సోమవారం 30 మార్చి 2020
Jayashankar - Jan 14, 2020 , 02:59:41

అంబరాన్నంటేలా సంబురాలు

అంబరాన్నంటేలా సంబురాలు
  • - ప్రజల మదిలో నిలిచిపోయేలా గణతంత్ర వేడుకలు నిర్వహించాలి
  • - కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు

కలెక్టరేట్‌, జనవరి 13: భూపాలపల్లిలో నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రజల మదిలో నిలిచిపోయేలా ఘనంగా నిర్వహించాలని కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. ఈ నెల 26న నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకలపై కలెక్టర్‌ కార్యాలయంలో కలెక్టర్‌ జిల్లా అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. జాతీయ సమైక్యతను ప్రతిబింబిస్తూ ప్రజల మదిలో ఎప్పటికీ గుర్తిండిపోయేలా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరపాలన్నారు. వేడుకలకు వచ్చే ముఖ్యులకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, ప్రజలకు, విద్యార్థులకు అసౌకర్యాలు కలుగకుండా డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ స్టేడియాన్ని సిద్ధం చేయాలని, పోలీసు శాఖ పరేడ్‌ నిర్వహించేందుకు సిద్ధం కావాలన్నారు. స్టేడియంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ముఖ్య అతిథి ప్రసంగం తయారు చేయాలని, దేశ సమైక్యత, దేశ భక్తిని తెలిపేలా, తెలంగాణ రాష్ట్ర సంస్కృతిని చాటిచెప్పేలా పాఠశాలల విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలు తెలిపేలా వివిధ శాఖల శకటాలు, స్టాల్స్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. తాగునీటి వసతి కల్పించాలని ఆదేశించారు. సమావేశంలో భూపాలపల్లి ఆర్డీవో వైవీ గణేశ్‌, డీఎంహెచ్‌వో డాక్టర్‌ గోపాల్‌రావు, జిల్లా పౌర సంబంధాల అధికారి బీ రవికుమార్‌, జిల్లా సంక్షేమ అధికారి శ్రీదేవి, డీఎస్సీడీవో సునీత, సీపీవో భిక్షపతి, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్‌ బాలకృష్ణ, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ మనోహర్‌నాయక్‌, కలెక్టరేట్‌ ఏవో మహేశ్‌బాబు, భూపాలపల్లి తహసీల్దార్‌ శ్రీనివాసచారి, కలెక్టరేట్‌ సూపరింటెండెంట్‌ రవికుమార్‌, డీఆర్‌డీఏ ఏవో వెంకటేశ్వర్లు, ఎక్సైజ్‌, అగ్ని మాపక శాఖల అధికారులు పాల్గొన్నారు.

పిల్లలకు టీకాలు వేయించాలి

పల్స్‌ పోలియో, నులి పురుగుల నివారణ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. పల్స్‌ పోలి యో, ఫిబ్రవరి 10న నిర్వహించనున్న జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవంపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షించారు. జయశంకర్‌ జిల్లాలో 31,306 మంది 0-5 సంవత్సరాల్లోపు పిల్లలు, ములుగు జిల్లాలో 20,139 మంది చిన్నారులకు చుక్కలు వేయించాలన్నారు. 19న బూత్‌లలో, 20, 21 తేదీల్లో ఇంటింటికీ తిరిగి పోలియో చుక్కలు వేయాలని ఆదేశించారు. ఫిబ్రవరి 10న జరిగే జాతీయ నులి పురుగు ల నివారణ కార్యక్రమంలో భాగంగా జయశంకర్‌ జిల్లాలో 85,361 మంది, ములుగు జిల్లాలో 78,220 మంది, 1-19 సంవత్సరాల్లోపు వారికి ఆల్బెండజోల్‌ మాత్రలు వేయాలని సూచించారు. ఫిబ్రవరి 10న మాత్రలు తీసుకోని వారికి ఫిబ్రవరి 17న మరోసారి అందించాలని కోరారు. చేతులు కడగడంపై ప్రతిఒక్కరికీ అవగాహన కల్పించాలన్నారు. డీఎంహెచ్‌వోలు డాక్టర్‌ గోపాల్‌రావు, డాక్టర్‌ అప్పయ్య, ఇమ్యూనైజేషన్‌ అధికారులు డాక్టర్‌ ఉమాదేవి, డాక్టర్‌ శ్యామ్‌, ఆర్డీవో వైవీ గణేశ్‌, జిల్లా సంక్షేమ అధికారి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.logo