e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, November 27, 2021
Home జయశంకర్ పాతాళ గంగ పైపైకి..

పాతాళ గంగ పైపైకి..

  • జయశంకర్‌ జిల్లాలో పెరుగుతున్న భూగర్భ జలాలు
  • 7.23 మీటర్ల సగటు లోతులో నీరు
  • చిట్యాల మండలంలో కేవలం 1.83 మీటర్ల లోతులోనే..
  • కాటారం, మహదేవపూర్‌ మండలాల్లో నీటి నిల్వల పెంపునకు అధికారుల కృషి

భూపాలపల్లి రూరల్‌, అక్టోబర్‌ 18 : జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో పాతాల గంగ పైపైకి వస్తున్నది. గత రెండు నెలలుగా కురిసిన వర్షాలతో భూగర్భ జలాలు భారీగా పెరిగాయి. గత ఏడాది సెప్టెంబర్‌లో 7.61 మీటర్ల లోతులో భూగర్భ జలం ఉండగా ప్రస్తుతం 7.23 మీటర్ల లోతులో ఉంది. గతంతో పోలిస్తే 0.38 మీటర్ల పైకి నీరు వచ్చింది. చిట్యాల మండలంలో 1.83 మీటర్ల లోతులో నీరు ఉండడం విశేషం. కాటారం మండలంలో 17.92 మీటర్లు, మహదేవపూర్‌ మండలంలో 11.53 మీటర్ల లోతులో ఉండడంతో అధికారులు నీటి నిల్వల పెంపునకు కృషి చేస్తున్నారు. ఆ మండలాల్లోని గ్రామాల్లో ఇంకుడు గుంతలు, చెక్‌డ్యామ్‌ల నిర్మాణాలు చేపట్టనున్నారు.

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో రెండు నెలలుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో భూగర్భ జలాలు పెరిగాయి. సెప్టెంబర్‌లో పడిన వర్షాలకు చెరువులు, కుంటలు, చెక్‌డ్యామ్‌లు నిండి అలుగు పోశాయి. ప్రాజెక్ట్‌లు నిండాయి. బోర్లు, బావుల్లో నీటి నిల్వలు పెరగడంతో వానాకాలం పంటతో పాటు యాసంగి సాగుకు కూడా నీటి ఇబ్బందులుండవని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరం సెప్టెంబర్‌లో 7.61 మీటర్ల లోతులో భూగర్భ జలం ఉండగా ప్రస్తుతం 7.23 మీటర్ల లోతులో ఉన్నాయి. గతంతో పోలిస్తే ప్రస్తుతం 0.38 మీటర్లపైకి పాతాళగంగ పైకి వచ్చింది. సెప్టెంబర్‌లో సాధారణ వర్షపాతం 123.6 మిల్లీ మీటర్లు ఉండగా అత్యధికంగా 395.8 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైంది. దీంతో భూగర్భ జలాలు పెరుగడంతో రైతులు ఎక్కువ మొత్తంలో వరి పంటను సాగు చేస్తున్నారు.

- Advertisement -

చిట్యాలలో 1.83 మీటర్ల లోతులోనే నీరు
సెప్టెంబర్‌లో చిట్యాల మండలంలో 1.83 మీటర్ల లోతులో నీరు ఉండగా కాటారం మండలంలో 17.92 మీటర్ల లోతులో నీరు ఉండడం ఆందోళన కలిగించే విషయంగా చెప్పవచ్చు. భూపాలపల్లి మండలంలో 2.78 మీటర్లు, గణపురం మండలంలో 2.63 మీటర్లు, మహాముత్తారం మండలంలో 1.86 మీటర్లు, మహదేవపూర్‌ మండలంలో 11.53 మీటర్లు, మల్హర్‌రావు మండలంలో 3.42 మీటర్లు, మొగుళ్లపల్లి మండలంలో 2.51 మీటర్లు, పలిమెల మండలంలో 5.82 మీటర్లు, రేగొండ మండలంలో 3.03 మీటర్లు, టేకుమట్ల మండలంలో 2.48 మీటర్ల లోతులో భూగర్భ జలాలు ఉన్నాయి.

కాటారంలో నీటి నిల్వల పెంపునకు అధికారులు కృషి
కాటారం మండలంలో 17.92 మీటర్లు, మహదేవపూర్‌ మండలంలో 11.53 మీటర్ల లోతులో నీటి నిల్వలు ఉండడంతో నీటి నిల్వలను పెంచడానికి జిల్లా అధికారులు ఇంకుడు గుంతలు, చెక్‌డ్యామ్‌ల నిర్మాణాలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. రెండు మండలాల్లో నీటి సంరక్షణ చర్యలు చేపట్టకపోతే రానున్న రోజుల్లో నీటి సమస్య మరింత తీవ్రరూపందాల్చే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. అక్టోబర్‌లో కురిసిన వర్షాలకు భూగర్భ జలాల నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉందని జిల్లా భూగర్భ జలశాఖ అధికారులు తెలిపారు.

నీటిని పొదుపుగా వాడుకోవాలి
వానకాలంలో వరి సాగు చేస్తున్న రైతులు నీటిని పొదుపుగా వాడాలి. ఆరుతడి పంటలను పండించేందుకు మొగ్గు చూపాలి. జిల్లాలో నీటి నిల్వల పెంపునకు ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నాము. నీటి పొదుపు వల్ల కలిగే లాభాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. కాటారం, మహదేవపూర్‌ మండలాల్లో నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయి. ఇందుకు చర్యలు చేపడుతున్నాం.
-శ్రీనివాసరావు, జిల్లా భూగర్భ జలశాఖ అధికారి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement