సోమవారం 06 ఏప్రిల్ 2020
Jayashankar - Jan 10, 2020 , 12:45:22

25వ తేదీ వరకు పనులు పూర్తి చేస్తాం

25వ తేదీ వరకు పనులు పూర్తి చేస్తాం

ములుగు, నమస్తే తెలంగాణ: ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు జరిగే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో అభివృద్ధి పనులను ఈ నెల 25వ తేదీ వరకు పూర్తి చేస్తామని, సేవా భావంతో జాతరను విజయవంతం చేస్తామని ఇన్‌చార్జి కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత జాతర అనుభవాల దృష్ట్యా ప్రత్యేక ప్రణాళిక రూపొందించి, భక్తులకు లోటు పాట్లు రాకుండా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. జాతరకు హాజరయ్యే భక్తులు ప్లాస్టిక్ ప్రత్యామ్నాయ వస్తువులతో రావాలని, ప్లాస్టిక్ రహిత జాతరకు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నామని చెప్పారు. జాతర అభివృద్ధి పనుల్లో నాణ్యతలో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు విజిలెన్స్ బృందాలను నియమించినట్లు తెలిపారు. జాతర నిధులను దుబారా కానివ్వబోమని, విజిలెన్స్ బృందాలు నిరంతరం పర్యవేక్షిస్తాయని చెప్పారు. జాతర అభివృద్ధి పనులు 80 శాతం పూర్తికావచ్చాయని, మిగతా పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామని తెలిపారు. అమ్మవార్ల కటాక్షంతో జాతరను విజయవంతం చేస్తామని వెల్లడించారు.


logo