మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Jayashankar - Jan 22, 2020 , 04:48:46

నేడే పోలింగ్‌

నేడే పోలింగ్‌
  • -పురపోరుకు సర్వంసిద్ధం
  • -మున్సిపాలిటీ పరిధిలో 50,651 మంది ఓటర్లు
  • -72పోలింగ్‌ కేంద్రాలు
  • -బందోబస్తుకు 295 మంది పోలీసులు
  • -సమస్యాత్మక పీఎస్‌లపై ప్రత్యేక నజర్‌
  • -ఎన్నికల అధికారులకు సామగ్రి పంపిణీ
  • - పర్యవేక్షించిన కలెక్టర్‌ సం వెంకటేశ్వర్లు
పురపోరుకు సర్వం సిద్ధమైంది. అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బుధవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరుగనుంది. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో 30 వార్డులుండగా, ఒక వార్డులో అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవమైంది. మిగతా 29వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. 50,651మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం మున్సిపాలిటీ పరిధిలో 72 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు, సిబ్బందిని నియమించారు. కాగా, కృష్ణకాలనీలోని సింగరేణి మినీ ఫంక్షన్‌హాల్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారికి విధులు కేటాయించారు. కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో పోలింగ్‌ సామగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలింగ్‌ అధికారులు, సిబ్బంది ఓటర్లతో సౌమ్యంగా మెలగాలని సూచించారు. బందోబస్తు కోసం 295 మంది పోలీసులను నియమించినట్లు జిల్లా అడిషనల్‌ ఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.

జయశంకర్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: మున్సిపాలిటీ పరిధిలో నేడు పోలింగ్‌ జరుగనుంది. ఈ మేరకు భూపాలపల్లిలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో 30 వార్డులకు ఒక వార్డు అభ్యర్థి ఏకగ్రీవం అయ్యారు. మిగిలిన 29 వార్డుల్లో నేడు ఎన్నికలు జరుగనున్నాయి. 29 వార్డుల్లో అధికారులు 72 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 50,651 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఆర్డీవో గణేశ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ సమ్మయ్యతో పాటు ఎన్నికల అబ్జర్వర్స్‌ మంగళవారం పోలింగ్‌ ఏర్పాట్లను పరిశీలించారు. పోలింగ్‌ అధికారులకు విధులు కేటాయిస్తూ పట్టణంలోని కృష్ణకాలనీ సింగరేణి మినీ ఫంక్షన్‌హాలులో పోలింగ్‌ సామగ్రి అందజేశారు. ఎన్నికలకు అధికారులు, సిబ్బంది కేటాయింపు పూర్తి కాగా బ్యాలెట్‌ పేపర్లను పోలింగ్‌ కేంద్రాల వారీగా సమకూర్చారు. భూపాలపల్లి మున్సిపాలిటీలోని 30 వార్డుల్లో మొత్తం 50,651 మంది ఓటర్లు ఉండగా ఇందులో 26,399 మంది పురుషులు, 24,251 మంది మహిళలు ఉన్నారు. 72 పోలింగ్‌ కేంద్రాలను ఎనిమిది రూట్లుగా, నాలుగు జోన్లుగా విభజించారు. ఒక్కో ఓటరుకు ఒక బ్యాలెట్‌ పేపర్‌ చొప్పున, 10శాతం అదనంగా మొత్తం 56,426 బ్యాలెట్‌ పేపర్లను అందజేశారు. పోలింగ్‌ స్టేషన్‌కు ఒకటి చొప్పున 72 బ్యాలెట్‌ బాక్సులను పోలింగ్‌ అధికారులకు అందించారు. నలుగురు జోనల్‌ అధికారులు, ఎనిమిది మంది రూట్‌ ఆఫీసర్లను నియమించారు. ఎన్నికల సామగ్రి, పోలింగ్‌ అధికారుల కేటాయింపు ప్రక్రియను కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు దగ్గరుండి పర్యావేక్షించారు.

పోలింగ్‌ కేంద్రాలకు చేరిన సామగ్రి

నేడు జరిగే మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించిన సామగ్రి పోలింగ్‌ కేంద్రాలకు చేరింది. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ప్రస్తుతం ఎన్నికలు జరుగనున్న 29 వార్డులకు 72 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయగా నలుగురు జోనల్‌ అధికారులు, ఎనిమిది మంది రూట్‌ ఆఫీసర్లను నియమించారు. 76 మంది ప్రెసిడింగ్‌ అధికారులతో పాటు 16 మంది అధికారులను రిజర్వ్‌ చేశారు. 76 మంది అసిస్టెంట్‌ ప్రెసిడింగ్‌ అధికారులతో పాటు 14 మంది అధికారులను రిజర్వ్‌ చేశారు. ఒక ప్రెసిడింగ్‌ అధికారి పరిధిలో ముగ్గురు పోలింగ్‌ అధికారులను నియమించడంతో పాటు 14 మంది అధికారులను రిజర్వ్‌ చేశారు. 33 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. వీరితో పాటు ఆరు ఫ్లయింగ్‌ స్కాడ్‌ టీంలు, ఆరు ఎంసీసీ (మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌) టీంలు, 18 ఎస్‌ఎస్‌ (స్టాటికల్‌ సర్వేలెన్స్‌) టీంలను ఏర్పాటు చేశారు. పోలింగ్‌ అధికారులు, అసిస్టెంట్‌ పోలింగ్‌ అధికారులు తమ తమ పోలింగ్‌ కేంద్రాలకు సామగ్రిని తీసుకుని వెళ్లి విధుల్లో చేరారు.

