందర్శించి ఆయా విభాగాల్లో జరుగుతున్న పనులను పరిశీలించి, సర్వీస్‌ భవన్‌లో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ప్లాంటులో బొగ్గు నిల్వలు, తీసుకుంటున్న చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీఎండీ మాట్లాడుతూ రాష్ట్రంలో వేసవిలో పెరుగనున్న విద్యుత్‌ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని నిరంతర విద్యుత్‌ ఉత్పత్తికి అధికారులు కార్యాచరణ, ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని చెప్పారు. సౌర, పవన విద్యుత్‌ పడిపోయి థర్మల్‌ విద్యుత్‌పైనే భారం పడుతున్న సందర్భంగా ముందే బొగ్గునిల్వలపై అధికారులు దృష్టి సారించాలని సూచించారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరంతర విద్యుత్‌ను రాష్ట్ర ప్రజలకు అందిస్తుందన్నారు. దానికి అనుగుణంగా టీఎస్‌ జెన్కో కృషి చేస్తున్నదని తెలిపారు. అదేవిధంగా ఉత్పత్తి వ్యయాన్ని వీలైనంత వరకు తగ్గించి అధిక ఉత్పత్తిని సాధించాలని సూచించారు. అనంతరం అడిషినల్‌కోల్‌ హ్యండిల్‌ ప్లాంటు పనులను పరిశీలించారు. త్వరతిగతిన పనులను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సీఈ సిద్ధయ్య, ఎస్‌ఈ చంద్రమౌళి, వీరస్వామి, రాజ్‌కుమార్‌, తిరుపతి, ఏడీ సంతోష్‌, ఏఈ అబ్దుల్‌ నబి, తదితరులు పాల్గొన్నారు.


logo