శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Jayashankar - Jan 21, 2020 , 03:02:51

మేడారంలో కోలాహలం

మేడారంలో కోలాహలం
  • -అమ్మవార్లకు భక్తుల మొక్కులు
  • - ఎత్తు బంగారం, పూలు, పండ్లు, ఒడి బియ్యం సమర్పణ
  • - దగ్గరి దర్శనం కల్పించిన అధికారులు

తాడ్వాయి, జనవరి20: ఆదివాసీ గిరిజన దైవాలు మేడారం సమ్మక్క-సారక్కలకు ముందస్తు మొక్కులు చెల్లించేందుకు భక్తులు తరలివస్తున్నారు. సోమవారం వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో అమ్మవార్లను దర్శించుకున్నారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం కల్యాణకట్టలో తలనీలా లను సమర్పించి తల్లుల గద్దెల వద్దకు చేరుకుంటున్నారు. సమ్మక్క-సారక్క, గోవిందరాజు, పగిడిద్దరాజుల గద్దెలపై పసుపు, కుంకుమ, ఎత్తుబెల్లం, నూతన వస్ర్తాలు, పూలు, పండ్లు, ఒడిబియ్యం, సారెను సమర్పించి గిరిజన సంప్రదాయ పద్ధతుల్లో అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించు కుంటున్నారు. యాటపోతులను సమర్పించి గద్దెల పరిసరాల్లో విడిది చేసి వంటలు చేసుకుని విందు భోజనాలు చేస్తున్నారు.

భక్తులకు దగ్గరి దర్శనం

సోమవారం సమ్మక్క-సారక్కలను దర్శించుకునేందుకు భక్తుల సంఖ్య కాస్త తగ్గడంతో నేరుగా గ్రిల్స్‌ లోపలి నుంచి అమ్మవార్ల గద్దెలను దర్శించుకునే అవకాశం కల్పించారు. ఆదివారం భక్తుల సంఖ్య బారీగా ఉండడంతో గద్దెల చుట్టూ ఉన్న గ్రిల్స్‌కు తాళాలు వేసి బయటి నుంచే అమ్మవార్ల దర్శనం కలిగించారు.logo