ఆదివారం 29 మార్చి 2020
Jayashankar - Jan 13, 2020 , 02:51:35

పత్తి ఏరిన చేతితో అక్షరాలు దిద్దాలి

పత్తి ఏరిన చేతితో అక్షరాలు దిద్దాలి
  • జిల్లా కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లుభూపాలపల్లి టౌన్‌, జనవరి12: పత్తి ఏరిన చేతితోనే అక్షరాలు దిద్దాలని జిల్లా కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు రైతు కూలీలకు సూచించారు. ఆదివారం రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమం చివరిరోజు జిల్లా కలెక్టర్‌ భూపాలపల్లి మండలంలోని కమలాపూర్‌ గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో పాల్గొని గ్రామ అభివృద్ధి కోసం ప్రజలకు దిశా నిర్దేశం చేశారు. అనంతరం బుల్లెట్‌ బైక్‌పై ఆముదాలపల్లి గ్రామానికి బయల్దేరారు. మార్గమధ్యంలో పత్తి చేనులో కూలీలతో కలిసి పత్తిఏరారు. ఈ సందర్భంగా ఇంటర్మీడియెట్‌ చదువుతున్న విద్యార్థిని ఝాన్సీ పత్తి ఏరుతుండడంతో ఆమెతో కలెక్టర్‌ మాట్లాడారు. సంక్రాంతి సెలవుల సందర్భంగా పత్తి ఏరుతున్నానని, పండుగ తర్వాత కళాశాలకు వెళ్తానని తెలిపింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. సమయం వృథా చేయకుండా కుటుంబానికి ఆసరాగా నిలిచేందుకు పని చేయడం మంచి అలవాటని అభినందించారు. అదే విధంగా చదువును నిర్లక్ష్యం చేయకుండా ఉన్నతంగా చదువుకొని నచ్చిన రంగంలో స్థిరపడి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఝాన్సీకి సూచించారు. చదువురాని ప్రతిఒక్కరు ఈచ్‌ వన్‌-టీచ్‌ వన్‌ కార్యక్రమం ద్వారా చదువుకోవాలని సూచించారు. అనంతరం ఆముదాలపల్లి గ్రామంలో గ్రామస్తులతో కలిసి గ్రామంలో పర్యటించి గ్రామంలో సేంద్రియ పంటలను పరిశీలించారు. అలాగే, గ్రామస్తులతో కలిసి చీపురు పట్టి రోడ్డును శుభ్రం చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో పచ్చదనం-పరిశుభ్రత పరిస్థితులను పరిశీలించారు. సమస్యలను గ్రామస్తుల ద్వారా అడిగి తెలుసుకొని బక్కయ్య అనే నిరక్షరాస్యుడికి అక్షరాభ్యాసం చేయించి నేను మళ్లీ మీ గ్రామానికి వస్తానని, ఈ లోపు చదవడం, రాయడం నేర్చుకోవాలని సూచించారు. చదువు ద్వారా జ్ఞానం పెరిగి ప్రభుత్వ నిధుల వివరాలు తెలుసుకొని వాటిని గ్రామ సమగ్రాభివృద్ధికి ఎలా వాడుకోవాలో తెలుసుకోవాలన్నారు. గ్రామంలోని చదువుకున్న వారందరు నిరక్షరాస్యులకు చదువు చెప్పాలని, ప్రతినెల గ్రామ సభలు నిర్వహించి గ్రామ సమస్యలను గుర్తించి ప్రభుత్వ సహకారంతో గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని తెలిపారు. ఆముదాలపల్లి గ్రామం సేంద్రియ పంటలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచేలా గ్రామంలో సేంద్రియ పంటలను పండించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి, గ్రామ సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


logo