శనివారం 04 ఏప్రిల్ 2020
Jayashankar - Jan 13, 2020 , 02:54:28

సైనికుల్లా పని చేయాలి

సైనికుల్లా పని చేయాలి
  • - పార్టీ అభ్యర్థులను గెలిపించాలి
  • - వారం లీవ్‌ పెట్టి వాడల్లో తిరగండి
  • - 30 వార్డుల్లోనూ మన సత్తా చూపాలి
  • - పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా పనిచేస్తే బహిష్కరణే
  • - టీబీజీకేఎస్‌ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వెంకట్రావు, రాజిరెడ్డి
  • - ఇప్పుడు సహకరించండి.. గుర్తింపు ఎన్నికల్లో నేను గెలిపిస్తా
  • - ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
  • - భూపాలపల్లిలో టీబీజీకేఎస్‌ కార్యకర్తల సమావేశం

భూపాలపల్లి టౌన్‌, జనవరి 12 : ‘భూపాలపల్లి మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపునకు సైనికుల్లా పనిచేయాలి. ఇప్పుడు మనం ఈ స్థాయిలో ఉన్నామంటే గులాబీ పార్టీ కృషి ఫలితమే. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా బహిష్కరణ వేటు తప్పదు’ అని టీబీజీకేఎస్‌ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు బీ వెంకట్రావు, మిర్యాల రాజిరెడ్డి అన్నారు. ఆదివారం భూపాలపల్లిలోని టీబీజీకేఎస్‌ కార్యాలయంలో సంఘం నాయకులు, కార్యకర్తల సమావేశం బ్రాంచి ఉపాధ్యక్షుడు కొక్కుల తిరుపతి అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథులుగా వీరితోపాటు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ ఈ నెల 22న జరుగనున్న మున్సిపల్‌ ఎన్నికలతోపాటు మేలో జరుగనున్న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని అన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, టీబీజీకేఎస్‌ సాధించిన హక్కులను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించాలని కోరారు. ‘మున్సిపల్‌ ఎన్నికల్లో 30 మంది టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించండి.. భూపాలపల్లి అభివృద్ధి ఏంటో నేను చూపిస్తా’ అని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అన్నారు.

భూపాలపల్లి మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపునకు సైనికుల్లా పని చేయాలని యూనియన్‌ నాయకులు, కార్యకర్తలకు టీబీజీకేఎస్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బీ వెంకట్రావు, మిర్యాల రాజిరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం భూపాలపల్లిలోని టీబీజీకేఎస్‌ కార్యాలయంలో టీబీజీకేఎస్‌ నాయకులు, కార్యకర్తల సమావేశం బ్రాంచి ఉపాధ్యక్షుడు కొక్కుల తిరుపతి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు బీ వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డితోపాటు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా బ్రాంచి ఉపాధ్యక్షుడు కొక్కుల తిరుపతి మాట్లాడుతూ.. భూపాలపల్లి బ్రాంచి కమిటీ పూర్తిస్థాయిలో వేశామని, కమిటీని ఆమోదించాలని కోరారు. దీంతోపాటు సెంట్రల్‌ కమిటీ సభ్యులు, నెగోసియేషన్‌ కమిటీ సభ్యులుగా భూపాలపల్లి టీబీజీకేఎస్‌ నేతలకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా వెంకట్రావు, రాజిరెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 22న జరుగనున్న మున్సిపల్‌ ఎన్నికలతోపాటు మే నెలలో జరుగుతాయని భావిస్తున్న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని కోరారు. భూపాలపల్లిలో మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల గెలుపునకు మనం విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందన్నారు. గుర్తింపు సంఘంగా ఇప్పుడు మనం ఈ స్థితిలో ఉన్నామంటే టీఆర్‌ఎస్‌ పార్టీ కృషి ఫలితమేనన్నారు.

ఇప్పుడు మనం పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని కోరారు. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎవరు పని చేసినా బహిష్కరణ వేటు తప్పదని హెచ్చరించారు. పార్టీ నుంచి గానీ, యూనియన్‌ నుంచి గానీ ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా క్షమాపణలు ఉండవని, నేరుగా బహిష్కరించాల్సి వస్తుందన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను, సింగరేణిలో టీబీజీకేఎస్‌ సాధించిన హక్కులను ప్రజలకు, కార్మికులకు వివరిస్తూ ఓట్లు అభ్యర్థించాలని కోరారు. కార్మికుల హక్కులను కాపాడే సంఘం టీబీజీకేఎస్‌ మాత్రమేనని, ఈ నెలలో స్ట్రక్చర్‌ సమావేశం ఉందని, అందులో కార్మికులకు మరిన్ని ప్రయోజనాలు చేకూర్చే ఒప్పందాలు చేసుకుంటామన్నారు. కార్మికులకు లాభాల్లో వాటా, ఇతర సమస్యల పరిష్కారం, డిమాండ్ల సాధనలో కోల్‌బెల్ట్‌ ఎమ్మెల్యేల కృషి ఎంతగానో ఉందన్నారు. వారసత్వ ఉద్యోగాలను సాధించే క్రమంలో జాతీయ సంఘాలు అనేక అవరోధాలు సృష్టించాయని, అయినప్పటికీ సీఎం కేసీఆర్‌ ఇచ్చిన మాట ప్రకారం కారుణ్య నియామకాల రూపంలో తండ్రుల ఉద్యోగాలు కొడుకులకు ఇప్పిస్తున్నారన్నారు. ఇప్పటివరకు 8,797 మంది మెడికల్‌ బోర్డుకు వెళ్లగా 6058 మంది కార్మికులు  అన్‌ఫిట్‌ అయ్యారన్నారు. ఐదు వేలకు పైగా మంది ఉద్యోగాలు చేస్తున్నారని తెలిపారు. కార్మికుల తల్లిదండ్రులకు ఉచిత వైద్యం, మ్యాచింగ్‌ గ్రాంట్‌ తదితర డిమాండ్లు టీబీజీకేఎస్‌ సాధించి పెట్టిందన్నారు.

