గురువారం 02 ఏప్రిల్ 2020
Jayashankar - Jan 27, 2020 ,

అంబరాన్నంటిన సంబురాలు

అంబరాన్నంటిన సంబురాలు
కృష్ణకాలనీ, జనవరి 26 : జిల్లా కేంద్రంలోని కృష్ణకాలనీలో గల డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ క్రీడా మైదానంలో ఆదివారం మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలను అంబేద్కర్‌ మైదానంలో నిర్వహించగా జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ జక్కు శ్రీహర్షిణి, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఏఎస్పీ శ్రీనివాసులు, జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కే స్వర్ణలతతో కలిసి జెండాకు వందనం చేశారు. అనంతరం ఆర్‌ఐ సతీశ్‌ ఆధ్వర్యంలో సాయుధ బలగాలు కవాతు నిర్వహించగా మైదానంలో పరేడ్‌ వాహనంపై పోలీసుల గౌరవ వంద నం స్వీకరించారు. పండుగ వాతావరణంలో జరిగిన 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలను వీక్షించడానికి అంబేద్కర్‌ క్రీడా మైదానానికి భూపాలపల్లి పట్టణవాసులు వేలాదిగా తరలివచ్చారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు జిల్లా ప్రజలను ఉద్దేశిస్తూ జిల్లాలో జరిగిన పలు అభివృద్ధి పనులను గురించి మాట్లాడారు. అనంతరం జిల్లాలోని స్వాతంత్య్ర సమరయోధులైన గండ్ర లింగారావు, వంగ వెంకట్రాజం, ఆకు ల రాజయ్య, నల్ల శ్యాంసుందర్‌రెడ్డి, పరిపాటి మో హన్‌రెడ్డితోపాటు 10మందిని సన్మానించడంతోపాటు జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేశారు.

ఆకట్టుక్ను శకటాల ప్రదర్శన..

గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జిల్లాలోని వివిధ శాఖల అధికారులు ఏ ర్పాటు చేసిన 10శకటాలు ఆదివారం అంబేద్కర్‌ స్టేడియంలో జిల్లా ప్రజలను ఆకట్టుకున్నాయి.  ఇందులో వ్యవసాయశాఖ రైతుబంధు, రైతుబీ మా, వ్యవసాయ పనిముట్లు, సబ్సిడీ ట్రాక్టర్లు, వి ద్యాశాఖ ఉత్తమ ఫలితాలు, సన్నబియ్యం, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆసరా పింఛన్లు, పశు సంవర్ధకశాఖ గొర్రెల అభివృద్ధి పథకం, పశుపైద్య సేవలు, 1962 సంచార పశు వైద్యశాల, జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ గురుకుల విద్యాలయాలు, జిల్లా షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ ఎస్సీ, ఎస్టీ హాస్టల్‌ రుణాలు, విదేశీ విద్యకు సహకారం, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, 108అంబులెన్సు, 102, 104, వైద్య సేవలు, మత్స్యశాఖ చెరువులలో చేపల సాగు, కాళేశ్వరంలో చేపల పెంపకంతో ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శన అంబేద్కర్‌ స్టేడియంలో పలువురిని కనువిందు చేశాయి. వీటిలో ఉత్తమ శకటాలుగా మూడింటిని ఎంపిక చేయగా మొదటి బహుమతి వ్యవసాయ శాఖకు, రెండో బహుమతి పశుసంవర్ధశాఖకు, మూడో బహుమతి జిల్లా మహిళా, స్త్రీ, శిశు సంక్షేమశాఖలోని ఆసరా పెన్షన్‌ శకటానికి వచ్చింది.

ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన స్టాల్స్‌..

గణతంత్ర వేడుకల్లో భాగంగా ప్రభు త్వం అ మలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ జిల్లాలోని ఆయా శాఖల అధికారులు ఏడు స్టాల్స్‌ను ఏర్పాటు చేశా రు. ఈ స్టాల్స్‌ను కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఇందులో జిల్లా సమాచారశాఖ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌లో జిల్లాలోని పర్యాటక కేంద్రాలైన కాళేశ్వరంలోని లక్ష్మీ, సరస్వతి ప్రాజెక్టులు, పాండవుల గుట్టలు, కోటగుళ్లు, మిషన్‌ భగీరథ ఫొటోలను ప్రదర్శించారు. అదేవిదంగా వ్యవసాయశాఖ రైతుబంధు, రైతు బీమా, సాంకేతిక వ్యవసాయం, కంపోస్టు, సబ్సిడీపై ట్రాక్టర్లు అందజేసే ఫొటోలు పొందుపరిచారు. ఉద్యానవన ప ట్టు పరిశ్రమశాఖల ఆధ్వర్యంలో కూరగాయలు, తాజాపండ్లు, మరమ్మతు పరికరాల ఫొటోలు ఏ ర్పాటు చేశారు. జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో చేనేత చీరలు, గుడ్లు, ఇంకుడుగుంతల ఫొటోలు ఏర్పాటు చేశారు. సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తం, అమ్మఒడి, కేసీఆర్‌ కిట్‌, కంటి వెలు గు ఫొటోలు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాటు చేసింది. తెలంగాణకు హరితహారం ఫొటోలు అటవీశాఖ ఏర్పాటు చే సింది. జిల్లా మహిళా, శిశుసంక్షేమ శాఖ ఆరోగ్యవంతమైన జీవితానికి అవసరమయ్యే పిండి వంటలు, గర్భిణులు, చిన్న పిల్లలు తీసుకునే ఆహారాన్ని తయారు చేయగా జిల్లా కలెక్టర్‌, ఎమ్మెల్యే, జెడ్పీ చైర్‌పర్సన్‌, ఏఎస్పీ, ఆర్డీవో ఆ వంటలను భుజించారు. 

పోలీసుల భారీ బందోబస్తు..

గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించకుని ఏఎస్పీ శ్రీనివాసులు గత రెండు రోజులుగా అంబేద్కర్‌ స్టేడియం చుట్టూ భారీ బందోబస్తు ని ర్వహించారు. అంబేద్కర్‌ మైదానం చుట్టూ సా యుధ బలగాలను కాపలాగా ఉంచి సంబంధిత పోలీసు అధికారులను భద్రతపై ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకున్నారు. ఈ భద్రత ఏర్పాట్లను భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు, కాటారం డీఎస్పీ బోనాల కిషన్‌, సీఐ వాసుదేవరావు పోలీసు సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు. ఇద్దరు డీఎస్పీలు జిల్లాలోని అన్ని మండలాల ఎస్సైలు, పోలీసు సిబ్బందితో అంబేద్కర్‌ స్టేడియం చుట్టూ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

అంబేద్కర్‌ విగ్రహం వద్ద ఘన నివాళి..

గణతంత్ర వేడుకల్లో భాగంగా భారత రా జ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు.  జేసీ కూరాకుల స్వర్ణలత, ఆర్డీవో వైవీ గణే శ్‌, భూపాలపల్లి తహసీల్దార్‌ శ్రీనివాసాచారి,  ఎ స్సీ, ఎస్టీ నాయకులు భద్రయ్య, జక్కు రాకేష్‌, పొ క్కూరి చిన్నరాజయ్య, నరేష్‌, డీపీఆర్‌వో రవికుమార్‌, సీహెచ్‌వో రాజయ్య పాల్గొన్నారు.


logo