సోమవారం 30 మార్చి 2020
Jayashankar - Jan 27, 2020 ,

మేడారంలో ముమ్మరంగా పారిశుధ్య పనులు

మేడారంలో ముమ్మరంగా పారిశుధ్య పనులు

తాడ్వాయి/వాజేడు/జనవరి 26 : మేడారం జాతర పరిసరాల్లో పంచాయతీరాజ్‌శాఖ ఆధ్వర్యంలో పారిశుధ్య  పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. గత నెల రోజులుగా ముందస్తు మొక్కులకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తుండటంతో అప్పటి నుంచి పారిశుధ్య పనులు కొనసాగుతున్నాయి. భక్తుల రద్దీకితోడు మహాజాతర సమీపించడంతో డీపీవో వెంకయ్య ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. భక్తుల రద్దీకి అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచి జాతర పరిసరాల్లో పారిశుధ్య పనులను చేపడుతున్నారు. జాతర పరిసరాల్లోకి ప్లాస్టిక్‌ రాకుండా చర్యలు చేపడుతున్నారు. ప్రతిరోజూ దుకాణాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. జాతర పరిసరాల్లో పోగైన చెత్తను ఎత్తి మేడారం సమీపంలోని అడవిలో ఉన్న గుడ్డేలుగుల బోరు వద్ద డంపు చేస్తున్నారు. జాతర పరిసరాల్లో దుర్వాసన వ్యాప్తిచెందకుండా బ్లీచింగ్‌ పౌడర్‌ను చల్లిస్తున్నారు. కూలీలను షిప్టులుగా విభజించి రాత్రి పగలు పారిశుధ్య పనులను చేపడుతున్నారు. కల్యాణకట్ట వద్ద శాశ్వత కూలీలను నియమించి ఎప్పటికప్పుడు శుద్ధి చేస్తున్నారు. కోళ్ల షాపుల వద్ద చెత్తకుండీలను ఏర్పాటు చేశారు. చెత్తకుండీల్లోని వ్యర్థాలను ఎప్పటికప్పుడు పారిశుధ్య సిబ్బంది  డంపింగ్‌యార్డులకు తరలిస్తున్నారు. డీపీవో రాత్రింబవళ్లు అక్కడే ఉండి పనులను పర్యవేక్షిస్తున్నారు. భక్తుల రద్దీ ఎక్కువ కావడంతో శనివారం నుంచి కూలీల సంఖ్యను పెంచామని, అవసరానికి అనుగుణంగా మరింత మంది కూలీలను ఏర్పాటు చేయనున్నట్లు డీపీవో వెంకయ్య తెలిపారు.   


  
logo