బుధవారం 01 ఏప్రిల్ 2020
Jayashankar - Jan 22, 2020 , 04:45:45

నేడే మున్సి ‘పోలింగ్‌'

 నేడే మున్సి ‘పోలింగ్‌'
  • -ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో తొమ్మిది మున్సిపాలిటీలు
  • -200 వార్డులకు నోటిఫికేషన్‌
  • -18 వార్డుల ఏకగ్రీవం
  • -182 వార్డుల్లో 878 మంది పోటీ
  • -ఇప్పటికే 18 వార్డులను కైవసం చేసుకున్న టీఆర్‌ఎస్‌
  • -ఇదే స్ఫూర్తితో విజయమే లక్ష్యంగా వ్యూహం
  • -మరికొద్దిసేపట్లో పోలింగ్‌ షురూ
  • -పకడ్బందీ ఏర్పాట్లు చేసిన ఎన్నికల సంఘం
వరంగల్‌ ప్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ: మరికొద్ది సేపట్లో తొమ్మిది మున్సిపాలిటీ కేంద్రాల్లో ఓట్ల పండుగ మొదలు కాబోతున్నది. ఓటర్లు ప్రశాంతంగా, స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సిద్ధం అవుతున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని తొమ్మిది మున్సిపాలిటీల్లోని 200 వార్డులకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది. అయితే 18 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 182 వార్డుల్లో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు జరిగాయి. ఎన్నికలు జరిగే 182 వార్డుల్లో 878 మంది అభ్యర్థులు తమతమ భవితవ్యాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇప్పటికే ఏకగ్రీవాలైన 18 వార్డుల్లో గులాబీ జెండా ఎగరవేసిన టీఆర్‌ఎస్‌ మొత్తం తొమ్మిదింటికి తొమ్మిది మున్సిపాలిటీల్లోనూ ఇదే స్ఫూర్తితో గులాబీ జెండా ఎగురవేయాలని గట్టివ్యూహంతో ముందుకు సాగుతుంది. మున్సిపాలిటీల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తామని టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రకటించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి తమ అభ్యర్థుల్ని ఆశీర్వదించాలని మంత్రులు, ఎమ్మెల్యేలు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. తమ పనితీరుకు పట్టం కడుతారని చెప్పడానికి ఏకగ్రీవాలైన వార్డులే నిదర్శమని గులాబీ శ్రేణులు పేర్కొంటున్నారు. మరోవైపు తాము సైతం బరిలో ఉన్నామని కాంగ్రెస్‌, బీజేపీ పార్టీల శ్రేణులు తమకు మద్దతు ఇవ్వాలని చేసిన విజ్ఞప్తికి ఎటువంటి ఆదరణ లభించబోతున్నదో ఎన్నికల కౌటింగ్‌ నాడు తేటతెల్లం కానున్నది.

పోలింగ్‌ కేంద్రాలకు తరలిన సిబ్బంది

ఎన్నికలు జరిగే తొమ్మిది మున్సిపాలిటీల్లోని వార్డులకు ఇప్పుటికే పోలింగ్‌ సిబ్బంది పోలింగ్‌ సామగ్రితో తరలివెళ్లి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీ సు అధికారులు పటిష్టమైన బందోబస్తు నిర్వహిస్తున్నారు. సమస్యాత్మక, అతిసమస్యాత్మక, సాధారణం ఇలా ఆయా పోలింగ్‌ కేంద్రాల తీరును బట్టి తగిన ఏర్పాట్లు చేశారు. మొత్తంగా ఎన్నికలను ప్రశాంతంగా ఓటర్లు పూర్తి స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, ఓటర్లు తమ ఓటు అనే వజ్రాయుధాన్ని వినియోగించుకునేందుకు ఎటువంటి ఒత్తిడిలకు, ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శక గుర్తింపు కార్డులను తమ వెంట తీసుకుని పోలింగ్‌ కేంద్రాలకు రావాలని విజ్ఞప్తి చేసింది.
logo
>>>>>>