సోమవారం 30 మార్చి 2020
Jayashankar - Jan 25, 2020 , 01:54:40

టెన్షన్‌.. టెన్షన్‌!

టెన్షన్‌.. టెన్షన్‌!
  • - మున్సిపల్‌ ఫలితాలపై అభ్యర్థుల్లో ఉత్కంఠ
  • -నేడే కౌంటింగ్‌
  • -ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
  • -రెండు రౌండ్లు,29 టేబుళ్లు..
  • -137మంది అధికారులు,సిబ్బంది నియామకం


మరికొన్ని గంటల్లో మున్సి‘పోల్స్‌' ఫలితాలు వెలువడనున్నాయి. పురపోరులో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనుంది. దీంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఓట్ల లెక్కింపునకు కృష్ణకాలనీ అంబేద్కర్‌ స్టేడియంలోని మినీ ఫంక్షన్‌ హాల్‌లో అధికారులు సర్వం సిద్ధం చేశారు. కౌంటింగ్‌ హాల్‌లో 29 టేబుళ్లను ఏర్పాటు చేశారు. 137మంది అధికారులు, సిబ్బందిని నియమించారు. ఒక్కోవార్డు ఓట్ల లెక్కింపును రెండు రౌండ్లలో పూర్తి చేయనున్నారు. ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం కానుండగా, మధ్యాహ్నం వరకు మొత్తం ఫలితాలు వెలువడనున్నాయి.

జయశంకర్‌ జిల్లా ప్రతినిధి/నమస్తే తెంలగాణ: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌కు రంగం సిద్ధమైంది. కృష్ణకాలనీ అంబేద్కర్‌ స్టేడియంలోని మినీ ఫంక్షన్‌ హాలులో కౌంటింగ్‌కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకోసం కమ్యూనిటీ హాల్‌లో 29 టేబుళ్లను ఏర్పాటు, చుట్టూ ఫెన్షింగ్‌ పెట్టారు. టేబుల్‌కు ఒక బాక్స్‌ను, ఒక సూపర్‌వైజర్‌, ఇద్దరు అసిస్టెంట్లను నియమించారు. మూడు వార్డులకు ఒక ఆర్‌వో, ఏఆర్‌వో ఫలితాలను పర్యవేక్షించనున్నారు. ముం దుగా పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపుతో కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. 25 పత్రాలను ఒక కట్ట చొప్పున కట్టి, లెక్కింపు చేపడుతారు. వెయ్యి ఓట్లకు ఒక రౌండ్‌ చొప్పున రెండు రౌండ్లలో లెక్కింపును పూర్తి చేయనున్నారు. మొత్తం 137 మంది సిబ్బంది ఎన్నికల కౌంటింగ్‌లో పాల్గొననున్నారు. మధ్యాహ్నంకల్లా అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.

అభ్యర్థుల్లో టెన్షన్‌

మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు జరగనుంది. ఈ మేరకు అభ్యర్థుల్లో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. ఈ నెల 22న మున్సిపల్‌ ఎన్నికలు పూర్తయ్యాయి. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డుల్లో ఒక వార్డు (9వ వార్డు) ఏకగ్రీవం కాగా మిగిలిన 29 వార్డుల్లో ఎన్నికలు జరిగాయి. 29 వార్డుల్లో 49,101 ఓటర్లుండగా 31,098 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 63.33 శాతం పోలింగ్‌ నమోదైంది. ప్రతి వార్డులో 1700 నుంచి 1800 మంది ఓటర్లుండగా వార్డుల్లో దాదాపుగా వెయ్యి ఓట్లలోపే పోలింగ్‌ నమోదైంది. కేవలం ఒకటో వార్డులోనే అత్యధిక ఓటింగ్‌ జరిగింది. ఈ నేపథ్యంలో మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల ఫీవర్‌ అభ్యర్థులకు పట్టుకుంది. ఈసారి మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులతో పాటు ప్రతిపక్ష అభ్యర్థులు సైతం ప్రధానంగా పోటీలో నిలిచారు. పోటాపోటీగా ఓటర్లను ప్రసన్నం చేసుకున్నారు. నేడు ఉదయం 8 గంటలకు ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభం కానుండడంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది.

