e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 18, 2021
Home జనగాం చింత తీరేలా.. చెంతనే కొనుగోళ్లు

చింత తీరేలా.. చెంతనే కొనుగోళ్లు

  • సెర్ప్‌ ఆధ్వర్యంలో గ్రామాల్లో పంట ఉత్పత్తుల కొనుగోలు
  • గిట్టుబాటు ధర.. ఆదాయం పెరిగేలా ప్రోత్సాహం
  • మహిళా రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు కేంద్రాలు
  • రైతుల నుంచి కూరగాయలు, మామిడికాయల కొనుగోలు
  • అధిక ధర పొందుతున్న రైతులు.. నేరుగా ఖాతాల్లోకి డబ్బు
  • మధ్యదళారీ వ్యవస్థ నుంచి అన్నదాతకు విముక్తి
  • తప్పిన రవాణా ఖర్చులు, తరుగు బాధలు, కమీషన్లు

వరంగల్‌ రూరల్‌, జూలై 27(నమస్తే తెలంగాణ) : రైతులకు ఆదాయం పెంపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. ఈ నేపథ్యంలో రైతులను సంఘటిత పరిచేందుకు రైతు ఉత్పత్తిదారుల సంఘాల(ఎఫ్‌పీవో)ను ప్రోత్సహిస్తున్నది. వాటి ద్వారా గ్రామాల్లోనే పంట ఉత్పత్తులను కొంటూ గిట్టుబాటు ధర అందిసున్నది. ఇప్పటికే పౌర సరఫరాల సంస్థ ద్వారా ధాన్యం, మార్క్‌ఫెడ్‌ ద్వారా మక్కలు, కందులను మద్దతు ధరతో కొనుగోలు చేస్తుండగా, ఇప్పుడు కూరగాయలు, పండ్లు సాగుచేస్తున్న రైతులకూ గిట్టుబాటు ధర దక్కేలా సెర్ప్‌ను రంగంలోకి దింపింది. ఇందులో భాగంగా కొద్దినెలల క్రితం వరంగల్‌ రూరల్‌ జిల్లాలో ఎఫ్‌పీవోల ద్వారా కూరగాయలు, పండ్ల కొనుగోలు ప్రారంభమైంది. ఇప్పటికే సుమారు రూ.30 లక్షల కొనుగోళ్లు జరిగాయి. ఇందుకోసం సంగెం మండలం గాంధీనగర్‌లో విలేజ్‌ లెవల్‌ ప్రొక్యూర్‌మెంట్‌ సెంటర్‌(వీఎల్‌పీసీ) ఏర్పాటు చేశారు. మండలంలోని గాంధీనగర్‌, వంజరపల్లి, రామచంద్రాపురం, కొత్తగూడ, గవిచర్ల, వెంకటాపురం, తీగరాజుపల్లి గ్రామాల్లో టమాట, కాకరకాయ, వంకాయ, మిర్చి, స్వీట్‌కార్న్‌, బీరకాయ, పుచ్చకాయ పంటలు సాగవుతుండగా, ఇక్కడ రైతులకు అందుబాటులో ఉండేలా ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ఎఫ్‌పీవోలు నిర్వహిస్తున్న ఈ సెంటర్‌లో ఇప్పటివరకు రైతుల నుంచి 91,805 కిలోల టమాట, కాకరకాయ, వంకాయ, మిర్చి, స్వీట్‌కార్న్‌, బీరకాయ, పుచ్చకాయలను కొని హైదరాబాద్‌కు పంపారు. వీటి విలువ రూ.6,98,599 ఉంటుంది.

మామిడికాయల కొనుగోలు
మామిడికాయలు కొనుగోలు చేసేందుకు వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట, జగ్గుపేట, చెన్నారం, రాయపర్తి మండలం మహబూబ్‌నగర్‌, తిర్మలాయపల్లి, పర్వతగిరి మండలం కల్లెడ, వడ్లకొండ గ్రామాల్లో వీఎల్‌పీసీలు ఏర్పాటుచేశారు. ఈ కేంద్రాల్లో 40,748 కిలోల కాయలు కొని ఢిల్లీ, హైదరాబాద్‌కు పంపారు. వాటి విలువ రూ.18,57,304 ఉంటుంది. అలాగే చెన్నారావుపేట మహిళా రైతు ఉత్పత్తిదారుల సమాఖ్య ద్వారా 24మంది రైతుల నుంచి 3,387 కిలోల చింతపండును కూడా కొన్నారు. దీని విలువ రూ.1,38,360. ఇలా కాయగూరలు, మామిడికాయలు, చింతపండు అమ్మిన రైతులకు చెన్నారావుపేట మహిళా రైతు ఉత్పత్తిదారుల సమాఖ్య ద్వారా చెల్లింపులు జరిపారు. నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు.