1989లో మొదట ఎన్నికలు రాగా అప్పటి నుండి రెండు దఫాలుగా సింగరేణిలో రెండేళ్ల పదవీ కాలం అనంతరం మూడు దఫాలుగా నాలుగేళ్ల పదవీ కాలంతో గుర్తింపు సంఘం కొనసాగుతుందన్నారు. గడిచిన ఎన్నికల్లో సైతం నాలుగేళ్ల పదవీ కాలంతో ఎన్నికలు జరుగగా బీజేపీ రెండేళ్లకు కుదించిందని ఇదేం నీతి అని ప్రశ్నించారు. టీబీజీకేఎస్‌ నూతన బ్రాంచి కమిటీ పేర్లను ఎన్నికల తర్వాత ప్రకటిస్తామని, ఎన్నికల్లో సక్రమంగా పని చేయని వారి పేర్లను కమిటీ నుంచి తొలగిస్తామన్నారు. భూపాలపల్లికి ఒక సెంట్రల్‌ కమిటీ మెంబర్‌, నెగోసియేషన్‌ కమిటీ సభ్యున్ని ఎన్నికల తర్వాత ఎమ్మెల్యే సలహా మేరకు  ఎన్నిక చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ అర్బన్‌ ఆధ్యక్షుడు క్యాతరాజు సాంబమూర్తి, అర్బన్‌ నాయకులు బుర్ర రమేశ్‌, టీబీజీకేఎస్‌ నాయకులు జక్కిరెడ్డి, బడితెల సమ్మయ్య, మండ సంపత్‌, దేవరకొండ మధు, సదానందం, కనకయ్య, అంజయ్య,  సమ్మిరెడ్డి, మల్లారెడ్డి, జగత్‌రావు, ప్రేమ్‌సింగ్‌, దేవన్న, రాం చందర్‌, బాబుమియా తదితరులు పాల్గొన్నారు.
కలిసికట్టుగా పనిచేయాలి..

ఎన్నికల ఇన్‌చార్జి గోవింద్‌నాయక్‌

మున్సిపల్‌ ఎన్నికల్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకులు, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు కలిసికట్టుగా పని చేయాలని మున్సిపల్‌ ఎన్నికల ఇన్‌చార్జి గోవింద్‌నాయక్‌ కోరారు. మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డుల్లో నాయకులు, కార్యకర్తలు తమకు సంబంధించిన ఓటర్లను ప్రభావితం చేయాలని, పార్టీ అభ్యర్థుల గెలుపునకు పని చేయాలని  కోరారు. ప్రభుత్వ సంక్షే మ పథకాలు, టీబీజీకేఎస్‌ సాధించిన విజయాలను ఓటర్లకు వివరిస్తూ ఓట్లు అభ్యర్థించాలని సూచించారు.

నాకో టీమ్‌ను ఇవ్వండి.. అభివృద్ధి చేస్తా

- ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
భూపాలపల్లి మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులను గెలిపించి నాకు 30 మంది టీమ్‌ను అప్పగించండి.. భూపాలపల్లి అభివృద్ధి ఏంటో నేను చూపిస్తా.. అని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. టీబీజీకేఎస్‌ కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. టీబీజీకేఎస్‌ నుంచి కొంతమంది నాయకులు టికెట్లు అడుగుతున్నారని, సమర్థులెవరో నిర్ణయించుకోవాలని, నిర్ణయం మీకే వదిలేస్తున్నానన్నారు. అవకాశం ఎవరికి వచ్చినా, అభ్యర్థులు ఎవరైనా పార్టీ నిర్ణయానికి కట్టుబడి పని చేయాలని కోరారు. టీఆర్‌ఎస్‌, టీబీజీకేఎస్‌ నాయకులు, కార్యకర్తలు 30 వార్డుల్లో అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేయాలని, అందరినీ గెలిపించి నాకు అప్పగిస్తే సీఎం వద్ద గుర్తింపు లభిస్తుందన్నారు. ఫలితంగా ఈ ప్రాంత అభివృద్ధితోపాటు కార్మికుల సమస్యల పరిష్కారం సులభతరమవుతుందన్నారు. భూపాలపల్లి ఏరియాకు సెంట్రల్‌ కమిటీ సభ్యులు, నెగోసియేషన్‌ కమిటీ సభ్యుడిని ఇవ్వాల్సిందేని టీబీజీకేఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రావును కోరారు. మున్సిపల్‌ ఎన్నికల్లో నాకు సహకరించి పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని, రాబోయే సింగరేణి ఎన్నికల్లో గుర్తింపు సంఘంగా టీబీజీకేఎస్‌ గెలుపునకు తాను కృషి చేస్తానన్నారు.


logo