శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Jayashankar - Jan 15, 2020 , 02:30:54

బరిలో 143 మంది

బరిలో  143 మంది

జయశంకర్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : పారిశ్రామిక ప్రాంతమైన భూపాలపల్లిలో మొట్టమొదటిసారిగా మున్సిపల్‌ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి కాగా, తొలి దశ నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. రెండో దశలో నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం మంగళవారం ఉత్కంఠ మధ్య ముగిసింది. దీంతో చివరగా మున్సిపల్‌ ఎన్నికల పోరులో 30వార్డులకుగాను 143 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. గ్రామ పంచాయతీ నుంచి దినదినాభివృద్ధి చెందుతున్న భూపాలపల్లి స్వరాష్ట్రంలో మున్సిపాలిటీగా ఆవిర్భవించింది. ఈ సందర్భంగా మున్సిపల్‌ కార్పొరేషన్‌లో కౌన్సిలర్‌గా పోటీ చేసేందుకు అన్ని రాజకీయ పార్టీల నుంచి, స్వతంత్రులు కూడా తీవ్రంగా పోటీ పడ్డారు. ఈ నేపథ్యంలో ప్రజల్లో మంచి పట్టుండి, పారిశ్రామిక ప్రాంతంలో వేళ్లూరుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిత్వంపై పోటీ చేసేందుకు కూడా తీవ్ర పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలోనే 30వార్డులకుగాను ఆరు రాజకీయ పార్టీల నుంచి 326నామినేషన్లు దాఖలు చేయగా ఇందులో 54స్వతంత్రులు నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 326నామినేషన్లు ఆమోదించబడ్డాయి. నామినేషన్ల ఉపసంహరణ తేదీ చివరి రోజు మంగళవారం అన్ని పార్టీల నాయకులు అప్రమత్తమయ్యారు. దీంతో ఉపసంహరణల జోరు ఒకే రోజు సాగింది. తెలంగాణ రాష్ట్ర సమితిలో 30వార్డులకు 138నామినేషన్లు దాఖలు కాగా తీవ్ర పోటీ ఉన్న నేపథ్యంలో స్థానిక శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి, పరిశీలకులు గుండా ప్రకాశ్‌, గోవిందునాయక్‌లు సమావేశమయ్యారు.

పట్టణ అధ్యక్షుడు క్యాతరాజు సాంబమూర్తి, సీనియర్‌ నాయకులు బుర్ర రమేశ్‌ల సమక్షంలో వార్డుల వారీ పార్టీ కమిటీలు, ముఖ్య నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఎక్కడ కూడా రెబల్స్‌ అనే పదానికి చోటు లేకుండా పార్టీ శ్రేణులను సమన్వయం చేస్తూ పార్టీ బీ ఫారాలు అందజేసిన అభ్యర్థులు మాత్రమే బరిలో ఉండేలా చూశారు. ఈ నేపథ్యంలో తొమ్మిదో వార్డు బీసీ జనరల్‌గా రిజర్వ్‌ కాబడింది. ఈ వార్డులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి తొట్ల సంపత్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రత్యర్థులు ఎనిమిది మంది ప్రత్యర్థులు తమ తమ నామినేషన్లను స్వచ్ఛందంగా విరమించుకోవడంతో సంపత్‌ ఏకగ్రీవ ఎన్నిక అనివార్యమైంది. దీంతో టీఆర్‌ఎస్‌ శ్రేణులు, తొమ్మిదో వార్డు ప్రజలు సంబురాలు చేసుకున్నారు. పార్టీ పరిశీలకులు శాసనసభ్యుడికి మిఠాయిలు తినిపించారు. మొత్తం 30 వార్డుల్లో 326నామినేషన్లను దాఖలు చేయగా టీఆర్‌ఎస్‌ నుంచి 138, బీజేపీ నుంచి 46, సీపీఐ నుంచి తొమ్మిది, సీపీఎం నుంచి రెండు, కాంగ్రెస్‌ నుంచి 40, ఏఐఎఫ్‌బీ నుంచి 37, 54 స్వతంత్రులు నామినేషన్లను దాఖలు చేశారు. స్క్రూటినీలో మొదటి రోజు 37 నామినేషన్లు ఉపసంహరించుకోగా మంగళవారం 146నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. మొత్తం 183 నామినేషన్లు విత్‌డ్రా అయ్యాయి. ప్రస్తుతం 143 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

ప్రచార జోరు..

నామినేషన్ల ఉపసంహరణతో బరిలో ఉన్న అభ్యర్థుల లెక్క తేలింది. గుర్తుల కేటాయింపు జరిగిపోయింది. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో 30వార్డులకుగాను తొమ్మిదో వార్డు ఏకగ్రీవమైంది. మిగతా 29వార్డుల్లో పోటీ అనివార్యమైంది. దీంతో అన్ని పార్టీలు అప్రమత్తమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర సమితి తన వ్యూహాత్మక ప్రచారాన్ని యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించింది. 29వార్డులకు ఇన్‌చార్జీలను నియమించింది. ఎక్కడికక్కడ వార్డు కమిటీలతో ఇప్పటికే సమావేశాలు జరిపింది. ఇంటింటికీ ప్రచారం నిర్వహిస్తున్నది. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్‌ రూరల్‌ జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ జ్యోతితోపాటు భూపాలపల్లి మండల, పట్టణ కమిటీలు జిల్లాలోని వివిధ మండల నాయకులు భూపాలపల్లిలో జరిగే మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇక్కడ కూడా ఇతర పార్టీలకు అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వ పథకాలను ప్రతిబింబిస్తూ కేసీఆర్‌, కేటీఆర్‌ల నేతృత్వంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. మంగళవారం ఉపసంహరణ సమయం ముగిసిన వెంటనే స్థానిక శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి ఇందిరా భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. ఆ  పార్టీల కుయుక్తులను, కుట్రలను ఎండగట్టారు. ఎన్నికలేవైనా టీఆర్‌ఎస్‌దే గెలుపు అని అన్నారు. భూపాలపల్లి ప్రజలు కేసీఆర్‌, కేటీఆర్‌ల నాయకత్వాన్ని సమర్థ్ధిస్తూ అభివృద్ధికాముకులుగా టీఆర్‌ఎస్‌ను బలపరుస్తున్నారని, మున్సిపల్‌  ఎన్నికల్లో కూడా ప్రజల సహకారంతో విజయదుందుభి మోగించబోతున్నామని చెప్పారు.logo