గురువారం 02 ఏప్రిల్ 2020
Jayashankar - Jan 12, 2020 , 04:36:05

మేడారంలో భక్తుల సందడి

మేడారంలో భక్తుల సందడి


తాడ్వాయి, జనవరి 11 : వరాలిచ్చే దేవతలు ఆదివాసీ గిరిజన దైవాలైన మేడారం సమ్మక్క-సారక్కలను దర్శించుకునేందుకు శనివారం అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచే కాకుండా పక్క రాష్ర్టాల నుంచి ప్రైవేట్‌ వాహనాల్లో భక్తులు మేడారం చేరుకున్నారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి అనంతరం కల్యాణకట్టలో తల్లులకు తలనీలాలు సమర్పించి అమ్మవార్ల గద్దెల వద్దకు చేరారు. గిరిజన సంప్రదాయ పద్ధతులలో అమ్మవార్ల గద్దెలపై పసుపు, కుంకుమ, ఎత్తుబెల్లం, నూతనవస్ర్తాలు, పూలు, పండ్లు సమర్పించి తల్లులకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు.  అనంతరం తల్లులకు యాటపోతులను సమర్పించి అమ్మవార్ల గద్దెల పరిసరాలతోపాటు చిలుకలగుట్ట, ఆర్టీసీ  బస్టాండ్‌, శివరాం సాగర్‌ చెరువు, జంపన్నవాగు దారిలోని చెట్ల కింద విడిది చేశారు. వంటలు చేసుకుని కుటుంబ సమేతంగా విందుభోజనాలు చేశారు. అమ్మవార్లను పెద్దపల్లి జిల్లా ధర్మపురి ఈవో శ్రీనివాస్‌లు దర్శించుకున్నారు. గిరిజన సంప్రదాయ పద్ధతులలో అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. 


logo