295 మంది పోలీసులతో విధులు

భూపాలపల్లి మున్సిపల్‌ ఎన్నికల్లో జిల్లాకు చెందిన 295 మంది పోలీసులు బందోబస్తు విధులు నిర్వర్తించనున్నారు. భూపాలపల్లిలోని కృష్ణకాలనీ సింగరేణి మినీ ఫంక్షన్‌హాలులో జిల్లా అడిషనల్‌ ఎస్పీ శ్రీనివాసులు పోలీసులకు బందోబస్తు విధులు కేటాయించారు. ఎన్నికల్లో అడిషనల్‌ ఎస్పీ శ్రీనివాసులు, ట్రైనీ ఐపీఎస్‌ బాలస్వామి, భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు, ఐదుగురు సీఐలు, 20 మంది ఎస్సైలు, 32 మంది హె డ్‌ కానిస్టేబుళ్లు, 135 మంది కానిస్టేబుళ్లు, 13 మంది మహిళా కానిస్టేబుల్స్‌, 29 మంది హోంగార్డులు, ఆరుగురు మహిళా హోంగార్డులు, 20 మంది స్పెషల్‌ పార్టీ పోలీసులు, 30 మంది అటవీశాఖ, ఇతర సిబ్బంది బందోబస్తు నిర్వహించనున్నారు.

అప్రమత్తంగా ఉండాలి..

భూపాలపల్లి టౌన్‌, జనవరి 21: పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లకు తాగునీరు, మరుగుదొడ్లు తదితర సౌకర్యాలను కల్పించాలని, ఓటర్లతో సౌమ్యంగా మెలగాలని కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు అధికారులను కోరారు. ఈ నెల 22న (నేడు)నిర్వహించనున్న మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్‌ సామగ్రిని కృష్ణకాలనీలోని సింగరేణి మినీ ఫంక్షన్‌ హాలులో ఏర్పాటు చేసిన రిసెప్షన్‌ సెంటర్‌లో ఎన్నికల పోలింగ్‌ సిబ్బందికి మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా రిసెప్షన్‌ సెంటర్‌లో పోలింగ్‌ సామగ్రి పంపిణీని పర్యావేక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలింగ్‌ను నిబంధనల ప్రకారం నిర్వహించాలని కోరారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు నిర్వహించాలని, పోలింగ్‌ పూర్తయ్యే వరకు ఎన్నికల సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఓటింగ్‌ సమయంలో ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా పోలీస్‌ సిబ్బంది చర్యలు చేపట్టాలన్నారు. పోలింగ్‌ అనంతరం బ్యాలెట్‌ బాక్స్‌లను పోలీస్‌ రక్షణ మధ్య స్ట్రాంగ్‌ రూంకు తరలించి కౌంటింగ్‌ నిర్వహించే 25వ తేదీ వరకు జాగ్రత్తగా భద్రపరచాలని అధికారులను ఆదేశించారు. ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని ఓటర్లు నచ్చిన నాయకులను ఎన్నుకోవడం రాజ్యంగం కల్పించిన హక్కు అని, ఓటర్లందరూ ప్రశాంత వాతావరణంలో ఓటు వేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. పట్టణంలో 72 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామని, ప్రతి పోలింగ్‌ కేంద్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసుల నిఘాతో పాటు వీడియోగ్రఫీ, వెబ్‌కాస్టింగ్‌, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. కలెక్టర్‌ వెంట ఆర్‌డీవో గణేశ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ సమ్మయ్య, ఎన్నికల వ్యయ పరిశీలకులు భరత్‌రెడ్డి, టీపీవో గిరిధర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యేతో మంత్రి భేటీ

- ఎన్నికల పరిస్థితిపై దయాకర్‌రావు ఆరా

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగ ల్‌ రూరల్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతితో రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మంగళవారం భేటీ అయ్యారు. భూపాలపల్లికి వచ్చిన మంత్రి.. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గండ్ర దంపతులతో సమావేశమయ్యారు. భూపాలపల్లి మున్సిపల్‌ ఎన్నికల్లో అభ్యర్థుల పరిస్థితిపై చర్చించారు. 29 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందుతారని, అందులో సందేహం లేదని మంత్రికి ఎమ్మెల్యే వివరించారు. కాగా, భూపాలపల్లిలో ఎన్నికల పరిస్థితిపై  సీఎం కేసీఆర్‌, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ ఆరా తీసినట్లు సమాచారం. విషయమై ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును వారు అడిగి తెలుసుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు భూపాలపల్లిలో సమావేశమయ్యారు. ఎన్నికల్లో వార్డుల వారీగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.logo