- Advertisement -

రైతులకు గిట్టుబాటు ధర
సెర్ప్‌ ఆధ్వర్యంలో మహిళా ఎఫ్‌పీవోలు నిర్వహిస్తున్న వీఎల్‌పీసీల్లో ఉత్పత్తులను అమ్మిన రైతులకు గిట్టుబాటు ధర దక్కుతోంది. కొన్ని సందర్భాల్లో స్థానిక మార్కెట్‌లో ఉన్న ధర కంటే ఎక్కువ రేటే వస్తోంది. వరంగల్‌ మార్కెట్‌లో స్వీట్‌కార్న్‌కు కిలో ధర రూ.6 ఉంటే వీఎల్‌పీసీల్లో రైతులు ఈ ధర రూ.12 వరకు పొందారు. కాకరకాయ కిలో రేటు రూ.12 ఉంటే రూ.16, కిలో మిర్చి ధర రూ.12 ఉంటే రూ.17, కిలో బీరకాయ రేటు రూ.25 ఉంటే రూ.31 చొప్పున వీఎల్‌పీసీల్లో ధర పలికింది. ఈ సెంటర్లలో మామిడికాయలకు గరిష్ఠంగా కిలో ధర రూ.48 రైతులకు లభించింది. ఢిల్లీ మార్కెట్‌ ధర దక్కింది. మామిడికాయల ధరలు ఢిల్లీ మార్కెట్‌లో ఇక్కడి కంటే ఎక్కువ ఉన్న సమయంలో వీఎల్‌పీసీల్లో కొన్న మామిడికాయలను సెర్ప్‌ అధికారులు ఢిల్లీ మార్కెట్‌కు పంపారు. ఈ సెంటర్లలో కాయగూరలు, మామిడికాయలు, చింతపండు విక్రయించిన రైతులు మార్కెట్‌లో ఉన్న గరిష్ఠ ధరలు పొందారు. ఎక్కువగా హైదరాబాద్‌లోని బోయినపల్లి మార్కెట్‌లో పలికిన ధరలు వీరికి దక్కాయి. బోయినపల్లి మార్కెట్‌ రేట్లపైనే వీఎల్‌పీసీల్లో కొనుగోలు జరుగుతుంది.

ముందుగానే రేటు ఖరారు..
మా ఊళ్లో మేం టమాట, స్వీట్‌కార్న్‌, పుచ్చకాయలు సాగుచేస్తున్నం. గతంలో వీటిని మార్కెట్‌కు తీసుకెళ్లెటోళ్లం. నచ్చినా నచ్చకపోయినా వ్యాపారులు అడిగిన రేటుకు అమ్మాల్సి వచ్చేది. తరుగు పేరిట కొంత సరుకు పోయేది. ఒక్కోసారి మధ్యవర్తులకు కమీషన్‌ ఇయ్యక తప్పేది కాదు. ఇప్పుడా బాధ లేదు. సరుకు రెడీ కాగానే సెర్ప్‌ అధికారులకు సమాచారం ఇస్తున్నం. వాళ్లు బోయినపల్లి మార్కెట్‌ రేట్లు పంపిస్తరు. మంచి రేటున్నరోజు అమ్ముతమని చెపుతున్నం. ముందుగా నిర్ణయమైన ధరకు ఊళ్లోనే అమ్ముతున్నం. తరుగుపోయేది లేదు. వెంటనే మా బ్యాంకు ఖాతాలో డబ్బు జమైతది.

