శనివారం 04 ఏప్రిల్ 2020
Jayashankar - Jan 13, 2020 , 02:53:00

ఎన్నికల ఏర్పాట్ల పరిశీలన

ఎన్నికల ఏర్పాట్ల పరిశీలన


భూపాలపల్లి టౌన్‌, జనవరి 12 : భూపాలపల్లి ఏరియాలో జరుగనున్న మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను అడిషనల్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఏడీఎంఏ) అనురాధ ఆదివారం పరిశీలించారు. అనురాధ భూపాలపల్లిలో పర్యటించి పోలింగ్‌ కేంద్రాలను, కౌంటింగ్‌ కేంద్రాలను, స్ట్రాంగ్‌ రూంను పరిశీలించారు. ముందుగా కౌంటింగ్‌ హాల్‌ను సందర్శించి అందులో ఏర్పాట్లను పరిశీలించి కమిషనర్‌ సమ్మయ్య, టీపీవో గిరిధర్‌కు సలహాలు, సూచనలు అందించారు. కౌంటింగ్‌ హాల్‌లోకి కౌంటింగ్‌ ఏజెంట్లు, కౌంటింగ్‌ అధికారులు, వీఐపీలు తదితరుల రాక కోసం వేర్వేరుగా దారులను కేటాయించే విషయమై అధికారులతో చర్చించారు. కౌంటింగ్‌ హాల్‌లోకి వచ్చే పోలింగ్‌ ఏజెంట్లకు టీషర్ట్స్‌ లేదా జాకెట్లపై కౌంటింగ్‌ టేబుల్‌ నంబర్లు ముద్రించి ఇవ్వాలని కోరారు. ప్రెస్‌కు ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేయాలని, కౌంటింగ్‌ హాల్‌ ముందు జనాలు రాకుండా బారికేడింగ్‌ ఏర్పాటు చేయాలని, కౌంటింగ్‌ హాల్‌లో ఏజెంట్లకు, అధికారులకు భోజన సౌకర్యం, సులభ్‌ సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం మున్సిపల్‌ కార్యాలయాన్ని సందర్శించారు. మున్సిపల్‌ కార్యాలయంలో వార్డుల వారీగా ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ బూత్‌లను పరిశీలించారు. నామినేషన్ల విత్‌ డ్రా అనంతరం ఫైనల్‌ జాబితాను డిస్‌ప్లే చేయాలని కోరారు. కంప్యూటర్‌ రూంలోకి వెళ్లి ఓటర్ల జాబితాను పరిశీలించారు. పోలింగ్‌ కేంద్రాల వారీగా ఓటర్లను విభజించారా అని ప్రశ్నించగా కమిషనర్‌ ఇంకా చేయలేదని సమాధానమిచ్చారు. పోలింగ్‌ స్టేషన్‌కు 800 మంది ఓటర్ల చొప్పున విభజించాలని సూచించారు. రూట్‌ మ్యాప్‌లను పరిశీలించిన అనంతరం పీఎస్‌లకు దారి కోసం యారో మ్యాప్స్‌ పెట్టాలని కోరారు.

రూట్లలో బస్సులను కేటాయించారా అని అడిగి తెలుసుకున్నారు. కార్యాలయంలో అపరిశుభ్రతపై కమిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయంలోకి వెళ్తుండగానే ఎదురుగా బుక్స్‌, ఇతర చెడిపోయిన ఫర్నిచర్‌ దర్శనమివ్వడంతో ఇదంతా ఏంటని? కార్యాలయం ఉండేది ఇలాగేనా? వెంటనే తొలగించండి అంటూ ఆమె మండిపడ్డారు.


logo