కౌంటింగ్‌ అధికారులకు శిక్షణ

ఎన్నికల కౌంటింగ్‌ అధికారులు, సిబ్బంది 137 మందికి ఆర్డీవో వైవీ గణేశ్‌ ఆధ్వర్యంలో శుక్రవారం శిక్షణ ఇచ్చారు. సింగరేణి మినీ ఫంక్షన్‌ హాల్‌లో జరిగి శిక్షణలో ఆర్డీవో మాట్లాడారు. వార్డుల వారీగా వెయ్యి ఓట్లకు ఒక రౌండ్‌ చొప్పున రెండు రౌండ్లలో లెక్కింపు పూర్తి చేయాలని, రిటర్నింగ్‌ అధికారులు, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులు కౌంటింగ్‌ను పర్యవేక్షిస్తూ ఎలాంటి తేడా రాకుండా జాగ్రత్త పడాలని సూచించారు. కౌంటింగ్‌ ఏజెంట్ల సమక్షంలో 25 బ్యాలెట్‌ ప త్రాలను ఒక కట్ట చొప్పున కట్టి లెక్కించాలని, అనంతరం గుర్తుల వారీగా బ్యాలెట్‌ పత్రాలను వేరు చేయాలని సూచించారు.

ఏర్పాట్లను పరిశీలించిన అడిషనల్‌ ఎస్పీ

భూపాలపల్లి పట్టణంలోని అంబేద్కర్‌ స్టేడియంలో కౌంటిం గ్‌ ఏర్పాట్లను జిల్లా అడిషనల్‌ ఎస్పీ శ్రీనివాసులు పర్యవేక్షించారు. మినీ ఫంక్షన్‌ హాల్‌ లోపల కౌంటింగ్‌కు చేసిన ఏర్పాట్లను చూసి అధికారులకు సూచనలు, సలహాలు అందించారు. కౌంటింగ్‌ హాల్‌ బయట ప్రెస్‌ గ్యాలరీ, వీఐపీ గ్యాలరీ, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. కౌంటింగ్‌ హాల్‌లోకి వెళ్లే మార్గం, బయటకు వచ్చే మార్గం, కౌంటింగ్‌ సిబ్బందికి తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యాలు పరిశీలించారు. భూపాలపల్లి ఏఎస్పీ సంపత్‌రావుకు ఏర్పాట్లపై సలహాలు అందించారు. స్ట్రాంగ్‌ రూంను పరిశీలించారు.

ప్రశాంత వాతావరణంలో లెక్కింపు జరగాలి

-కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు
-మినీ స్టేడియంలో ఏర్పాట్ల పరిశీలన
భూపాలపల్లి టౌన్‌, జనవరి 24 : మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు పోలీసు శాఖను ఆదేశించారు. ఈ నెల 25న (నేడు) భూపాలపల్లి పట్టణ మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపును అంబేద్కర్‌ మినీ స్టేడియంలో నిర్వహించను న్న నేపథ్యంలో ఏర్పాట్లను కలెక్టర్‌ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా తీసుకోవాల్సిన పోలీసు బందోబస్తుపై ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఇప్పటివరకు జిల్లాలో అన్ని ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పో లీసు శాఖ పని చేసిందని గుర్తుచేశారు. మున్సిపల్‌ ఓట్ల లెక్కింపు ప్రక్రియ సున్నితమైన అంశమని, భూపాలపల్లి ప ట్టణం కోల్‌బెల్ట్‌ ప్రాంతం కావడంతో ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ అన్ని జాగ్రత్తలను తీ సుకోవాలని సూచించారు. కౌంటింగ్‌ సెంటర్‌కు, కౌంటింగ్‌ హాల్లోకి గుర్తింపు కార్డులు ఉన్నవారినే అనుమతించాలని, కౌంటింగ్‌ హాల్లోకి వెళ్లే ఏజెంట్ల వద్ద ఇంక్‌ పెన్ను ఉండకుండా జాగ్రత్త పడాలన్నారు. ఇందులో జిల్లా అదనపు ఎస్పీ శ్రీనివాసులు, డీఎస్పీ సంపత్‌రావు, మున్సిపల్‌ కమిషనర్‌ సమ్మయ్య, ఇతర పోలీసు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.logo