  • దండ సామ్రాజ్యం, రైతు, గాంధీనగర్‌

ప్రయోజనాలెన్నో..
వీఎల్‌పీసీల్లో కొనుగోళ్ల వల్ల రైతులెన్నో ప్రయోజనాలు పొందుతున్నారు. సెర్ప్‌ అధికారులు ఎప్పటికప్పుడు బోయినపల్లి మార్కెట్‌ ధరలను తమ నెట్‌వర్క్‌ ద్వారా రైతులకు తెలియజేస్తారు. గిట్టుబాటు ధరలు ఉన్న సమయంలో రైతులు తమ పంట ఉత్పత్తులను వీఎల్‌పీసీల్లో విక్రయించేందుకు సెర్ప్‌ అధికారులకు సమాచారం ఇస్తారు. ఈమేరకు ముందుగా అంగీకారం జరిగిన ధరలపై తమకు అందుబాటులో ఉన్న గ్రామాల్లోని వీఎల్‌పీసీల్లో అమ్ముతారు. 48గంటల్లోగా వీరి బ్యాంకు ఖాతాల్లో సెర్ప్‌ అధికారులు చెన్నారావుపేట మహిళా రైతు ఉత్పత్తిదారుల సమాఖ్య ద్వారా డబ్బు జమ చేస్తారు. దీంతో రైతులకు ఆదాయం కనపడుతుంది. తమ గ్రామాల నుంచి పంట ఉత్పత్తులను వాహనాల ద్వారా మార్కెట్‌కు తరలించడం, రోజుల తరబడి మార్కెట్‌లో వేచి ఉండడం, వ్యాపారులు అడిగిన రేటుకు అమ్మడం, తరుగు పేర క్వింటాల్‌కు కొన్ని కిలోలు కోత పెట్టడం, డబ్బు ఇచ్చినపుడు తీసుకోవడం, మధ్య దళారీలకు కమీషన్లు ఇవ్వడం, తీరా వ్యాపారులు కొనలేమంటే పంట ఉత్పత్తులను తిరిగి ఇంటికి తేవడం, రవాణా ఖర్చుల వంటి ఇబ్బందులు తప్పడంతో రైతులు సంతోషపడుతున్నారు.

మార్కెట్‌ కంటే చాలా నయం..
మార్కెట్‌కు తీసుకెళ్తే అక్కడ మామిడికాయలను ఏరెటోళ్లు. డ్యామేజ్‌ అని చెప్పి చాలా కాయలను పక్కన పెట్టెటోళ్లు. కిలో ధర రూ.50 ఉంటే వీటికి రూ.5 కట్టేది. తరుగు పేరిట టన్నుకు రెండు మూడు క్వింటాళ్లు కోతపెట్టేది. చాలా నష్టపోవాల్సి వచ్చేది. ఇప్పుడు మా ఊళ్లోనే అమ్ముకుంటున్నం. ముందుగానే కాయ రేటు చెపుతరు. దాని ప్రకారం తోటకాడికే వచ్చి కాయలను కాంటా వేసుకుంటరు. డ్యామేజ్‌ వంటివి ఉండవు. జాగ్రత్తగా ట్రేలల్ల తీసుకెళ్తరు. కిలోకు రూ.48 ఇచ్చిన్రు. ఖర్చులేమీ లేవు. సంతోషమనిపించింది. మార్కెట్‌ కంటే చాలా నయం.

  • చొప్పరి సునీత, మామిడి రైతు, దమ్మన్నపేట

రైతులకు ఎంతో లాభం..
రైతులకు ఆదాయం పెంపొందించేందుకు బెనిషన్‌ కంపెనీతో సెర్ప్‌ అవగాహన కుదుర్చుకుంది. ఈమేరకు కంపెనీ ప్రతినిధులు ఎప్పటికప్పుడు మార్కెట్‌ రేట్లను తెలియజేస్తారు. వీటిని రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు పంపిస్తాం. రైతులు వాటిని చూసి రేటు నచ్చితే తమ పంట ఉత్పత్తులను అమ్మేందుకు ముందుకొస్తారు. ఈ సమాచారంతో బెనిషన్‌ కంపెనీ ప్రతినిధులు సెర్ప్‌ అధికారుల ఆధ్వర్యంలో వీఎల్‌పీసీలో రైతుల పంట ఉత్పత్తులను కొంటా రు. ఎక్కువగా అధిక రేట్లు ఉండే బోయినపల్లి మార్కెట్‌ రేట్లపైనే కొనుగోలు జరుగుతుంది. రైతులకు ఇది లాభదాయకంగా ఉంటుంది. మధ్య దళారీ వ్యవస్థ, కమీషన్‌, రవాణా ఖర్చులు, తరుగు వంటివేవీ లేవు.

  • ఎం.సంపత్‌రావు, డీఆర్‌డీవో, వరంగల్‌ రూరల్‌
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana