శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Jayashankar - Jan 21, 2020 , 02:56:28

భూపాలపల్లి సమగ్రాభివృద్ధే లక్ష్యం

భూపాలపల్లి సమగ్రాభివృద్ధే లక్ష్యంఅందుకనుగుణంగానేమేనిఫెస్టో తయారు చేశాం
హామీలన్నీ అమలు చేస్తాం
ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి


భూపాలపల్లి టౌన్‌, జనవరి 20 : భూపాలపల్లి పట్టణ సమగ్రాభివృద్ధే తమ లక్ష్యమని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. ఇందిరాభవన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎన్నికల పరిశీలకులు గుండా ప్రకాశ్‌, రూరల్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతి, ఎన్నికల ఇన్‌చార్జి గోవింద్‌నాయక్‌తో కలిసి మాట్లాడారు. భూపాలపల్లి పట్టణం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్‌, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశానుసారం పెద్దలందరితో ఆలోచించి మేనిఫెస్టోను తయారు చేసినట్లు చెప్పారు. పట్టణాభివృద్ధికి ఈ మేనిఫెస్టో దోహదపడుతుందన్నారు. చాలా పార్టీలు మేనిఫెస్టో రూపొందిస్తాయని, కానీ, వాటిని అమలు చేయడం సాధ్యం కావని చెప్పారు. ప్రభుత్వ సహకారం లేకపోతే ఇచ్చిన హామీలు అమలు చేయడం వీలు కాదన్నారు. వారం రోజులుగా కొనసాగిన ప్రచారం ముగిసిందని, బుధవారం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభం అవుతుందని, ప్రజలు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కొత్త మున్సిపల్‌ చట్టం ద్వారా పట్టణాల్లో అభివృద్ధి వేగవంతం కావడంతో పాటు ప్రజలకు మంచి పాలన అందుతుందన్నారు. తమకు ప్రజల్లో ఉన్న ఆదరణ చూసి తట్టుకోలేక కొన్ని రాజకీయ పార్టీలు అసత్య ప్రచారానికి దిగుతున్నాయని మండిపడ్డారు. పదో వార్డు అభ్యర్థి తిరుపతిని తాము కిడ్నాప్‌ చేసినట్లు ప్రచారం చేశారని, చివరికి తిరుపతి అనే వ్యక్తి విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి తననెవరూ కిడ్నాప్‌ చేయలేదని, వ్యక్తిగత కారణాలతో బరిలో నుంచి తప్పుకున్నట్లు ప్రకటించుకున్న విషయం తెలిసిందేనని పేర్కొన్నారు. ఇతర పార్టీలకు వారి అభ్యర్థులపై నమ్మకం లేకుండాపోయిందని, ఎన్నికల్లో గెలిచిన అనంతరం క్యాంపులు పెట్టుకోవాల్సింది పోయి నామినేషన్లు వేసినప్పటి నుంచి క్యాంపులు పెట్టుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. గుండా ప్రకాశ్‌ మాట్లాడుతూ.. అందరితో చర్చించి మేనిఫెస్టో తయారు చేయించామని, సమగ్ర మాస్టర్‌ ప్లాన్‌తో రూపొందించిన మేనిఫెస్టోతో పట్టణం ఊహించని విధంగా అభివృద్ధి చెందుతుందన్నారు. మేనిఫెస్టోలోని అంశాలన్నీ పరిష్కారానికి నోచుకునేలా ఉన్నాయని చెప్పారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలో ఉందని, టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపిస్తే పట్టణం అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ సందర్భంగా మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాజేశ్‌నాయక్‌, జెడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ కల్లెపు శోభ, టీఆర్‌ఎస్‌ అర్బన్‌ అధ్యక్షుడు క్యాతరాజు సాంబమూర్తి, నాయకులు బుర్ర రమేశ్‌, కల్లెపు రఘుపతిరావు, పార్టీ అభ్యర్థులు పాల్గొన్నారు.


logo