గురువారం 02 ఏప్రిల్ 2020
Jayashankar - Jan 22, 2020 , 04:48:02

గ్రీన్‌చాలెంజ్‌ బృహత్తర కార్యక్రమం

 గ్రీన్‌చాలెంజ్‌ బృహత్తర కార్యక్రమం
  • -ఎంపీ సంతోష్‌ పేరుతో నర్సరీ ఏర్పాటు చేస్తాం
  • -తాడిచెర్ల ఓపెన్‌ కాస్టు ఆవరణలో మొక్కలు నాటిన జీఎం ప్రభాకర్‌రెడ్డి

మల్హర్‌, జనవరి 21: హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాము లు కావాలని తాడిచెర్ల ఓపెన్‌కాస్టు ప్రాజెక్టు (ఏఎంఆర్‌) హెడ్‌ ప్రభాకర్‌ రెడ్డి పిలుపునిచ్చారు. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోశ్‌ కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ విస్తృతమవుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా భూపాలపల్లి జనరల్‌ మేనేజర్‌ విసిరిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ను ప్రభాకర్‌రెడ్డి స్వీకరించారు. ఈ మేరకు ఆయన ప్రాజెక్టును మంగళవారం సందర్శించారు. ప్రాజెక్టు ఆవరణలో మొక్కలు నాటి నీళ్లు పోశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న హరితహారం బృహత్తర కార్యక్రమమని, పర్యావరణ సమతుల్యతకు రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటించేందుకు రాజ్యసభ సభ్యుడు సంతోశ్‌ చేపట్టిన గ్రీన్‌ చాలెంజ్‌ను స్వీకరించడం ఆనందంగా ఉందన్నారు. కంపెనీ ఉద్యోగులు ప్రతి ఒక్కరూ హరితహారంలో భాగస్వాములై ప్రాజెక్టు పరిసరాల్లో విరివిగా మొక్కలు నాటాలని సూచించారు. ఆయన కేటీటీపీ చీఫ్‌ ఇంజినీర్‌ సిద్ధయ్య, తాడిచెర్ల తహసీల్దార్‌ శ్రీనివాస్‌, కొయ్యూరు ఎస్సై నరేశ్‌కు గ్రీన్‌ ఛాలెంజ్‌ విసిరారు. వీరు చాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటి మరో ముగ్గురికి గ్రీన్‌ చాలెంజ్‌ చేయాలని కోరారు. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోశ్‌ కుమార్‌ పేరున త్వరలో నర్సరీని ప్రారంభిస్తామని చెప్పారు. కార్యక్రమంలో పీఆర్‌వో వెంకట్‌, సిబ్బంది పాల్గొన్నారు.logo