సకల వసతులతో వైకుంఠధామం
పచ్చని మొక్కలతో కళకళలాడుతున్న నర్సరీ
పాత భవనాలకూ మరమ్మతులు
ఇంటింటికీ ఇంకుడు గుంతలు
కమలాపూర్, మే 6:కమలాపూర్ మండలంలోని శంభునిపల్లిలో 1471మంది జనాభా ఉన్నారు. 1150 మంది ఓటర్లు ఉండగా, 450 ఇండ్లు ఉన్నాయి. పల్లె ప్రగతిలో భాగంగా ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో గ్రామంలో రూ. 2.40 లక్షలతో సెగ్రిగేషన్ షెడ్డు, రూ. 12.40 లక్షలతో వైకుంఠధామం, రూ. 5 లక్షలతో విలేజ్ పార్క్ నిర్మించారు. గ్రామంలో ప్రభుత్వ భూములు లేకపోవడంతో స్థానికుడు, కనకదుర్గ చిట్‌ఫండ్ చైర్మన్ రాగిడి తిరుపతిరెడ్డి 20 గుంటల భూమిని కొనుగోలు చేసి విరాళంగా అందజేశారు. ఈ భూమిలో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసి వివిధ రకాల మొక్కలు నాటారు. చివరి మజిలీ చింత తీర్చేందుకు అన్ని వసతులతో వైకుంఠధామం నిర్మించారు. నర్సరీలో 15 వేల పూలు, పండ్ల మొక్కలు పెంచుతున్నారు. హరితహారంలో భాగంగా గుంటూరుపల్లి-కానిపర్తి రోడ్డుకు ఇరువైపులా వెయ్యి మొక్కలు నాటి ట్యాంకర్‌తో నీళ్లు పడుతూ సంరక్షిస్తున్నారు. దీంతో మొక్కలు ఏపుగా పెరుగడంతో వాటి కింద స్థానికులు సేద తీరుతున్నారు. నిత్యం పారిశుధ్య పనులు చేపడుతూ వీధుల్లో చెత్తను పంచాయతీ ట్రాక్టర్‌తో డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. గ్రామంలో ప్రతి ఇంటికీ ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టి నీటిని బయటకు పోకుండా వాటిలోకి మళ్లించడంతో భూగర్భ జలాలు పెరుగుతున్నాయి.
కొనసాగుతున్న అభివృద్ధి పనులు
గ్రామంలో రూ. 25 లక్షలతో సీసీ రోడ్లు నిర్మించారు. 300 ఎల్ఈడీ బల్బులు ఏర్పాటు చేయడంతో రాత్రి వేళలో వెలుగులు పంచుతున్నాయి. పోచమ్మగుడి నుంచి ఆర్అండ్బీ రోడ్డు వరకు బీసీ కాలనీలో రూ. 5లక్షల నిధులతో డ్రైనేజీ కాల్వ నిర్మించారు. ప్రభుత్వ పాఠశాలలో రూ. 5లక్షలతో డైనింగ్ హాల్, కిచెన్ షెడ్ల నిర్మాణం పూర్తికాగా, పాత భవనాలకు రూ.5 లక్షలతో మరమ్మతులు చేయించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం పక్కనే బేస్మెంట్ లెవల్లో అసంపూర్తిగా ఉన్న పాతభవనాన్ని రూ. 2లక్షలతో పూర్తి చేసి వినియోగంలోకి తెచ్చారు. వ్యవసాయ బావుల వద్దకు వెళ్లేందుకు కలెక్టర్ మంజూరు చేసిన రూ. 11లక్షలతో మట్టి రోడ్ల పనులు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించారు.
పాలకవర్గం సహకారంతోనే..
పంచాయతీ పాలకవర్గ సహకారంతోనే అభివృద్ధి పనులు చేస్తున్నా. మిగిలిన సీసీ రోడ్లు, డ్రైనేజీలు పూర్తి చేస్తా. కరోనా వైరస్ నియంత్రణకు హైపోక్లోరైట్ ద్రావణం స్ప్రే చేస్తూ, తాగునీటి బావుల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నాం. పారిశుధ్య పనులు చేపడుతూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుతున్నాం.