శనివారం 04 ఏప్రిల్ 2020
Jayashankar - Jan 10, 2020 , 12:44:49

మేడారం పనుల నాణ్యతలో రాజీవద్దు!

మేడారం పనుల నాణ్యతలో రాజీవద్దు!

ములుగు జిల్లా ప్రతినిధి/నమస్తే తెలంగాణ: మేడారం జా తర అభివృద్ధి పనుల నాణ్యతలో రాజీ పడేది లేదని ములుగు ఇన్‌చార్జి కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. పనుల్లో నాణ్యత లోపిస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మేడారంలో జరుగుతున్న అభివృద్ధి పనులను కలెక్టర్ గురువారం పరిశీలించారు. ఊరట్టం, కన్నెపల్లి, పోలీస్ క్యాంప్, మరుగుదొడ్లు, హెలిప్యాడ్ పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పనుల్లో నాణ్యత లోపిస్తే సంబంధిత కాంట్రాక్టర్‌కు బిల్లులు నిలిపివేయాలని, ఇప్పటికే చెల్లించిన బిల్లులను రికవరీ చేయాలని ఆదేశించారు. సారలమ్మ ప్రవేశ ద్వారం నుంచి కన్నెపల్లి వరకు నిర్మించిన రోడ్డు పనులను చూశారు. గతంలో సీసీ రోడ్డుగా ఉన్న ఈ రోడ్డుపై ప్రస్తుతం పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ అధికారులు బీటీ రోడ్డు వేయడం, రోడ్డుపై గడ్డి మొలవడం వంటి ఘటనలను తీవ్రంగా పరిగణించారు.


పీఆర్ ఏఈ సస్పెన్షన్
రోడ్డు పనుల్లో నాణ్యత కొరవడినందుకు పంచాయతీ రాజ్ విభాగానికి చెందిన ఏఈ కే రమేశ్‌ను సస్పెన్షన్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పనుల నాణ్యతను పరిశీలించాల్సిన డీఈ, ఈఈలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని సూచించారు. ఈ రోడ్డు నిర్మాణంలో నిబంధనలు ఉల్లంఘించిన కాంట్రాక్టర్‌కు బిల్లుల చెల్లింపును ఆపాలని, ఇప్పటికే చెల్లించి ఉంటే వెంటనే రికవరీ చేయాలని ఆదేశించారు. అధికారులు సరైన పర్యవేక్షణ చేయాలని, కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా పనులు చేయడం మానుకోవాలని హెచ్చరించారు.

ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులపై ఆగ్రహం
ఊరట్టంలో చేపడుతున్న మరుగుదొడ్ల నిర్మాణంలో అలసత్వం ప్రదర్శిస్తున్న ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఊరట్టం పరిసరాల్లో భక్తుల కోసం నిర్మిస్తున్న మరుగుదొడ్లకు సెప్టిక్‌ట్యాంకు ఏర్పాటు చేస్తే దుర్వాసన వచ్చే అవకాశాలు ఉన్నాయని, ఈ మాత్రం గమనించలేని ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ మాణిక్యరావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరుగుదొడ్ల నిర్మాణంలో ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని తెలిపారు. మరుగుదొడ్లను నిర్మించకుండా, నిర్మించిన మరుగుదొడ్లు ఉపయోగంలోకి రాకుండా చేసి పరువు తీయొద్దని ఈఈపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకొని పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.

క్వాలిటీ కంట్రోల్ వింగ్ ఏర్పాటు
మేడారంలో జరుగుతున్న అభివృద్ధి పనుల నాణ్యతను పరిశీలించేందుకు క్వాలిటీ కంట్రోల్ విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. క్వాలిటీ కంట్రోల్ విభాగంతో పాటు విజిలెన్స్ విభాగాన్ని ఏర్పాటు చేసి నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలిస్తామని, నాణ్యత లోపిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారులు జవాబుదారీతనంతో పనిచేసి జాతర విజయవంతానికి కృషి చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా రెవెన్యూ అధికారి రమాదేవి, పీఆర్ ఈఈ రాంబాబు, డీపీవో వెంకయ్య తదితరులు ఉన్నారు.

పారిశుధ్య పనుల పరిశీలన
తాడ్వాయి: మేడారం జాతర పరిసరాల్లో జిల్లా పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పారిశుధ్య పనులను కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు గురువారం పరిశీలించారు. ఊరట్టంలో చేపట్టిన పారిశుధ్యం పనులను చూశారు. కూలీలతో కలిసి చెత్తను ట్రాక్టర్‌లో ఎత్తిపోశారు. ఇప్పటి వరకు ఎందరు కూలీలను నియమించారో..?, ఎక్కడెక్కడ పారిశుధ్య పనులు చేస్తున్నారో డీపీవో వెంకయ్యను అడిగి తెలుసుకున్నారు. 75 మంది కూలీలను విజయవాడ నుంచి తీసుకువచ్చామని డీపీవో తెలిపారు. జాతర పరిసరాల్లో చేపట్టిన పనుల వివరాలు తెలుసుకున్నారు. ఊరట్టం స్తూపం వద్ద చెత్త పోగై ఉండడంతో ఎందుకు తొలిగించడం లేదని ప్రశ్నించారు. భక్తులు విడిది చేస్తున్న నేపథ్యంలో ఎక్కువ వ్యర్థాలు పోగవుతున్నాయని, కూలీలు తక్కువ సంఖ్యలో ఉండడంతో ఎక్కువ పనులు చేయలేకపోతున్నామని, జాతరకు నాలుగు రోజుల ముందు నుంచి ఎక్కువ మంది కూలీలతో పూర్తిస్థాయిలో పనులు చేపడతామని డీపీవో చెప్పారు. గద్దెల పరిసరాలతో పాటు చిలకలగుట్ట, శిరాంసాగర్ చెరువు, కొంగలమడుగు, జంపన్నవాగు, ఊరట్టం, కన్నెపల్లి తదితర ప్రాంతాల్లో పారిశుధ్య పనులు చేపట్టామని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతర పరిసరాలు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చూడాలని, సేకరించిన చెత్తను డంపింగ్‌యార్డులకు తరలించాలని సూచించారు. కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటి సారి ఊరట్టం గ్రామానికి వచ్చిన కలెక్టర్‌ను సర్పంచ్ గొంది శ్రీధర్ శాలువాతో సత్కరించారు. కలెక్టర్ వెంట ఆర్డీవో రమాదేవి ఉన్నారు.


logo